తెలుగుకు బదులు సంస్కృతం!
Published Thu, Mar 13 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
కందుకూరు/తుంగతుర్తి, న్యూస్‌లైన్: ఇంటర్మీడియె ట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమన్న అధికారులు.. వారే రెండుచోట్ల బుధవారం మొదటిరోజు పరీక్ష ఆలస్యం కావడానికి కారణమయ్యూరు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో గంటన్నర, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు. వివరాలిలా ఉన్నారుు. కందుకూరులోని విద్యామయి జూనియర్ కళాశాల, కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు రెండురోజుల క్రితమే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సబ్జెక్టుల వారీగా సరఫరా అయ్యాయి. బుధవారం ఉదయం కందుకూరు చౌరస్తాలోని విద్యామయి జూనియర్ కళాశాల సిబ్బంది పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు తెచ్చారు.
9 గంటలకు పరీక్ష కావడంతో 8.45కు పార్శిల్ తెరిచి చూశారు. తెలుగు ప్రశ్నపత్రాలు కావలసి ఉండగా సంస్కృతం పేపర్లు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి కారులో తెలుగు ప్రశ్నపత్రాలు తీసుకుని ఉదయం 10.25 గంటల సమయంలో పరీక్షా కేంద్రానికి వచ్చారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష.. గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ విషయమై పరీక్షా కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. తమకు సరఫరా చేసిన సెట్ పైన ‘102 కోడ్ న్యూ సిలబస్ తెలుగు’ అని ఉందని, కానీ లోపల సంస్కృతం పేపర్లు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు తుంగతుర్తిలోని మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రానికి అధికారులు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రాలకు బదులు సంస్కృతం పేపర్లు పంపారు. ఉదయం సమయం కాగానే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి నిర్వాహకులు బండిల్ ఓపెన్ చేయగా తెలుగుకు బదులు సంస్కృతం ప్రశ్నపత్రాలు కనిపించాయి. వారు విషయం ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబుకు చెప్పారు. ఆయన హుటాహుటిన సూర్యాపేట, తిరుమలగిరి కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెలుగు పేపర్లు తెప్పించి విద్యార్థులకు అందజేశారు. దీంతో ఈ కేంద్రంలో విద్యార్థులు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పరీక్ష రాశారు.
Advertisement