దుష్టసంహారానికే శ్రీకృష్ణావతారం
కడప కల్చరల్ :
శ్రీకృష్ణ అవతారంలో ప్రధానంగా దృష్ట సంహారమే కనిపిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి సుందర చైతన్యానంద పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ మైదానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన మహాభాగవతం గురించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన కంస, తృణావర్తుని సంహారం, పూతన వధ ఘట్టాలను వివరించారు. శ్రీకృష్ణ లీలలలో సాక్షాత్తు పరమశివుడు కూడా భాగం పంచుకున్నాడని తెలిపారు. పోతన భాగవతంలో ఈ ఘట్టానికి సంబందించిన పద్యాలను వీనుల విందుగా వినిపించి అర్థాన్ని వివరించారు. కబీర్‌దాస్ రచనల్లో పువ్వులు తమ అల్ప జీవితం గురించి పడిన బాధను కూడా ఆయన వివరించారు. పలుమార్లు ఆయన మానవ నైజం గురించి సరదాగా వ్యాఖ్యానించారు. వర్షం కారణంగా ఆయన ప్రసంగానికి పలుమార్లు అంతరాయం కలిగింది. భక్తులు ఏమాత్రం చెక్కుచెదరక ఆయన ప్రసంగాన్ని వర్షానికి తడుస్తూనే వినడం విశేషం. కానీ వర్షం ఎక్కువ కావడంతో నిర్ణీత సమయానికి కొద్దిసేపు ముందే సభను ముగించారు.