విండీస్‌ 240/7 | West Indies to 240 for 7 in rain curtailed 3rd ODI | Sakshi
Sakshi News home page

విండీస్‌ 240/7

Published Thu, Aug 15 2019 4:04 AM | Last Updated on Thu, Aug 15 2019 4:31 AM

West Indies to 240 for 7 in rain curtailed 3rd ODI - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ పర్యటనలో టి20 సిరీస్‌ నుంచి వెంటాడుతున్న వరుణుడు ఆఖరి వన్డేకూ అడ్డు తగిలాడు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడో వన్డేలో భారత్, వెస్టిండీస్‌ పరస్పరం పై చేయికి ప్రయత్నిస్తున్న సమయంలో నేనున్నానంటూ వర్షం పలుకరించింది. మొత్తంమీద మూడు గంటలకుపైగా అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158/2తో ఉండగా వాన ఆటను నిలిపివేసింది.

విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (41 బంతుల్లో 72; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు)కు తోడు మరో ఓపెనర్‌ లూయిస్‌ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆతిథ్య జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కూడా దూకుడుగా ఆడారు. దాంతో విండీస్‌ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు.  

వాన... పరుగుల ఉప్పెన
భువనేశ్వర్‌ మెయిడిన్‌తో ప్రారంభమైంది విండీస్‌ ఇన్నింగ్స్‌. రెండో ఓవర్‌లో నోబాల్‌ సహా నాలుగు బంతులు పడ్డాయో లేదో వర్షం ప్రారంభమైంది. దాదాపు పది నిమిషాల అనంతరం తెరపినివ్వడంతో ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి వచ్చారు. మూడో ఓవర్లో భువీ ఒక్క పరుగే ఇవ్వడం, తర్వాత షమీ మెయిడిన్‌తో మ్యాచ్‌ నిస్సారంగా సాగేలా కనిపించింది. కానీ, వానను మించిన పరుగుల ఉప్పెన ఐదో ఓవర్‌ నుంచి మొదలైంది. భువీ బౌలింగ్‌లో లూయిస్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. అవతలి ఎండ్‌లో గేల్‌... షమీని ఆరేశాడు. మధ్యలో ఖలీల్‌పై లూయిస్‌  ప్రతాపం చూపాడు. 5 నుంచి 10వ ఓవర్‌ మధ్య విండీస్‌ ఓపెనర్లు ఏకంగా 101 పరుగులు పిండుకున్నారు.

వరద గేట్లెత్తిన తరహాలో వరుసగా 16, 20, 14, 16, 18, 17 చొప్పున పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్‌ ముగిసే సరికి 3.25తో ఉన్న కరీబియన్ల రన్‌రేట్‌ పదో ఓవర్‌ తర్వాత 11.40గా మారడం గమనార్హం. ఈ క్రమంలో 114/0తో 2015 ప్రపంచ కప్‌ తర్వాత పవర్‌ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా విండీస్‌ నిలిచింది. అయితే, చహల్‌ వస్తూనే లూయిస్‌ను ఔట్‌ చేయడం, గేల్‌ ఔటవడంతో ప్రత్యర్థికి కళ్లెం పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో హోప్, హెట్‌మైర్‌ 11 నుంచి 22వ ఓవర్‌ మధ్య 44 పరుగులే చేయగలిగారు. విండీస్‌ 158/2 వద్ద ఉండగా వర్షం 2 గంటలపైగా అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు తగ్గినట్టే తగ్గినా తిరిగి ప్రారంభమైంది.

గేల్‌ వీడ్కోలు... ఘనంగా... ఉద్వేగంగా: ఆటలో, ఆహార్యంలో, ప్రవర్తనలో దేనిలో చూసినా క్రిస్‌ గేల్‌ అంటేనే ప్రత్యేకత. అందుకే అతడు యూనివర్సల్‌ బాస్‌గా ప్రసిద్ధుడయ్యాడు. అలాంటి గేల్‌ చివరి వన్డే ఆడేశాడు. అది కూడా కాస్త ఘనంగానే...! కొంతకాలంగా పరుగులకు ఇబ్బందిపడుతున్న అతడు ఓ చక్కటి ఇన్నింగ్స్‌తో కెరీర్‌కు ముగింపు పలికాడు. బుధవారం 301వ వన్డే ఆడిన గేల్‌... ప్రతీకాత్మకంగా అదే నంబరు జెర్సీతో మైదానంలో దిగాడు. 

ఇక మూడో వన్డేలో ఇన్నింగ్స్‌ 8వ బంతికి వచ్చిన నోబాల్‌ ఫ్రీ హిట్‌ను డీప్‌ మిడ్‌ వికెట్‌లోకి సిక్స్‌ కొట్టడంతో గేల్‌ ప్రతాపం మొదలైంది. షమీ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకుని పూర్వపు విశ్వరూపాన్ని చూపాడు. మధ్యలో భువీని ఫోర్, సిక్స్‌తో సత్కరించిన గేల్‌ అనంతరం కుర్ర ఖలీల్‌ అహ్మద్‌కు రెండు సిక్స్‌లు, ఫోర్‌తో దడ పుట్టించాడు. సిక్స్‌తోనే అర్ధసెంచరీ (30 బంతుల్లో) అందుకున్నాడు. ఖలీల్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో 70ల్లోకి వెళ్లిన గేల్‌ దూకుడు చూస్తే సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. అయితే, ఆ వెంటనే భారీ షాట్‌ ఆడబోయి కోహ్లికి మిడాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిగిరాడు.

భారత ఆటగాళ్ల నుంచి వీడ్కోలు అభినందనలు అందుకుంటూ, ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు ప్రతిగా అభివాదం చేస్తూ, తనదైన శైలిలో హెల్మెట్‌ను బ్యాట్‌ హ్యాండిల్‌కు తగిలించి పైకెత్తి చూపుతూ మైదానాన్ని వీడాడు. ఈ సందర్భంగా గేల్‌–కోహ్లి ప్రత్యేక రీతిలో అభివాదం చేసుకోవడం విశేషం. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా 23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఘనత గేల్‌ సొంతం. వీటిలో ఎక్కువగా టి20 జట్లు ఉన్నప్పటికీ మరే క్రికెటర్‌కూ ఇది సాధ్యం కానిదే. భారత్‌తో తలపడే విండీస్‌ టెస్టు జట్టులో గేల్‌కు చోటు దక్కలేదు. టి20ల నుంచి తప్పుకోవడంపై అతడు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) కోహ్లి (బి) ఖలీల్‌ అహ్మద్‌ 72; లూయిస్‌ (సి) ధావన్‌ (బి) చహల్‌ 43; షై హోప్‌ (బి) జడేజా 24; హెట్‌మైర్‌ (బి) షమీ 25; పూరన్‌ (సి) మనీశ్‌ పాండే (సబ్‌) (బి) షమీ 30; హోల్డర్‌ (సి) కోహ్లి (బి) ఖలీల్‌ అహ్మద్‌ 14; బ్రాత్‌వైట్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 16; అలెన్‌ (నాటౌట్‌) 6; కీమో పాల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (35 ఓవర్లలో ఏడు వికెట్లకు) 240

వికెట్ల పతనం: 1–115, 2–121, 3–171, 4–171, 5–211, 6–221, 7–236.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 5–1–48–0, షమీ 7–1–50–2, ఖలీల్‌ 7–0–68–3, చహల్‌ 7–0–32–1, కేదార్‌ జాదవ్‌ 4–0–13–0, జడేజా 5–0–26–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement