అజొల్లా తయారీ ఇలా.. | easy process of azolla making | Sakshi
Sakshi News home page

అజొల్లా తయారీ ఇలా..

Published Sun, Aug 21 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

పొలంలో పెరుగుతున్న అజొల్లా నాచు మొక్కలు

పొలంలో పెరుగుతున్న అజొల్లా నాచు మొక్కలు

  • బహుళ ప్రయోజనకారి.. ఖర్చు లేకుండా నాచు మొక్కల పెంపకం
  • సులువుగా తయారీ విధానం.. వరికి ప్రాణం, పాడి పరిశ్రమకు ఊతం
  • తయారీ విధానాలపై వ్యవసాయ అధికారి సలహా సూచనలు
  • మిరుదొడ్డి: అజొల్లా.. నీటిలో తేలియాడే ఫెర్న్‌ జాతికి చెందిన నాచు మొక్క. వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించడం వల్ల ఈ నాచు మొక్కలు ఎక్కువ శాతం మాంసకృత్తులు కలిగిఉంటాయి. ఫలితంగా వరికి జీవ ఎరువుగా, పశువులకు మేతగా.. కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలకు దాణాగా ఉపయోగపడుతోంది. ఇంతటి లాభదాయకమైన అజొల్లాను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి ఎస్‌. నాగరాజు(సెల్‌: 72888 94461) తెలిపారు. అజొల్లా పెంచుకునే విధానంతో పాటు పాడిపశువులకు మేతగా ఎలా వినియోగించుకోవచ్చో ఆయన తెలిపిన వివరాలు..

    అజొల్లా తయారీ విధానం
    అజొల్లా పెంపకానికి సూర్యరశ్మి తక్కువగా ప్రసరించే స్థలాలు లేదా ప్రత్యేకంగా తయారుచేసిన షెడ్లు ఎంచుకోవాలి. 2.5 మీ. పొడవు, 1.5 మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతులో గుంతలు తీసుకోవాలి. వాటిలో సమభాగంగా నీరు నింపుకోవాలి. వరిపొలాలు, నీటి కుంటలు, సిమెంటు తొట్టెల్లో కూడా అజొల్లాను  పెంచుకోవచ్చు.

    వీటిలో అజొల్లా నారు వేసిన 7 నుంచి 10 రోజుల్లో నాచు మొక్కలు నీటిపై తేలుతూ సమభాగంలో పెరుగుతాయి. రోజుకొకసారి 20 గ్రాముల సూపర్‌ ఫాస్పేట్‌తో కొద్దిపాటి పశువుల పేడ నీటిలో కలిపితే మొక్కలు త్వరితగతిన పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన నాచు మొక్కలను రంధ్రాలు కలిగిన జల్లెడలో తీసుకుని మరో వరి పొలంలో వెసుకుంటే పెంపకానికి ఉపయోగపడుతుంది.

    తెగుళ్ల నివారణ
    అజొల్లాకు పురుగులు, తెగుళ్ల ఉదృతి తక్కువగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి అజొల్లా పెరుగుదల ఎక్కువైతే సహజంగా పురుగులు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. పురుగుల నివారణకు 5 మి.లీ. వేప నూనెకు ఒక లీటర్‌ నీటిని కలిపి పిచికారి చేయాలి. తెగుళ్ల నివారణకు సూడోమోన్‌పోరిసెన్స్‌ లేదా ట్రైకోడెర్మా విరిడిలను 100 గ్రాములు చొప్పున వాడాలి.

    దాణాగా అజొల్లా
    పొలంలో వేసిన అజొల్లా 7 నుంచి 10వ రోజు వరకు కిలో చొప్పున అభివృద్ధి చెందుతుంది. పెరిగిన అజొల్లా నాచు మొక్కలను రెండు కిలోల వరకు ఆరబెట్టి లేదా పచ్చిగా కానీ పాడి పశువులకు మేతగా వేసుకోవచ్చు. అజొల్లాను చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు మేతగా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. అజొల్లాను గొర్రెలు, మేకలు, బాతులు, కోళ్లు, చేపల దాణాలోనూ వినియోగించడం వల్ల మంచి లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి.

    వరి సాగుకు ఊతం
    వరి సాగు చేసే రైతులకు అజొల్లా నాచు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయి. రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి.. పంటకు కావాల్సిన నత్రజననిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొద్దిపాటి నాచు మొక్కలను పొలంలో వేసుకుంటే 30 రోజుల్లో పొలమంతా వ్యాపిస్తుంది. ఈ తరుణంలో నాచు మొక్కలను పొలంలో కలియ దున్నుకోవాలి.

    ఇలా చేయడం వల్ల నాచు మొక్కలు పొలంలో కుళ్ళిపోయి వరికి కావాల్సిన నత్రజనిని పుష్కలంగా అందిస్తుంది. ఎలాంటి ఖర్చు, శ్రమ లేకుండా తగినంత స్థలంలో నాచు మొక్కల పెంపకాన్ని చేపడితే ఏడాది పొడవునా పాడి పశువులకు మంచి దాణాతో పాటు వరికి ఊత0 ఇచ్చినట్టు అవుతుంది.

    పోషక విలువలు మెండుగా..
    నత్రజని: 5.0 శాతం
    మాంసకృత్తులు: 25 నుంచి 30 శాతం
    బాస్వరం: 0.5 శాతం
    కాల్షియం: 0.1 నుంచి 1.0 శాతం
    అమైనో ఆమ్లాలు: 10.0 శాతం
    ఇనుము: 0.26 శాతం
    పొటాషియం: 2.0 నుంచి 4.5 శాతం
    చక్కెర: 3.4 నుంచి 3.5 శాతం
    పిండిపదార్థం: 6.5 శాతం

Advertisement

పోల్

Advertisement