ఎలిషా..ఎంత పని చేశావప్పా! | elisha murder drama | Sakshi
Sakshi News home page

ఎలిషా..ఎంత పని చేశావప్పా!

Published Tue, Jul 4 2017 12:29 AM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM

ఎలిషా..ఎంత పని చేశావప్పా! - Sakshi

ఎలిషా..ఎంత పని చేశావప్పా!

- తననెవరో హత్యచేసి.. మృతదేహాన్ని తగులబెట్టినట్టుగా సీన్‌
- హత్యగానే నమ్మిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
- సెల్‌ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
 
జూపాడుబంగ్లా (నందికొట్కూరు) : కర్నూలుజిల్లాలో సంచలనం సృష్టించిన ఎలిషా కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ‘బాధితుడే’..నిందితుడయ్యాడు. అప్పులోళ్ల  నుంచి తప్పించుకునేందుకు ‘హత్య’ డ్రామా ఆడాడు. అయితే, ఈ కేసును ‍ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు..అసలు విషయాన్ని బయటపెట్టారు. ‘ఎలిషా హత్య’ ఎపిషోడ్‌ మొత్తం కట్టుకథగా తేల్చిపారేశారు. అతను నిక్షేపంగా ఉన్నాడంటూ ప్రకటించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. గత నెల 19న జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామ సమీపంలోని పొలాల్లో శవం కాలుతున్నట్లు గ్రామస్తులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు, గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ లభించిన ద్విచక్రవాహనం, దుస్తులు, సెల్‌ఫోన్‌ ఆధారంగా ఎలిషా అనే వ్యక్తి హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి కట్టెలపై పెట్టి కాల్చివేశారని భావించారు. అప్పటి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును త్వరగా ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. అయితే.. పోలీసు దర్యాప్తులో ఎలిషా బతికున్నాడనే వాస్తవం వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేయడంతో అసలు విషయం చెప్పాడు.
 
అప్పులోళ్ల బాధ తప్పుతుందని..
ఎలిషాకు రూ.12 లక్షల దాకా అప్పులున్నాయి. రుణదాతలు ఒత్తిడి చేయటంతో అప్పులు తీర్చేందుకుగాను గొర్రెలను రూ.10.50 లక్షలకు విక్రయించాడు. వాటిని కొన్న వ్యక్తి జూన్‌ నెలాఖరులోగా డబ్బు ఇస్తానని చెప్పాడు. అయితే.. అతను ఇవ్వకపోవడంతో పాటు రుణదాతల నుంచి ఒత్తిడి అధికమైంది. దీంతో ఎలిషా తాను హత్యకు గురైనట్లు పథకం రూపొందించి..అమలు చేశాడు.
 
సీన్‌ ఇలా సృష్టించాడు..
 గత నెల 18న నందికొట్కూరులో ఓ జత దుస్తులు, కొత్త సెల్‌ఫోన్‌ , ఏడు బాటిళ్లలో 14 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేశాడు. శ్మశానంలోని పుర్రెలు, ఎముకలతో పాటు కొన్ని చనిపోయిన గొర్రెల ఎముకలు సేకరించాడు. సొంత పొలం వద్దకు చేరుకున్నాడు. కట్టెలు పేర్చి వాటిపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టాడు. కాలి బూడిదైన తర్వాత పుర్రె, ఎముకలను పేర్చి మనిషిని కట్టెలపై పెట్టి కాల్చినట్లుగా చిత్రీకరించాడు. మద్యం అలవాటు లేకున్నా.. క్వార్టర్‌ మద్యం తెచ్చుకొని మందు కింద పోసి ఖాళీ సీసా ఉంచాడు. పాత దుస్తులు, పాత సెల్‌ఫోన్‌ (అందులో ఓ సిమ్‌కార్డు తీసుకున్నాడు), చెప్పులు, ద్విచక్రవాహనం అన్నీ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
 
తాను బతికి ఉన్నట్లుగా భార్య, తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు ఎలిషా చనిపోయినట్లుగా నిర్ధారించుకుని.. బూడిదను తెచ్చి అంత్యక్రియలు చేశారు. దినవారాలు కూడా చేశారు. భార్య అరుణమ్మ వితంతువుగా మారింది. కాగా.. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఎలిషా నందికొట్కూరులో కొత్త సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసిన విషయాన్ని తెలుసుకున్నారు. సదరు షాపునకు వెళ్లి బిల్లు ఆధారంగా సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ తీసుకున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు.  ఆ సెల్‌ నుంచి ఓ మహిళ(ఎలీషా ప్రియురాలు)కు కాల్స్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. అలాగే అతని ఆచూకీని సులభంగానే తెలుసుకున్నారు. విచారణ అనంతరం సోమవారం అతన్ని జూపాడు బంగ్లా పోలీసుస్టేషన్‌లో మీడియా ముందుకు తెచ్చారు. ఎలిషా బతికే ఉండడంతో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement