వాహనాలను పరిశీలిస్తున్న సిబ్బంది
విజయనగరం రూరల్ : రాష్ట్ర, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డీసీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. కొమరాడ మండలం గొనకల్లు, గుర్లిమ్మ గ్రామాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పార్వతీపురం, సాలూరు, తెర్లాం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 50 లీటర్ల నాటుసారా, 500 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఐదు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీ టి.నాగలక్ష్మి కొమరాడ చెక్‌పోస్టులో రికార్డులు తనిఖీ చేశారు. సరిహద్దు రహదారిపై వాహనాలను పరిశీలించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌చార్జి ఏసీ ఎ.శంభూప్రసాద్, ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి, 50 మంది సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.