కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు | Odisha Government Plans To Occupy Kotiya Village At Border | Sakshi
Sakshi News home page

కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు

Published Tue, Aug 17 2021 9:34 AM | Last Updated on Tue, Aug 17 2021 2:04 PM

Odisha Government Plans To Occupy Kotiya Village At Border - Sakshi

1896లో కొటియా ప్రజలకు జారీ చేసిన భూమిశిస్తుకు సంబంధించిన తామ్రపత్రం

సాక్షి, ప్రతినిధి విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

34 గ్రామాలు.. 15 వేల మంది జనాభా..
విజయనగరం జిల్లా సాలూరుకు అటు, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాకు మధ్యలో కొటియా గ్రూపు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. పట్టు చెన్నేరు గ్రామ పంచాయతీలో 12, పగులు చెన్నేరులో నాలుగు, గంజాయిభద్రలో 13, సారికలో రెండు, కురుకూటిలో రెండు, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936లో ఒడిశా, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వారిని ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది. అయితే కొటియా గ్రామస్తులంతా ఆంధ్రాకి చెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతోపాటు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. అలాగే, ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని తమకూ వర్తింపజేయాలని కొటియా గ్రామస్తులు కోరుతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కొనసాగాయి. వైఎస్సార్‌ హఠాన్మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొటియా గ్రామాలను పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వమైతే పూర్తిగా కొటియా ప్రజలను విస్మరించింది. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహంతో కోరాపుట్‌కు చెందిన అధికారులు, రాజకీయ నేతలు కొటియా గ్రామాలపై కన్నేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే కొటియా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది గమనించిన ఒడిశా నేతలు ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.180 కోట్లు మంజూరయ్యాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కొటియా ప్రజల పరాబ్‌ పండుగకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. కొటియాలో పది పడకల ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్, పాఠశాలల వంటి శాశ్వత భవనాల నిర్మాణ పనులను ఆగమేఘాలపై చేస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను చూపిస్తున్న ధూళిభద్ర గ్రామ గిరిజనులు

సంక్షేమ ఫలాలు అందుతున్నాయి..  
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మా కొటియా గ్రామాలకు అందుతున్నాయి. పూర్వం నుంచి మేము తెలుగు వాళ్లమే. మా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంచాలి.
– కూనేటి కుసి, సర్పంచ్, పగులుచెన్నేరు, సాలూరు మండలం

మేము ఆంధ్రా వాళ్లమే..
మా భూముల శిస్తు, తదితర లావాదేవీలకు సంబంధించి రాగిరేకులపై రాసిన తామ్ర పత్రాలు ఉన్నాయి. అవన్నీ సాలూరు తాలూకా అని తెలుగులో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మేము ఆంధ్రా వాళ్లమే. ఒడిశా మా గ్రామాలను కలుపుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తోంది. ఇప్పటికైనా మా గ్రామాల రక్షణ బాధ్యత తీసుకోవాలి.
– గమ్మెల బీసు, ఉప సర్పంచ్, గంజాయిభద్ర, సాలూరు మండలం  

అభివృద్ధికి అటవీ శాఖ అడ్డంకులు
కొటియా గ్రామాల ప్రజలు రోడ్లు వేయాలని కోరుతున్నారు. రోడ్ల నిర్మాణానికి విజయనగరం జిల్లా అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. మరోవైపు ఒడిశా ఆగమేఘాలపై రోడ్లు నిర్మిస్తోంది. యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేస్తోంది. 
– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా 

కొటియాలో సంక్షేమ పథకాల అమలు 
కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తున్నాం. వారంతా ఆంధ్రాలో కలిసి ఉంటామని అడుగుతున్నారు. కొటియా గ్రామాల్లో అంగన్‌వాడీ, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం కొటియా గ్రామాల్లో వాటికి శంకుస్థాపనలు చేయనున్నాం.
– ఆర్‌.కూర్మనాథ్, పీవో, ఐటీడీఏ, పార్వతీపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement