Orissa border
-
కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు
సాక్షి, ప్రతినిధి విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 34 గ్రామాలు.. 15 వేల మంది జనాభా.. విజయనగరం జిల్లా సాలూరుకు అటు, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు మధ్యలో కొటియా గ్రూపు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. పట్టు చెన్నేరు గ్రామ పంచాయతీలో 12, పగులు చెన్నేరులో నాలుగు, గంజాయిభద్రలో 13, సారికలో రెండు, కురుకూటిలో రెండు, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936లో ఒడిశా, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వారిని ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది. అయితే కొటియా గ్రామస్తులంతా ఆంధ్రాకి చెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతోపాటు ఆంధ్రప్రదేశ్ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. అలాగే, ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని తమకూ వర్తింపజేయాలని కొటియా గ్రామస్తులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కొనసాగాయి. వైఎస్సార్ హఠాన్మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొటియా గ్రామాలను పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వమైతే పూర్తిగా కొటియా ప్రజలను విస్మరించింది. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహంతో కోరాపుట్‌కు చెందిన అధికారులు, రాజకీయ నేతలు కొటియా గ్రామాలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కొటియా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది గమనించిన ఒడిశా నేతలు ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.180 కోట్లు మంజూరయ్యాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కొటియా ప్రజల పరాబ్ పండుగకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. కొటియాలో పది పడకల ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్, పాఠశాలల వంటి శాశ్వత భవనాల నిర్మాణ పనులను ఆగమేఘాలపై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను చూపిస్తున్న ధూళిభద్ర గ్రామ గిరిజనులు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మా కొటియా గ్రామాలకు అందుతున్నాయి. పూర్వం నుంచి మేము తెలుగు వాళ్లమే. మా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంచాలి. – కూనేటి కుసి, సర్పంచ్, పగులుచెన్నేరు, సాలూరు మండలం మేము ఆంధ్రా వాళ్లమే.. మా భూముల శిస్తు, తదితర లావాదేవీలకు సంబంధించి రాగిరేకులపై రాసిన తామ్ర పత్రాలు ఉన్నాయి. అవన్నీ సాలూరు తాలూకా అని తెలుగులో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మేము ఆంధ్రా వాళ్లమే. ఒడిశా మా గ్రామాలను కలుపుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తోంది. ఇప్పటికైనా మా గ్రామాల రక్షణ బాధ్యత తీసుకోవాలి. – గమ్మెల బీసు, ఉప సర్పంచ్, గంజాయిభద్ర, సాలూరు మండలం అభివృద్ధికి అటవీ శాఖ అడ్డంకులు కొటియా గ్రామాల ప్రజలు రోడ్లు వేయాలని కోరుతున్నారు. రోడ్ల నిర్మాణానికి విజయనగరం జిల్లా అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. మరోవైపు ఒడిశా ఆగమేఘాలపై రోడ్లు నిర్మిస్తోంది. యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేస్తోంది. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా కొటియాలో సంక్షేమ పథకాల అమలు కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తున్నాం. వారంతా ఆంధ్రాలో కలిసి ఉంటామని అడుగుతున్నారు. కొటియా గ్రామాల్లో అంగన్వాడీ, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం కొటియా గ్రామాల్లో వాటికి శంకుస్థాపనలు చేయనున్నాం. – ఆర్.కూర్మనాథ్, పీవో, ఐటీడీఏ, పార్వతీపురం -
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందగా, మావోయిస్టులకు చెందిన 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ స్పందించారు. 'ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్‌పొదర్ సమీప నున్ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఈ ఆధారంతో ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంబించారు. ఇరువర్గాలు మధ్య సుమారు 45 నిముషాలు పాటు కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించగా ఒక గుర్తుతెలియని మావోయిస్టు మృతదేహం లభించింది. దీంతోపాటు ఒక పిస్టల్, దేశీయ తుపాకీ, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలను స్వాధీనం చేసుకున్నారని' తెలిపారు.ఈ సందర్బంగా ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారిని ఆదుకోవడానికి సిధ్దంగా ఉన్నామని, తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపారు. -
మావోయిస్టుల వార్తలు రాస్తే పాత్రికేయులను హత మార్చండి..!
జయపురం(ఒడిశా): రాష్ట్ర సరిహద్దున గల మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పాత్రికేయులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. తమ సమాచారాలను పోలీసులకు అందజేస్తున్నారన్న ఆరోపణతో మావోయిస్టులు వారిని హతమారుస్తుండగా, మావోయిస్టులకు పోలీసుల సమాచారం అందిస్తున్నారని నిందిస్తూ ఖాకీలు వారిపై దాడులు జరుపుతున్నారు. ఉభయ వర్గాల మధ్య నలిగిపోతున్న పాత్రికేయులపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజాపూర్ పోలీసు అధికారి ఒకరు పోలీసులకు మరో ఆదేశం జారీ చేయడం పాత్రికేయులలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు సమాచారం. బీజాపూర్ పోలీస్ అ«ధికారి ఒకరు విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లో మావోయిస్టుల వార్తలు రాసే పాత్రికేయులను హతమార్చండి అని తన ఆధీనంలో ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో బుధవారం ఒక వీడియో క్లిప్పింగ్ ప్రచారమైంది. –ఆ వీడియో క్లిప్పింగ్‌లో ఒక ఉన్నత పోలీసు అధికారి, మావోయిస్టులకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తే ఆ పాత్రికేయులను హతమార్చండి అని తన పరిధిలోగల పోలీసులను ఆదేశించారని ఆరోపణ. ఈ విషయంలో బీజాపూర్ ప్రెస్‌క్లబ్ తరఫున ఒక క్లిప్పింగ్ ప్రజలకు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్లిప్పింగ్‌లో ఒక ఉన్నత పోలీసు అదికారి హిందీ భాషలో ఆదేశించిన విషయం ఇలా ఉంది. ‘రెహనా, ఉదర్ సే కోయి పత్రకార్ దేఖె జో నక్సలియోంకో ఖబర్ కరనే కేలియే గయాహో తె ఉసే గోలి మారి మరిదే(హైఅలర్ట్‌గా ఉండండి. ఆ వైపు ఎవరైనా పాత్రికేయుడు కనిపిస్తే అతడు నక్సలైట్లకు సమాచారం అందించేందుకు వెళ్తే తుపాకీ తూటాలతో కాల్చండి) అని ఉంది. దీనిపై ఆ ప్రాంత జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్లిప్పింగ్‌లో బీజాపూర్ జిల్లా పోలీస్‌ఉన్నతాధికారి, పోలీసులకు ఇటువంటి ఆదేశాలు జారీ చేశారని దీనిని తాము నిరసిస్తున్నామని సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు ప్రాంతంలో పని చేయడం కష్టం పోలీసులకు సమాచారం అందిస్తున్న వారిగా అనుమానిస్తూ జర్నలిస్టులను మావోయిస్టు హతమారుస్తున్నారని పాత్రికేయులు మావోయిస్టుల సమర్థకులని భావిస్తూ వారిపై దాడి చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పాత్రికేయులు పనిచేయడం చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వెల్లడి కావడంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు స్వతంత్ర డీజీ(నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ విభాగం) డీఎన్ అవష్థి ఆ వీడియో క్లిప్పింగ్‌పై దర్యాప్తుచేసేందుకు ఆదేశించారు. దీనిలో ఏ పోలీసు అధికారికి సంబంధం ఉన్నా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.ఇదే నిజమైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పాత్రి కేయులు, మీడియా ప్రతినిధులు పనిచేయడం ప్రాణాలను పణంగా పెట్టడమేనని భయపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసే పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని పాత్రికేయులు కోరుతున్నారు. -
ఏఓబీ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలి :విమలక్క
హైదరాబాద్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ చైర్పర్సన్ విమలక్క డిమాండ్ చేశారు. మంగళవారం అరుణోదయ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఇవి రెండు ప్రభుత్వాలు జరిపిన హత్యలేనని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రోజుల మహాసభలు విజయవంతమయ్యాయని, పలు డిమాండ్లపై పోరాటానికి నిర్ణయించామని చెప్పారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్ మార్గదర్శకంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మేసే పథకంలో భాగంగా మనువాద బ్రహ్మణవాద మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందన్నారు. ఆదివాసీలకు స్వయం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ప్రాంతాల్లో వారికే సర్వాధికారానికై పోరాడాలన్నారు. తెలంగాణలో 30 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పరిచి కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రభుత్వ కుట్రలను, ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్‌రోడ్ల పేరిట లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను, వాటిపై ఆధారపడి జీవనం సాగించే గ్రామీణ ప్రజానీకాన్ని రోడ్డు పాలు చేసే ప్రభుత్వ పథకాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అరుణోదయ తెలంగాణ, ఆంధ్రా కమిటీలు మహాసభల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు తెలంగాణ, ఆంధ్ర కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌గా విమలక్క, అధ్యక్షుడుగా మోహన్ బైరాగి, ఉపాధ్యక్షులుగా నూతన్, లచ్చన్న, కార్యదర్శిగా సురేశ్, సోమయ్య, కోశాధికారిగా యాది, కార్యవర్గ సభ్యులుగా అనిల్, సారుుదా, లింగం, భాస్కర్, నాగరాజు, సాయి ఎన్నికయ్యారు. ఆంధ్రా కమిటీ అధ్యక్షుడుగా బొరుసు వెంకన్న, ఉపాధ్యక్షునిగా పీతామోహర్, ప్రధాన కార్యదర్శిగా డి. కృష్ణ, కార్యదర్శులుగా సుధాకర్, నాగన్న, కోశాధికారిగా సామ్యేలు, కార్యవర్గ సభ్యులుగా రాజు, మణి ఎన్నికయ్యారు.