కాసులు ఖాళీ | Failed to meet the gap | Sakshi
Sakshi News home page

కాసులు ఖాళీ

Published Thu, Aug 11 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

కాసులు ఖాళీ

కాసులు ఖాళీ

  • ఖజానాలో నిధుల్లేక నిలిచిన బిల్లులు
  • దహన సంస్కారాల బిల్లూ చేయలేదు
  • ఆంక్షలతో పెన్షనర్లు, ఉద్యోగుల సతమతం
  • జీపీఎఫ్, టీఏ, అభివృద్ధి నిధులు ఎక్కడివక్కడే..
  • lబ్లీచింగ్, పారిశుద్ధ్యం బిల్లులూ అంతే..
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: ‘ఖమ్మం డివిజనల్‌ పంచాయతీ అధికారి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దహన సంస్కారాల కోసం రూ.20 వేల తక్షణ సాయం అందించేందుకు అధికారులు ఖజానాకు బిల్లు పెట్టారు. ఫ్రీజింగ్‌ నెపంతో అత్యవసర సేవలకు సైతం విఘాతం కలిగింది. జిల్లా ఖజానా అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకు తాము బిల్లులు క్లియర్‌ చేస్తామని చెబుతున్నారు. ఆంక్షల కారణంగా ఆ ప్రభుత్వోద్యోగి కుటుంబం సాయం పొందలేకపోయింది.’
    ఎక్కడివక్కడే..
    ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. ఖజానాలో కాసులు లేక ఖాళీ అయింది. వివిధ శాఖలకు అందించే ఖర్చులు, పాలనకు సరిపడా నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆంక్షల ప్రభావంతో జిల్లాలోని పలు శాఖల బిల్లులు నిలిచిపోయి ఆర్థిక అంతరాయం ఏర్పడింది. ప్రతి నెలా జీతాల బిల్లులు 22 తేదీలోపు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. కానీ నెలాఖరులో పంపిన బిల్లులు సైతం నిలిచాయి. జీపీఎఫ్, టీఏ బిల్లులు కూడా క్లియర్‌ చేసేందుకు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో చెల్లింపుల్లో ఆటంకం ఏర్పడటంపై పలు శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీజింగ్‌ను ఎత్తివేయకపోవడంతో పలు అభివృద్ధి పనుల బిల్లులు నిలిచిపోయాయి. ఈ ఆంక్షలతో పోలీస్‌శాఖతో పాటు పలు శాఖల ఉద్యోగులకు రావాల్సిన రూ. కోట్ల టీఏ బిల్లులు ఆగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈ జాప్యంతో మొదటి తేదీన వేతనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. గత నెల 25వ తేదీ వరకు తీసుకున్న పలు రకాల బిల్స్, 20 వరకు తీసుకున్న టీఏ బిల్స్‌ను క్లియర్‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.  20వ తేదీ తరువాత వచ్చిన బిల్లులు ఇప్పట్లో చేసే అవకాశం లేదంటున్నారు.
    ప్రదక్షిణలు..
    ట్రెజరీ నుంచి బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో ఖజానా, ఎస్టీఓ కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు, పెన్షనర్లు, పలు అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్, ఎయిడెడ్‌ ఉద్యోగులు, పోలీస్‌శాఖ ఉద్యోగులు బారులు తీరారు. ప్రభుత్వం బిల్లులు క్లియర్‌ చేయకపోతే మురిగిపోతాయని, ఇప్పట్లో ఆ బిల్లులు వచ్చే అవకాశం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలు కూడా అందడం కష్టంగా ఉంది. హాస్టల్‌ విద్యార్థుల సోప్‌ అండ్‌ ఆయిల్, డైట్‌ బిల్లులు, భవనాల అద్దెలు, సరెండర్‌ లీవ్, ఈజీఎల్, ఫ్యామిలీ బెనిపిట్‌ ఫండ్, ఎప్లాయీస్‌ వెల్ఫేర్‌ ఫండ్, ఇతర ఖర్చులు నిలిచిపోయాయి. ప్రభుత్వ వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ బిల్లులు కూడా రాకపోవడంతో అధికారుల జేబుల నుంచి, ఇతర శాఖల నుంచి అప్పు చేసే పరిస్థితి నెలకొంది. అధికారులు వాడే పలు ప్రైవేట్‌ వాహనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో డ్రైవర్లకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, బ్లీచింగ్, పారిశుద్ధ్యం బిల్లులు కూడా నిలిచిపోయాయి. దీనిపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆదాయ వనరులు, ఖర్చు, ద్రవ్య వినియోగబిల్లులపై స్పష్టత లేకుండా పోయిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement