విధిరాత.. మృత్యుగీత | Fate writing | Sakshi
Sakshi News home page

విధిరాత.. మృత్యుగీత

Published Fri, May 12 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

విధిరాత.. మృత్యుగీత

విధిరాత.. మృత్యుగీత

- షాద్‌నగర్‌ ప్రమాదంలో చింతమాన్‌పల్లెకు చెందిన నలుగురి మృతి
- మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు
- తండ్రికి వైద్యం చేయించేందుకు వస్తుండగా ఘటన
 
సి.బెళగల్: వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు వద్ద రెన్నాళ్లు గడుపుదామని వెళ్లారు. కష్టాలు, అనుభవాలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తుండగా స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన తండ్రికి వైద్యం చేయించేందుకు కుమారుడు కుటుంబ సభ్యులతో కారులో బయలుదేరారు. లారీ రూపంలో మృత్యువు చీకటిలో మాటు వేసి అందరినీ కబళించింది. తెలంగాణ రాష్ట్రం షాద్‌నగర్‌ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సి.బెళగల్‌ మండలం చింతమానుపల్లెకు చెందిన నలుగురితో పాటు గుర్తు తెలియని కారు డ్రైవర్‌ కూడా దుర్మరణం చెందాడు. చింతమానుపల్లెకు గ్రామానికి చెందిన బత్తిన సోమన్న(69), బత్తిన నర్సమ్మ(67) దంపతుల చిన్న కుమారుడు బత్తిన సోముడు(38) హైదరబాద్‌లో 15 ఏళ్లుగా బేల్దారి పని చేస్తూ జీవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు వద్ద రెండు రోజులు ఉండేందుకు నెల క్రితం వెళ్లారు.
 
ఈ క్రమంలోనే గురువారం ఉదయం బాత్‌రూంలో బత్తిన సోమన్న కాలుజారి గాయపడ్డాడు. అతనికి కాలుకు కట్టుకట్టించేందుకు కుమారుడు సోముడు, తల్లి నర్సమ్మతో స్వగ్రామానికి అద్దె కారులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరారు. వీరితోపాటు హైదరాబాద్‌లోనే జీవిస్తున్న బత్తిన సోమన్న తమ్ముడి భార్య గిడ్డమ్మ(67) కూడా వారి వెంట వచ్చింది. మార్గమధ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రంగరెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నందిగామ బైపాస్‌ రోడ్డు వద్ద 44 జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని చీకట్లో గుర్తించని కారుడ్రైవర్‌ ఢీకొట్టాడు.
 
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌(పేరు తెలియలేదు)తో పాటు బత్తిన సోమన్న, బత్తిన నర్సమ్మ, బత్తిన సోముడు అక్కడికక్కడే మృతిచెందగా, గిడ్డమ్మకు తీవ్రగాయాలు కావటంతో స్థానికులు స్థానిక షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చేర్చిన వెంటనే గిడ్డమ్మ కూడ మరణించింది మృతుడు బత్తిన సోముడుకు భార్య రాములమ్మ, కుమారులు రాజు(17), కృష్ణ(14) ఉన్నారు. 
  
చింతమానుపల్లెలో విషాద ఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో చింతమానుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం ప్రమాద సమాచారం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. యాదవ కులానికి చెందిన ప్రజలు గ్రామంలో అత్యధికంగా ఉన్నారు. దీంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతటి ప్రమాదాన్ని గ్రామస్తులు ఎన్నడూ ఎదుర్కోలేదు. మృతదేహాలు సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో జనమంతా వీధుల్లోకి చేరిపోయారు. నలుగురి మృతదేహాలను ఒకేసారి అంత్యక్రియలకు తీసుకుపోతున్న సమయంలో సంప్రదాయబద్ధంగా పెద్ద మనువడు రాజు తలకొరివి పడుతున్న దృశ్యం చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
 
మృతురాలు గిడ్డమ్మ భర్త బజారి చాలాకాలం క్రితం మృతి చెందగా, కూతురు మద్దమ్మకు, కుమారుడు ఆంజనేయులుకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే కూమారుడు, కోడలు గ్రామంలో నివాసం ఉండటంతో గిడ్డమ్మ ఒంటరిగానే జీవిస్తోంది. రెండు నెలల క్రితం కూలీ పని చేసేందుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మురళీకృష్ణ, కోడుమూరు సీఐ శ్రీనివాస్, సి.బెళగల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement