పైపై పూత.. నిధుల మేత | funds scham in watershed works | Sakshi
Sakshi News home page

పైపై పూత.. నిధుల మేత

Published Sat, Feb 11 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

పైపై పూత.. నిధుల మేత

పైపై పూత.. నిధుల మేత

– నీటి సంరక్షణ పనుల్లో అక్రమాలు
– ‘రత్నగిరి’లో వెలుగుచూస్తున్న వాస్తవాలు
– బాగున్న చెక్‌డ్యాంలకు పైపై మెరుగులు
– మరమ్మతు పేరుతో రూ.కోటికి పైగా స్వాహా
– కొత్త చెక్‌డ్యాంలలోనూ దోపిడీపర్వం


ఈ చెక్‌డ్యాం రొళ్ల మండలం కాకి సమీపంలోని గొల్లహట్టి వంకలో ఉంది. సమగ్ర వాటర్‌షెడ్‌ పథకం (ఐడబ్ల్యూఎంపీ) కింద మరమ్మతు చేసినట్లు చూపి రూ.2లక్షల వరకు డ్రా చేశారు.  కేవలం సున్నం పూసి మాయ చేశారు.

అనంతపురం టౌన్‌/రొళ్ల : పరుగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్‌ పథకం సిద్ధాంతం. అవసరం లేకపోయినా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. అందినంత దండుకోవడం.. ఇదీ అక్రమార్కుల లక్ష్యం. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులో ‘ఫోర్డ్‌’ స్వచ్ఛంద సంస్థ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నీటి సంరక్షణ పేరుతో నిధులు కొల్లగొట్టిన వైనం ఇక్కడి పనులను పరిశీలిస్తేనే స్పష్టమవుతోంది. కొత్త చెక్‌డ్యాంల పేరుతో రూ.40 లక్షల వరకు స్వాహా చేయగా.. మరమ్మతుల పేరిట రూ.కోటికి పైగా దిగమింగారు.

మరమ్మతుల్లో రూ.కోటికి పైగా స్వాహా
రత్నగిరి ప్రాజెక్టు పరిధిలో చెక్‌డ్యాం మరమ్మతుల పేరుతో రూ.కోటికి పైగా దుర్వినియోగం చేశారు. 114 చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు చూపి ఏకంగా రూ.1.39 కోట్లు డ్రా చేశారు. ఇందులో ఏ చెక్‌డ్యాంను పరిశీలించినా ‘సున్నం’ వేసినవే కన్పిస్తాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో దొడ్డెరి, గుడ్డుగుర్కి, రత్నగిరి, కాకి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గుడ్డుగుర్కి, రత్నగిరి పంచాయతీల్లో ఏకంగా రూ.కోటి వరకు పనులు చేసినట్లు చూపారు. రత్నగిరిలో 38 చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో రూ.42.28 లక్షలు డ్రా చేశారు. ఐడబ్ల్యూఎంపీ కింద 38 పనులకు రూ.33.47 లక్షలు కేటాయించగా..ఈ మొత్తం నిధులు డ్రా చేయడంతో పాటు ఉపాధి హామీ నిధుల నుంచి కూడా రూ.8.82 లక్షలు కొల్లగొట్టారు. వాస్తవానికి ఐడబ్ల్యూఎంపీ కింద ఒక్కదానికీ పరిపాలనా పరమైన అనుమతి లేదు. ఉపాధి కింద 40 పనులకు గాను రూ.47.63 లక్షలకు అనుమతి ఉండగా.. ఇందులో ఒక్క పనీ చేయలేదు.

గుడ్డుగుర్కి పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఐడబ్ల్యూఎంపీ కింద ఎలాంటి అనుమతి లేకుండా 40 పనులకు రూ.27.04 లక్షలు డ్రా చేసేశారు. ఉపాధి హామీ కింద 42 పనులకు రూ.59.97 లక్షలతో అనుమతి లభించినా ఒక్కటీ చేయలేదు. కానీ ఈ నిధుల్లో రూ.24.22 లక్షలను వాడేశారు. ఇక్కడ మొత్తంగా రూ.51.26 లక్షలు భోంచేసినట్లు అర్థమవుతోంది. దొడ్డెరిలో 15 చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో రూ.7.84 లక్షల ఐడబ్ల్యూఎంపీ నిధులు డ్రా చేశారు. ఉపాధి కింద 16 పనులకు 21.88 లక్షలతో అనుమతి లభించినా ఒక్కటి కూడా చేయలేదు. కానీ ఈ నిధుల్లోంచి రూ.11.10 లక్షలు డ్రా చేసేశారు. కాకి పంచాయతీలో 21 చెక్‌డ్యాంల మరమ్మతుల పేరిట రూ.18.48 లక్షలు (ఐడబ్ల్యూఎంపీ నిధులు) దుర్వినియోగం చేశారు. ఇక్కడ ఉపాధి కింద 21 పనులకు రూ.27.75 లక్షలు అనుమతి లభించగా.. రూ.8.01 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు.

కొత్త చెక్‌డ్యాం పేరుతో రూ.40 లక్షల లూటీ :
రత్నగిరి ప్రాజెక్ట్‌ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో 138 కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.2.74 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి లభించింది. ఇందులో 16 నిర్మాణాలు చేపట్టినట్లు చూపి రూ.40 లక్షలు లూటీ చేశారు. దొడ్డెరి పంచాయతీలో 44 చెక్‌డ్యాంలకు రూ.81.34 లక్షలు, కాకిలో 23 చెక్‌డ్యాంలకు రూ.41.03 లక్షలకు అనుమతి వచ్చినా ఒక్కటీ కట్టలేదు. అలాగే గుడ్డుగుర్కిలో నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించినట్లు చూపి రూ.8.66 లక్షలు, రత్నగిరిలో 12 చేసినట్లు చూపి రూ.31.31 లక్షలను కొల్లగొట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త చెక్‌డ్యాంలు ఎక్కడా కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement