watershed works
-
నిధుల మేత!
ఇది ఆదోని మండలం గోనబావి గ్రామం వద్ద నిర్మించిన చెక్‌డ్యాం. ఈ ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మాణానికి అనువుగా లేనప్పటికీ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోనీ పూర్తిగానైనా నిర్మించారా అంటే అదీ లేదు. అడ్డంగా ఓ కట్ట కట్టేసి..మిగిలిన పనులను ఇలా వదిలేశారు. రూ.లక్షకు పైగా నిధులను దుర్వినియోగం చేశారు. మండగిరి వాటర్‌షెడ్ ప్రాజెక్టులో అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తే..ఇలాంటి లీలలు ఎన్నో బయటపడతాయి. ఆదోని రూరల్(కర్నూలు): వాటర్‌షెడ్ పనుల్లో అవి‘నీటి’ ప్రవాహం కొనసాగుతోంది. జల సంరక్షణ పనులను తూతూమంత్రంగా చేపట్టి నిధులు కొల్లగొడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడుతోంది. కొన్ని నెలల క్రితం కౌతాళం మండలం హాల్వి వాటర్‌షెడ్ పనుల్లో భారీ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఇందుకు బాధ్యులైన ప్రోగ్రామ్ ఆఫీసర్ (పీఓ), టెక్నికల్ ఆఫీసర్ (టీఓ), జేఈ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదోని మండలం మండగిరి వాటర్‌షెడ్ ప్రాజెక్టులోనూ ఇంతకు రెట్టింపు స్థాయిలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. వాటర్‌షెడ్ కమిటీ చైర్మన్లుగా వ్యవహరించిన స్థానిక సర్పంచులు, అధికారులు, సిబ్బంది కలిసి నిధులు స్వాహా చేసినట్లు విమర్శలొస్తున్నాయి. నాసిరకం, అరకొర, అసలు పనులు చేయకుండానే..ఇలా పలు రూపాల్లో డబ్బు కాజేసినట్లు తెలుస్తోంది. త్వరలో సామాజిక తనిఖీ ఉండడంతో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన వారిలో మొదలైంది. ముఖ్యంగా అధికారులు, సిబ్బంది పనులు చేసిన అధికార పార్టీ నేతలతో చర్చిస్తూ.. ఎలాగైనా తమ ఉద్యోగాలు పోకుండా చూడాలని వేడుకుంటున్నట్లు వినికిడి. ‘అధికారం మాది.. ఎవరూ ఏమీ చేయలేరు. అండగా మేమున్నాం’ అంటూ సదరు నేతలు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. సంరక్షణ మరచి స్వాహాపర్వం వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూమిలోకి ఇంకేలా చేసేందుకు ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య కార్యక్రమం (ఐడబ్ల్యూఎంపీ) ప్రవేశపెట్టింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. రైతుల పొలాల్లో ఫాంపాండ్స్, డగౌట్స్, భూమి కోత నివారణకు రాతి కట్టడాల నిర్మాణం.. తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఐడబ్ల్యూఎంపీ కింద మండగిరి వాటర్‌షెడ్ ప్రాజెక్టును 2011లో ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మండిగిరి, సాదాపురం, విరుపాపురం, గోనబావి, దిబ్బనకల్, బైచిగేరి, ఎస్.కొండాపురం గ్రామాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా బండరాళ్లు, ఎరువు దిబ్బల తొలగింపు పనులు, ఫాంపాండ్స్, డగౌట్ పాండ్స్, చెక్వాల్, చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతు పనులు మంజూరయ్యాయి. బండరాతి తొలగింపు పనులు–2కు గాను రూ.19 వేలు, ఎరువుదిబ్బ పనులకు రూ.15లక్షల 36వేలు, ఫాంపాండ్స్‌కు రూ.2.60 కోట్లు, డగౌట్ పాండ్స్‌కు రూ.9.66 కోట్లు, చెక్వాల్ పనులకు రూ.7.95 కోట్లు, చెక్‌డ్యాం పనులకు రూ.53.36 కోట్లు, చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.21.38కోట్లు, చెక్‌వాల్స్ రిపేరీకి రూ.2.87 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పనులన్నీ ప్రాజెక్టు పరిధిలోని ఐదు పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సర్పంచులందరూ అధికార పార్టీ మద్దతుదారులే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడిగేవారు ఎవరన్నట్లు నాసిరకంగా, అరకొరగా, ఉపయోగం లేనిపనులను చేపట్టి జేబులు నింపుకున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం తమ వాటాను తీసుకొని మిన్నకుండిపోయారు. అక్రమాలకు కొన్ని ఉదాహరణలు విరుపాపురం గ్రామం వద్ద గొల్లకుంట వంకలో చెక్‌డ్యాం నిర్మాణ పనులకు గాను రూ.1.10 లక్షలతో బాడీవాల్, సైడ్వాల్ను నిర్మించారు. ఇది అనతికాలంలోనే బీటలు బారి..తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ప్రాంతంలో చెక్‌డ్యాం రిపేరీ పేరుతో అరకొర పనులు చేసి రూ.95 వేలు కాజేశారు. తంగరడోణ రోడ్డులో రైతు శివమ్మ పొలంలో రూ.80వేలు, శాంతప్ప పొలంలో రూ.1.50లక్షలతో ఫాంపాండ్లు నిర్మించినట్లు రికార్డుల్లో ఉంది. ఫాంపాండ్‌ను 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, ఏడడుగుల లోతుతో నిర్మించాల్సి ఉండగా.. 3 అడుగుల లోతు కూడా లేదు. మండిగిరి బైపాస్‌రోడ్డు, సాదాపురం, ఎస్.కొండాపురం, దిబ్బనకల్ గ్రామాల్లోనూ ఇదే తరహాలో పనులు జరిగాయి. పనులు జరిగిన చోట తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేసి.. పని అంచనా, ఖర్చు, పనిచేసిన వ్యక్తి, ప్రాంతం తదితర వివరాలు పేర్కొనాలి. అయితే.. అవి ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు, తమ్ముళ్లకు వరం వాటర్‌షెడ్ పనులు రైతులకు, కూలీలకు ఏమాత్రమూ ఉపయోగపడలేదు. కేవలం అధికార పార్టీ నేతలకు, అధికారులకు వరంగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అంతులేని అవినీతి జరిగింది. ఈ విషయంపై మేం కూడా పరిశీలిస్తున్నాం. త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం. – రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి ఉపయోగం లేని పనులు చేశారు వాటర్‌షెడ్ పనుల వల్ల రైతులకు ఉపయోగం ఉంటుందని చెబుతూ రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారు. అయితే..ఇవి ఎక్కడా రైతులకు ఉపయోగపడడం లేదు. విరుపాపురం, గోనబావి సమీపంలో చేసిన పనులు పూర్తిగా నిష్ప్రయోజనం. – నర్సప్ప, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం నాసిరకం, ఉపయోగం లేని పనులు, అవినీతి, అక్రమాల విషయం నాకు తెలీదు. నేను ఇటీవలే ఇన్చార్జ్ పీఓగా బాధ్యతలు తీసుకున్నా. ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లయితే విచారణ చేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. – నూర్జహాన్, ఇన్చార్జ్ ప్రోగ్రాం ఆఫీసర్ -
పైపై పూత.. నిధుల మేత
– నీటి సంరక్షణ పనుల్లో అక్రమాలు – ‘రత్నగిరి’లో వెలుగుచూస్తున్న వాస్తవాలు – బాగున్న చెక్‌డ్యాంలకు పైపై మెరుగులు – మరమ్మతు పేరుతో రూ.కోటికి పైగా స్వాహా – కొత్త చెక్డ్యాంలలోనూ దోపిడీపర్వం ఈ చెక్‌డ్యాం రొళ్ల మండలం కాకి సమీపంలోని గొల్లహట్టి వంకలో ఉంది. సమగ్ర వాటర్‌షెడ్ పథకం (ఐడబ్ల్యూఎంపీ) కింద మరమ్మతు చేసినట్లు చూపి రూ.2లక్షల వరకు డ్రా చేశారు. కేవలం సున్నం పూసి మాయ చేశారు. అనంతపురం టౌన్/రొళ్ల : పరుగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్ పథకం సిద్ధాంతం. అవసరం లేకపోయినా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. అందినంత దండుకోవడం.. ఇదీ అక్రమార్కుల లక్ష్యం. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులో ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సంస్థ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నీటి సంరక్షణ పేరుతో నిధులు కొల్లగొట్టిన వైనం ఇక్కడి పనులను పరిశీలిస్తేనే స్పష్టమవుతోంది. కొత్త చెక్‌డ్యాంల పేరుతో రూ.40 లక్షల వరకు స్వాహా చేయగా.. మరమ్మతుల పేరిట రూ.కోటికి పైగా దిగమింగారు. మరమ్మతుల్లో రూ.కోటికి పైగా స్వాహా రత్నగిరి ప్రాజెక్టు పరిధిలో చెక్‌డ్యాం మరమ్మతుల పేరుతో రూ.కోటికి పైగా దుర్వినియోగం చేశారు. 114 చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు చూపి ఏకంగా రూ.1.39 కోట్లు డ్రా చేశారు. ఇందులో ఏ చెక్‌డ్యాంను పరిశీలించినా ‘సున్నం’ వేసినవే కన్పిస్తాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో దొడ్డెరి, గుడ్డుగుర్కి, రత్నగిరి, కాకి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గుడ్డుగుర్కి, రత్నగిరి పంచాయతీల్లో ఏకంగా రూ.కోటి వరకు పనులు చేసినట్లు చూపారు. రత్నగిరిలో 38 చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో రూ.42.28 లక్షలు డ్రా చేశారు. ఐడబ్ల్యూఎంపీ కింద 38 పనులకు రూ.33.47 లక్షలు కేటాయించగా..ఈ మొత్తం నిధులు డ్రా చేయడంతో పాటు ఉపాధి హామీ నిధుల నుంచి కూడా రూ.8.82 లక్షలు కొల్లగొట్టారు. వాస్తవానికి ఐడబ్ల్యూఎంపీ కింద ఒక్కదానికీ పరిపాలనా పరమైన అనుమతి లేదు. ఉపాధి కింద 40 పనులకు గాను రూ.47.63 లక్షలకు అనుమతి ఉండగా.. ఇందులో ఒక్క పనీ చేయలేదు. గుడ్డుగుర్కి పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఐడబ్ల్యూఎంపీ కింద ఎలాంటి అనుమతి లేకుండా 40 పనులకు రూ.27.04 లక్షలు డ్రా చేసేశారు. ఉపాధి హామీ కింద 42 పనులకు రూ.59.97 లక్షలతో అనుమతి లభించినా ఒక్కటీ చేయలేదు. కానీ ఈ నిధుల్లో రూ.24.22 లక్షలను వాడేశారు. ఇక్కడ మొత్తంగా రూ.51.26 లక్షలు భోంచేసినట్లు అర్థమవుతోంది. దొడ్డెరిలో 15 చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో రూ.7.84 లక్షల ఐడబ్ల్యూఎంపీ నిధులు డ్రా చేశారు. ఉపాధి కింద 16 పనులకు 21.88 లక్షలతో అనుమతి లభించినా ఒక్కటి కూడా చేయలేదు. కానీ ఈ నిధుల్లోంచి రూ.11.10 లక్షలు డ్రా చేసేశారు. కాకి పంచాయతీలో 21 చెక్‌డ్యాంల మరమ్మతుల పేరిట రూ.18.48 లక్షలు (ఐడబ్ల్యూఎంపీ నిధులు) దుర్వినియోగం చేశారు. ఇక్కడ ఉపాధి కింద 21 పనులకు రూ.27.75 లక్షలు అనుమతి లభించగా.. రూ.8.01 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కొత్త చెక్‌డ్యాం పేరుతో రూ.40 లక్షల లూటీ : రత్నగిరి ప్రాజెక్ట్ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో 138 కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.2.74 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి లభించింది. ఇందులో 16 నిర్మాణాలు చేపట్టినట్లు చూపి రూ.40 లక్షలు లూటీ చేశారు. దొడ్డెరి పంచాయతీలో 44 చెక్‌డ్యాంలకు రూ.81.34 లక్షలు, కాకిలో 23 చెక్‌డ్యాంలకు రూ.41.03 లక్షలకు అనుమతి వచ్చినా ఒక్కటీ కట్టలేదు. అలాగే గుడ్డుగుర్కిలో నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించినట్లు చూపి రూ.8.66 లక్షలు, రత్నగిరిలో 12 చేసినట్లు చూపి రూ.31.31 లక్షలను కొల్లగొట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త చెక్‌డ్యాంలు ఎక్కడా కనిపించడం లేదు. -
వాటర్‌షెడ్‌లో అవినీతి ఊట
గిద్దలూరు: వాటర్‌షెడ్ పనులు అధికారుల జేబులు నింపుతున్నాయి. మండలంలోని ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో నాశిరకపు పనులకు తోడు, బోగస్ మస్టర్లతో నిధులు స్వాహా చేశారు. వారం రోజులుగా జరుగుతున్న సామాజిక తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.30 లక్షలకుపైగా అవినీతి బయటపడింది. జయరాంపురంలో సోమవారం జరిగిన సామాజిక తనిఖీ గ్రామసభలో ఆ గ్రామస్తులు వాటర్‌షెడ్ పనుల్లో అవకతవకలను అధికారులకు వివరించారు. మెగావాటర్ షెడ్ పరిధిలో 7 మైక్రో వాటర్షెడ్లున్నాయి. వీటికింద 2011 నుంచి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సగం పనులు నీటి నిల్వ కార్యక్రమాలకు, మిగిలినవి పేదల జీవనోపాధులు పెంపొందించేందుకు రుణాలివ్వడం, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యానవన మొక్కల పెంపకానికి ఖర్చు చేశారు. అయితే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సగానికిపైగా నిధులు దోచేసినట్లు తెలుస్తోంది. నీటినిల్వ కార్యక్రమాల తీరు ఇదీ... ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో రూ.61.70 లక్షలతో నీటినిల్వ కార్యక్రమాలు చేపట్టారు. నీటినిల్వ కుంటలు, రాతికత్తువలు, చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌డ్యాంలు నిర్మించారు. ఇందుకు రూ.87.45 లక్షలు ఖర్చు చేశారు. కూలీలకు రూ.17.68 లక్షలు, మెటీరియల్‌కు రూ.69.77 లక్షలు, ప్రాజెక్టును పరిచయం చేసేందుకు ప్రాథమిక పని కింద క్రిష్ణంశెట్టిపల్లెలో వాటర్‌ప్లాంటు ఏర్పాటుకు రూ.4.25 లక్షలు వెచ్చించారు. ఇందులో నాణ్యతలేని పరికరాలు ఇచ్చి నిధులు స్వాహా చేశారు. నీటినిల్వ పనుల్లో కూలీల చేత చేయించాల్సిన వాటిని జేసీబీలతో చేసి కూలీల పేర్లతో మస్టర్లు వేసి తపాలాశాఖ సిబ్బంది సహకారంతో వాటర్‌షెడ్ అధికారులు నిధులు దోచేశారు. ఇలా రూ.17.68 లక్షలను సిబ్బంది నొక్కేసినట్లు విచారణలో తేలింది. మెటీరియల్ పేమెంట్ కింద ఖర్చు చేసిన నిధుల్లో భారీగా అవినీతి జరిగినట్లు బయటపడింది. రాతి కత్తువల నిర్మాణానికి తరలించిన రాళ్లను నాలుగు కిలోమీటర్లకు బదులు 8 కిలోమీటర్లుగా నమోదు చేసి అధిక మొత్తంలో నిధులు డ్రాచేశారు. అంబవరంలో నిర్మించిన కుంటలకు కట్టిన రాతి కత్తువలు తక్కువ సైజు కుంటలకు ఎక్కువ కొలతలు చూపించి నిధులు నొక్కేశారు. ఇలా నిర్మించిన కుంటలు అధిక శాతం కొట్టుకుపోయాయని తేలింది. ప్రాజెక్టు పరిధిలోని పనులను వాటర్‌షెడ్ సిబ్బందే కాంట్రాక్టరు అవతారం ఎత్తి నాశిరకంగా చేసి నిధులు స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. జయరాంపురంలో నిర్మించిన మూడు చెక్‌డ్యాంలు నాశిరకంగా ఉండటంతో వర్షపు నీరు నిల్వ ఉండటం లేదని గ్రామస్తులు తెలిపారు. చాలా చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మెటీరియల్ పేమెంట్‌లో సిబ్బంది వారికి అనుకూలంగా ఉండే వారి ఖాతాల్లో నిధులు జమచేసి అనంతరం వారి నుంచి నిధులు తీసేసుకున్నారని తేలింది. జీవనోపాధుల నిధుల్లోనూ మాయాజాలం: మెగా వాటర్‌షెడ్ కింద పేద మహిళలకు జీవనోపాధులు పెంపొందించేందుకు కేటాయించిన నిధుల్లోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వాటర్‌షెడ్ కమిటీలకు తెలియకుండానే తమకు నచ్చిన వారికి రుణాలిచ్చారు. వ్యవసాయం కోసం రుణాలు ఇవ్వకూడదని ఉన్నా ఐకేపీ సిబ్బందికి తగిన అవగాహన కల్పించకపోవడంతో ఎక్కువ రుణాలను వ్యవసాయం కోసం ఇచ్చారు. విత్తనపు పొట్టేళ్ల యూనిట్లు 26 మంజూరు చేయగా అందులో ఎక్కువ మందికి గొర్రెలు లేనివారికి ఇచ్చి సిబ్బంది సొమ్ము చేసుకున్నారు. మొక్కలు నాటకుండానే బిల్లులు: వాటర్‌షెడ్ పరిధిలో ఉద్యానవన మొక్కల పెంపకానికి కేటాయించిన నిధులను మొక్కలు నాటకుండానే స్వాహా చేశారు. ఇలా ఒక్క జయరాంపురం మైక్రో వాటర్‌షెడ్ పరిధిలోనే దాదాపు రూ.2 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. వాటర్‌షెడ్ అధికారులు గ్రామ స్థాయిలో తన అనుయాయులను పెట్టుకుని నిధులను స్వాహా చేశారని జయరాంపురం గ్రామస్తులు సామాజిక తనిఖీ సిబ్బందికి వివరించారు. సామాజిక తనిఖీ గ్రామసభలో కంభం వ్యవసాయాధికారి అర్జున్‌నాయక్, వెల్లుపల్లె పశువైద్యాధికారి శ్రావణ్‌కుమార్, మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్సుపర్సన్ నాగార్జున, డీఆర్పీలు, ఐకేపి సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.