వైభవంగా గావుల మహోత్సవం
కనగానపల్లి (రాప్తాడు) : ఒకవైపు పోతురాజుల నృత్యాలు... మరోవైపు ఉరుముల సందడి... ఆలయం ప్రాంగణంలో భక్తుల కోలాహలం మధ్య జరిగిన పోతులయ్యస్వామి గావుల మహోత్సవం వైభవంగా సాగింది. మండల పరిధిలోని దాదులూరులో మూడు రోజుల పాటు జరిగిన పోతులయ్యస్వామి జాతర శుక్రవారంతో ముగిసింది. సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ఈ జాతరకు ఈ సారీ కూడా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచే గాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు పోతలయ్య స్వామికి జ్యోతులు, బాణాలు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేకపోతు పిల్లలను బలిచ్చారు. ఈ సందర్భంగా పోతురాజులు చేసిన నృత్యాలు చూచి భక్తులు పరవశించిపోయారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన కొబ్బరి, గాజులు, ప్రసాదాలు, తినుబండారాలు, బొరుగులు తదితర దుకాణాలన్నీ కిటకిటలాడాయి. జాతరలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహించారు.