ప్చ్..మర్చిపోయా!
– ముంచుకొస్తున్న ‘మతిమరుపు’
– సహజ జ్ఞానంపై ‘సాంకేతిక’ ప్రభావం
– వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న రుగ్మత
– యువతలో అధికమవుతున్న పరిస్థితి
– నానాటికీ పెరుగుతున్న బాధితులు
– సకాలంలో చికిత్స చేయించకపోతే ప్రమాదమేనంటున్న వైద్య నిపుణులు
సందర్భం : నేడు వరల్డ్ అల్జీమర్స్ డే
విహార యాత్రకు కేరళ వెళ్లిన మహేశ్ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. కొత్త ప్రాంతం.. భాష తెలియదు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలనుకున్నాడు.. కానీ నంబర్లు గుర్తు రావడం లేదు.
రాము ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి వెళ్లాడు. ‘మీ బంధువులు, స్నేహితుల్లో ఐదారుగురి మొబైల్ నంబర్లను తడుముకోకుండా చెప్పండి’ అంటూ ఇంటర్వ్యూ అధికారి అడగ్గానే దిక్కులు చూడడం ప్రారంభించాడు. ఒకరిద్దని నంబర్లు చెప్పి మిగిలినవి చెప్పలేకపోయాడు.
‘వీడు మతిమరుపునకు బ్రాండ్ అంబాసిడర్’... ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరో నానీ గురించి హీరోయిన్ తండ్రి చెప్పిన మాటలివి. మతిమరుపుతో బాధపడే కథానాయకుడిగా నాని కష్టాలు, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టం అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది. ఏ మాత్రం శారీరక శ్రమలేని యాంత్రిక జీవనం.. మనిషి నడవడికను పూర్తిగా మార్చేస్తోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ల వాడకం పెరిగి ప్రతి సమాచారానికీ వాటిపైనే ఆధారపడుతుండడంతో క్రమంగా మెదడు పదును తగ్గుతోంది.
- అనంతపురం మెడికల్:
నాడీ కణాల సంఖ్య తగ్గిపోవడంతో సాధారణంగా వచ్చే రుగ్మతల్లో మతిమరుపు ఒకటి. నాడీ వ్యవస్థ కుంచించుకుపోవడం, మానసిక సామర్థ్యం తగ్గిపోవడం, మెదడు పూర్వభాగంలోని నాళాలలో అస్తవ్యస్త స్థితి తలెత్తడం వల్ల ఇది ఏర్పడుతుంది. ప్రపంచంలో ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు ఈ రుగ్మత బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మతిమరుపు బాధితులు సుమారు 50వేల మందికి పైగా ఉన్నారంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరంతా ఏదో ఒక చోట ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారే. అసలు వైద్యులను సంప్రదించని వాళ్లు.. ఏమౌతుందిలే అని నిర్లక్ష్యం చేసే వాళ్లు వేలల్లో ఉంటారని అంచనా.
జుట్టు పీక్కుంటున్న యువత
పట్టుమని పదెంకెలు కూడా గుర్తించుకోలేని స్థితిలో నేటి యువతరం జుట్టు పీక్కుంటోంది. నిన్న ఇంట్లో తిన్న కూర ఏంటంటే కూడా తడుముకుంటున్నారు.. టీస్టాల్‌కు వెళ్లి గంట గడిపి చివరకు బిల్లు ఎంతైందోనని సెల్‌ఫోన్‌లోని క్యాలిక్యులేటర్ తీస్తున్నారు. మారుతున్న జీవన శైలిలో మెదడుకు ఏ మాత్రం పని చెప్పక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడితే మున్ముందు ప్రమాదకర లక్షణాలు చవిచూడాల్సిందేని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు ఇవీ..:
జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, ప్రవర్తనలో మార్పులు రావడం, ప్రతి చిన్న విషయానికీ ఆవేశ పడడం. ఈ రుగ్మత బారిన పడిన వారిలో కొందరు పగలు, రాత్రి తేడాలను కూడా గుర్తించలేరు. వస్త్ర ధారణ సరిగ్గా చేసుకోరు.
‘మతిమరుపు’ కారణాలివే..:
మానసిక ఆందోళన, తీరిక లేని పనులతో తీవ్ర ఒత్తిడికి లోనవడం, ప్రతి చిన్న విషయానికీ సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లపై ఆధారపడడం వల్ల మెదడుకు పని లేకుండాపోతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నేటి విద్యా విధానం కూడా ఈ రకమైన పరిస్థితికి దారి తీస్తోంది. ఎల్‌కేజీ నుంచే కంప్యూటర్ ముందు కూర్చోబెడుతుండడంతో పిల్లల్లో సహజ సిద్ధమైన తెలివి తేటలు ఆవిరవుతున్నాయి. విరామం లేని పని, నిద్రలేమి, అదే పనిగా టీవీ చూడడంతో పాటు మద్యం, ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు మెదడుపై దుష్ప్రభావం చూపుతున్నాయి.
తగ్గించడం ఎలా?
డైమన్షియా (మతిమరుపు) అనేది వయసును బట్టి సాధారణంగా వచ్చే రుగ్మత కాదు. సాధారణంగా వృద్ధులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మెదడులో ఏర్పడే తీవ్రమైన మార్పుల వల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన, సామర్థ్యం తగ్గుతూ నిత్య జీవన వ్యవహారాల్లో ఇబ్బందిగా మారుతుంది. త్వరగా వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయి.
నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు నష్టమే
స్కూల్‌కు వెళ్లే పిల్లల జ్ఞాపక శక్తి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గుర్తిస్తూ ఉండాలి. ఒకవేళ అంతంత మాత్రమే అయితే ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారు పెరిగే కొద్దీ అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చాక వారు నేర్చుకున్న వాటిని పలక, పుస్తకాలపై రాయించాలి. సృజనాత్మకతను పెంచే చిత్రలేఖనం, క్విజ్, చెస్ వంటివాటిని ప్రోత్సహించాలి. తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. రోజూ ఉడకబెట్టిన కోడి గుడ్డు అందించాలి. మెదడుకు రక్షణ కల్పించే ఆమ్ల రహిత, తక్కువ కొవ్వు పదార్థాలున్న ఆహారం తీసుకోవాలి. బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, పండ్లు ఎక్కువగా తినాలి. ఫలితంగా మానసిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. కూరగాయల్లో టమోటా, క్యారెట్, బీన్స్, ఆకుకూరలు ఇవ్వడం ద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.
ఒత్తిడికి దూరంగా ఉండాలి
ప్రస్తుత కాలంలో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. ఈ రుగ్మత బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడడం తగ్గించుకుని సొంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాటిమాటికీ సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలి. నడక, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. తద్వారా శరీరం, మనసుకు విశ్రాంతి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి.
– ప్రొఫెసర్ డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, సర్వజనాస్పత్రి