ఆదాయ పెంపుతోనే రైతు సంక్షేమం
ఉయ్యూరు: వ్యవసాయంలో ఆదాయం పెరిగే పద్ధతులతోనే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కొసరాజు వీరయ్యచౌదరి అన్నారు. కేసీపీ కర్మాగార ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి వీరయ్యచౌదరి మాట్లాడుతూ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. రైతు ఆదాయం పెంచే ఆలోచన చేస్తే తప్ప మనుగడ ఉండదని వివరించారు. చెరుకు రైతుకు మంచి ధర వచ్చేలా కేసీపీ యాజమాన్యం, ఎంజీ రంగా విశ్వవిద్యాలయం, ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అనువుగా యాంత్రీకరణ పద్ధతులను చేపట్టి సంక్షేమ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీపీ యాజమాన్యం రైతు, కార్మిక సంక్షేమానికి చేపడుతున్న చర్యలు మార్గదర్శకమన్నారు. సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులను అవలంభించి నూతన విధానంలో అధిక దిగుబడి సాధించాలని కోరారు. ఇండస్ట్రియల్ పీస్ ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తాయన్నారు. సమాజ అభ్యున్నతిలో కేసీపీ పాత్ర అమోఘమని కొనియాడారు. సీవోవో జి.వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జీఎంలు వీవీ పున్నారావు, సీకే వసంతరావు, శ్రీహరిబాబు, సీతారామారావు, హెచ్‌ఆర్ మేనేజర్ దాస్, శాస్త్రవేత్త ఎన్‌వీ నాయుడు పాల్గొన్నారు.
రైతులు, కార్మికులకు సత్కారం
అభ్యుదయ రైతులు, వివిధ రంగాల కార్మికులను యాజమాన్యం సత్కరించింది. సేంద్రియ వ్యవసాయంలో ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన గోల్డ్ మెడల్‌ను కేసీపీ వ్యవసాయ విభాగ జనరల్ మేనేజర్ పున్నారావుకు వీరయ్యచౌదరి, సతీష్‌చంద్ర అందజేశారు.