మృతి చెందిన పాపమ్మ
డయేరియాతో మహిళ మృతి
Published Fri, Jul 29 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
లావేరు : మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో గురువారం ఉదయం బాలి పాపమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. ఈమె రెండు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. క్యాన్సర్ వ్యాధితో పాటు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రంతా వాంతులు, విరేచనాలు ఎక్కువ అయ్యాయి. వాంతులు, విరేచనాలు అయిన ఆమెను గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యులు వద్దకు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి వైద్యసేవలు అందజేశారు. వాంతులు విరేచనాలు ఎక్కువ కావడం వల్ల ఆమె డీహైడ్రేషన్‌కు గురై గురువారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందింది. మృతురాలికి ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తల్లి డయేరియా వ్యాధితో మరణించడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇదిలా ఉండగా గ్రామంలో మీసాల మహలక్ష్మీ, అదపాక సూరీ అనే వ్యక్తులతో పాటు పలువురు డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరిని వైద్య సేవల కోసం కొండములగాంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తరలించారు.
గ్రామాన్ని సందర్శించిన సీహెచ్‌వో
వేణుగోపాలపురంలో బాలి పాపమ్మ అనే మహిళ డయేరియాతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లావేరు పీహెచ్‌సీ సీహెచ్‌వో రాజగోపాలరావు గురువారం గ్రామానికి వెళ్లి మృతురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంకా ఎవరికైనా డయేరియా వ్యాధితో బాధపడుతున్నారా, ఉంటే వారికి వైద్యసేవలు అందించాలని స్థానిక ఏఎన్‌ఎంకు సూచించారు. ఏఎన్‌ఎం బి.అరుణకుమారి, ఆశ కార్యకర్తలు గురువారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి డయేరియా వ్యాధితో బాధపడుతున్న రోగులు వివరాలు సేకరించి వైద్యసేవలు అందజేశారు.
Advertisement
Advertisement