ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
-
ఆక్రమణలకు గురైన సముద్రతీర భూమి పరిశీలన
కాకినాడ రూరల్ :
తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం కరప మండలం ఉప్పలంక సమీపంలో సముద్రపు పెరుగుభూముల్లో ఆక్రమణలకు గురైన స్థలాలను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోని 180 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ఈ ప్రాంతంలో ఫిషరీష్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపాదలను పంపినట్టు కన్నబాబు తెలిపారు. అదే సమయంలో కాకినాడ నగరానికి డంపింగ్ యార్డు సమస్య తలెత్తగా∙ఈ ప్రాంతంలో 50 నుంచి 70 ఎకరాల భూమిని డంపింగ్ యార్డుగా చేయాలనే ప్రతిపాదనలు పరిశీలించామన్నారు. ఈ భూములను మత్స్యకార సొసైటీలకు ఇచ్చి వారు ఈ స్థలాలను మత్స్యసంపద కోసం వినియోగించుకునేందుకు అందజేయాలని అప్పట్లో ప్రభుత్వానికి నివేదించామన్నారు. తరువాత ఈ భూమి మరికొంత పెరిగిందన్నారు. ఇది సుమారు 200 ఎకరాల భూమి ఉంటుందన్నారు. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకొని వాటిల్లో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమానికి ఈ భూమిని ఉపయోగించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను మత్స్యకారులతో కలసి కోరతామని కన్నబాబు తెలిపారు. ఆయన వెంట మత్స్యకార నాయకులు గరికిన అప్పన్న, బొమ్మిడి శ్రీనివాస్, పెనుగుదురు సొసైటీ మాజీ అధ్యక్షుడు కర్నాశుల సీతా రామాంజనేయులు, బొడ్డు సత్యనారాయణ, సిద్దాంతపు రాజు తదితరులు ఉన్నారు.