ఖాళీ కనిపిస్తే కబ్జానే
♦ అధికారం అండతో కొందరు... అక్రమమార్గాల్లో మరికొందరు
♦ వెలుగులోకి తెచ్చేంతవరకు పట్టించుకోని అధికారులు
♦ బైపాస్‌లో ఎకరం స్థలం తాజాగా స్వాహా
♦ ప్లాట్లువేసి విక్రయిస్తున్నా.. కన్నెత్తి చూడని యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప: ఖాళీ స్థలం కన్పిస్తే చాలు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. అధికారం అండతో కొందరు, అక్రమమార్గాల్లో మరికొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఇలాంటి తంతు ఇటీవల కాలంలో అధికమైంది. ప్రభుత్వ స్థలాన్ని వశపర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటే, అందుకు కొందరు అధికారులు సైతం తెరవెనుక వత్తాసుగా నిలుస్తున్నారు. తాజాగా రాజంపేట బైపాస్‌లో వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని రాజరాజేశ్వరీ కళ్యాణ మండపం పక్కనున్న రోడ్డు, రోడ్డు పోరంబోకును కొందరు ఆక్రమించారు. ఈ స్థలం తమదేనంటూ రాళ్లు పాతి ఏకంగా ప్లాట్లు కూడా వేశారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు, కార్యకర్త నుంచి ఓ మోస్తారు నేత వరకు, ఎవరి స్థాయిలో వారు ఖాళీ కన్పిస్తే కబ్జా చేస్తున్నారు. వాగులు, పొరంబోకు స్థలాలు, శ్మశానాలను సైతం వదలడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగానికి నిద్రమత్తు వదలడం లేదు. వెలుగులోకి వచ్చాక కూడా కట్టడి చేసే సాహసం చేయడం లేదు.
యంత్రాంగం సహకారంతోనే..
మూడు దశాబ్దాలుగా రోడ్డు వినియోగంలో ఉంది. దానికి ఇరువైపులా పోరంబోకు స్థలం సైతం ఉంది. ఇదంతా స్థానికులకు తెలిసిన విషయమే. తాజాగా అధికారపార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువునంటూ ఓ వ్యక్తి అక్కడ తిష్టవేశారు. వాహనాలు తిరగకుండా ఇరువైపులా రోడ్డును తవ్వేశారు. రోడ్డు పక్కనే ఉన్న పోరంబోకును సైతం ఆక్రమించి ఏకంగా ప్లాట్లు వేశారు. సుమారు ఎకరం స్థలాన్ని ఆక్రమించి విక్రయాలకు పెట్టారు. సెంటు రూ.4 లక్షలు చొప్పున విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరిగిందనుకుంటే పొరపాటే. వారి కనుసన్నల్లోనే పక్కా స్కెచ్‌తోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు పంచుకునే ఎత్తుగడలో ఉంటే తెరవెనుక రెవెన్యూ అధికారుల సహకారం అందుతోంది. అదే పరిస్థితి బైపాస్‌రోడ్డు పరిధిలో కూడా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు.
కడపలో చెలరేగుతున్నారు
జిల్లా కేంద్రంలో భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. కాలనీలు, చెరువులు, వంకపోరంబోకులు వీరికి కల్పతరువుగా మారాయి. మునుపు ఏకంగా పాతకడప చెరువులో సుమారు పదెకరాల భూమి అన్యాక్రాంతమైంది. స్థానిక నాయకుడొకరు ఎస్సీల పేరుతో స్వాహాకు యత్నించారు. ప్రకాష్‌నగర్, రామాంజనేయపురం, బాలాజీనగర్, చిన్నచౌకు, అక్కాయపల్లిలో భూకబ్జాదారులకు హద్దు లేకుండాపోయింది. ఓమోస్తారు తిరకాసుదారులంతా కబ్జా వీరులయ్యారు. కబ్జాలతో అనతికాలంలో కోటీశ్వరుల అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి వారిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే చెప్పవచ్చు.
ఇదంతా ఒక ఎత్తై హౌస్ బిల్డింగ్ సొసైటీలు, ట్రస్టులు పేరుతో సైతం ప్రభుత్వ స్థలాలు స్వాహా అవుతున్నాయి. కడపలోని టెలికాం ఎంప్లాయీస్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ పరిధిలోని 16సెంట్లు, వంకపొరంబోకు మరో 20సెంట్లు స్థలానికి కలిపి రూ.కోటి విలువ చేసే భూమికి ఓట్రస్టు పేరుతో ప్రహరీ ఏర్పాటైంది. సభ్యులందరికీ చెందిన స్థలాన్ని ఒకవ్యక్తి మాత్రమే సొంతం చేసుకున్నారు. అటు సొసైటీ, ఇటు ప్రభుత్వ భూమి స్వాహా చేసినప్పటికీ అధికారులు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఇటీవల కాలంలో అధికమయ్యాయి. కలెక్టర్ కేవీ సత్యనారాయణ చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.