ఎమ్మెల్యే ‘పల్లె’పై దళితుడి ఫిర్యాదు
అమడగూరు: తనను కులం పేరుతో దూషించిన పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీకి చెందిన దళితుడు ఆదినారాయణ శనివారం అమడగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ గురువారం రాత్రి టీడీపీ నాయకులు తమ కాలనీలో ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించారని తెలిపాడు. పక్కాగృహం, వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయలేకపోయారని తాము ప్రశ్నించడమే తప్పయ్యిందన్నాడు. ఎమ్మెల్యే బహిరంగంగా తనను కులం పేరుతో దూషించి, చేయని తప్పునకు కాళ్లు పట్టించుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీలు పూలబాట ఏర్పాటు చేసి, తనపై పూలు చల్లుతూ ఆహ్వానించాలే కానీ ప్రశ్నించరాదంటూ ఎమ్మెల్యే దుర్భాషలాడారని పేర్కొన్నాడు. ఎస్సీలంతా అణిగిమణిగి ఉండాలంటూ తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నాడు. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దళిత కుటుంబానికి దుద్దుకుంట అండ
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం మహమ్మదాబాద్‌కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఎమ్మెల్యే పల్లె మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదని, వైఎస్సార్‌సీపీ తరఫున మేమంతా మీకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. తర్వాత బాధిత దళిత కుటుంబ సభ్యులతో కలిసి అమడగూరు స్టేషన్‌కు చేరుకుని అమడగూరు, ఓడిచెరువు మండలాల ఎస్‌ఐలు చలపతి, సత్యనారాయణతో మాట్లాడారు. కేసు నమోదు చేసి వెంటనే ఎమ్మెల్యే పల్లెను అరెస్ట్ చేసి, బాధిత దళిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ శేషూరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శివశంకర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బొట్టుస్వామి, వెంకటరెడ్డి, మధుసూధన్‌రాజు, రాజారెడ్డి, నాగరాజు, ఉత్తప్ప, మహేష్‌రెడ్డి, సర్పంచులు లోకేష్‌రెడ్డి, గంగులప్పనాయుడు, మోహన్‌రెడ్డి, జయప్ప, తదితరులు పాల్గొన్నారు.