duddukunta sridharreddy
-
ఎమ్మెల్యే ‘పల్లె’పై దళితుడి ఫిర్యాదు
అమడగూరు: తనను కులం పేరుతో దూషించిన పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీకి చెందిన దళితుడు ఆదినారాయణ శనివారం అమడగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ గురువారం రాత్రి టీడీపీ నాయకులు తమ కాలనీలో ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించారని తెలిపాడు. పక్కాగృహం, వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయలేకపోయారని తాము ప్రశ్నించడమే తప్పయ్యిందన్నాడు. ఎమ్మెల్యే బహిరంగంగా తనను కులం పేరుతో దూషించి, చేయని తప్పునకు కాళ్లు పట్టించుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీలు పూలబాట ఏర్పాటు చేసి, తనపై పూలు చల్లుతూ ఆహ్వానించాలే కానీ ప్రశ్నించరాదంటూ ఎమ్మెల్యే దుర్భాషలాడారని పేర్కొన్నాడు. ఎస్సీలంతా అణిగిమణిగి ఉండాలంటూ తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నాడు. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దళిత కుటుంబానికి దుద్దుకుంట అండ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం మహమ్మదాబాద్‌కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఎమ్మెల్యే పల్లె మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదని, వైఎస్సార్సీపీ తరఫున మేమంతా మీకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. తర్వాత బాధిత దళిత కుటుంబ సభ్యులతో కలిసి అమడగూరు స్టేషన్‌కు చేరుకుని అమడగూరు, ఓడిచెరువు మండలాల ఎస్ఐలు చలపతి, సత్యనారాయణతో మాట్లాడారు. కేసు నమోదు చేసి వెంటనే ఎమ్మెల్యే పల్లెను అరెస్ట్ చేసి, బాధిత దళిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ శేషూరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శివశంకర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బొట్టుస్వామి, వెంకటరెడ్డి, మధుసూధన్‌రాజు, రాజారెడ్డి, నాగరాజు, ఉత్తప్ప, మహేష్‌రెడ్డి, సర్పంచులు లోకేష్‌రెడ్డి, గంగులప్పనాయుడు, మోహన్‌రెడ్డి, జయప్ప, తదితరులు పాల్గొన్నారు. -
రాక్షస పాలనకు చరమగీతం పాడదాం
పుట్టపర్తి టౌన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసి రౌడీయిజానికి, అవినీతికి వంతపాడుతూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని స్థానిక సాయిఆరామంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పుష్ఫగుచ్చంతో అభినందించారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు, ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈసందరంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్య పాలనతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను అటకెక్కించిన ఆయన రైతు, చేనేత, డ్రాక్రా రంగాలను సంక్షోభంలోకి నెట్టారని వివర్శించారు సంక్షేమ పథకాలకు పైసా విదల్చకుండా బడుగు బలహీన వర్గాలను వంచిస్తున్నాడన్నారు. టీడీపీ నాయకులు మహిళలపైనా,అధికారులపైనా దాడులకు తెగబడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా వెనుకబడ్డాయని, చట్టసభల్లో ఈ ప్రాంతం సమస్యలపై పోరాడాలని కోరారు. పుట్టపర్తి నియోజకర్గంలో ఉపాధి లేక గ్రామీణులు కేరళ, బెంగళురుకు వలస పోతున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ట్రేడ్యునియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా, సహకార సంఘం అధ్యక్షులు ఏవీరమణారెడ్డి, నరసారెడ్డి, విశ్రాంత ఎంఈఓ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రాంజీనాయక్, ఈశ్వరయ్య, నాయకులు చెరువు భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బీరే నారాయణ, రైల్వేభాస్కర్, గోపాల్‌రెడ్డి, గాజుల వెంకటేష్, శ్రీరాములు, సాయిరాంరెడ్డి, రామిరెడ్డి, శివప్ప, జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి, హనుమంతరెడ్డి, సాయినాథ్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి, దాసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గంగాద్రి, రఘు, గోవర్దన్‌రెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, ఓబిరెడ్డి, పతాంజలి, రఫీ, రంగారెడ్డి, రఘు, బాలాజీనాయక్, చిన్నా,ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
చదువుకున్న అజ్ఞాని మంత్రి పల్లె..
అమడగూరు : ఉన్నత చదువులు చదువుకున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడని పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన జేకేపల్లిలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టేయమన్నట్లు, బుక్కపట్నం చెరువు వివరాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టరును ఆదేశించిన వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ్ముళ్లకు పోటీలు పెట్టించి మరీ చెరువులో పని చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయాలంటే ముందుగా అధికారులు ఎస్టిమేషన్ తయారు చేసి, టెండర్లు పిలిచి సంబంధింత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే మండలాధికారులకే తెలియకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చెరువులో పడి పనులు చేసుకోవడం ఏమాత్రం సమంజసం అని దుయ్యబట్టారు. మంత్రి పల్లె అండదండలతోనే తెలుగు తమ్ముళ్లంతా ఇలా తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పిచ్చిమొక్కల తొలగింపు (జంగిల్ క్లీనింగ్) పేరుతో రూ.3 కోట్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. అంతేకాక చెరువులో అంత లోతుగా గుంతలు తీయడం ద్వారా నీటి నిల్వ ఎక్కువై చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ముందన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువులో పనులు చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కన్వీనర్ శేషూరెడ్డి, బుక్కపట్నం కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నాగరాజు, బొట్టుస్వామి, నక్కలచిన్నప్ప, జయప్ప, సురేంద్రరెడ్డి, లోకేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.