దొంగల ముఠా నాయకుడు మాన్‌సింగ్!
♦ కాల్పులకు యత్నించింది అతనే
♦ గుల్బర్గాలో ముఠా ఏర్పాటు
♦ గతంలో పలు నేరాలు.. దోపిడీలు
♦ కొనసాగుతున్న విచారణ
పరిగి: సినీ ఫక్కీలో పట్టుబడిన దోపిడీ ముఠా నాయకుడు మాన్‌సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అర్థరాత్రి) పరిగిలో ఓ ముఠాను అడ్డుకోగా పోలీసులపై కాల్పులకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా ఓ వ్యక్తి తప్పించుకు పారిపోయాడు. దొరికిన వారి సాయంతో పారిపోయిన దొంగతో పాటు మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముఠా సభ్యుల్లో ఒకడైన సమద్‌ను రిమాండ్‌కు తరలించిన సంగతి విధితమే. నాలుగు రోజులుగా పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులు వారిని వెంటబెట్టుకుని కర్ణాటక గుల్బర్గాకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దొంగలముఠా నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం.
కాల్పులకు యత్నించిన ఘటనలో గాయపడి ఆస్పత్రిపాలైన మాన్‌సింగే ముఠా నాయకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో నేరాలు చేసే క్రమంలో రివాల్వర్ సైతం ఎక్కడో కొట్టుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. కాల్పులకు యత్నించిన సమయంలో మాన్‌సింగ్ రివాల్వర్ పట్టుకుని కాల్పులు జరిపే ప్రతయ్నం చేశాడని.. ఆ సమయంలో రివాల్వర్‌లో ఆరు బుల్లెట్లు, అదనంగా జేబులో మరో మూడుతో కలిపి మొత్తం తొమ్మిది బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. పెనుగులాటలో సంఘటనా స్థలంలో మూడు బుల్లెట్లు పడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫైరింగ్‌లోనూ దిట్టే..
తెలుగు, కనడ, హిందీ భాషలు తెలిసిన మాన్‌సింగ్ గుంతకల్ వాసి. ఏడేళ్ల క్రితం అనంతాపూర్ జిల్లాలో, గుంతకల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు సమాచారం రాబట్టారు. గతంలో తుపాకులు పేల్చిన నేర చరిత ఉన్నట్లు తేల్చారు. పలు నేరాలు..దొంగతనాలు చేసిన అతను పోలీసులకు పట్టుబడడంతో జైలుకు వెళ్లి ఐదేళ్లు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంతకల్ నుంచి గుల్బర్గాకు మకాం మార్చాడు. గుల్బర్గాలో మామూలు గుడిసెలో నివాసం ఉంటూ అక్కడ ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. నెల, రెండు నెలలు విరామం ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో నేరాలు చేయడం ఈ ముఠాకు అలవాటు.
హైదరాబాద్ వెళుతూ..
స్విఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్ బయలు దేరిన ఈ దోపిడీ ముఠా అనుకోని పరిస్థితిలో పరిగి పట్టణంలోకి వెళ్లి పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్‌కు అర్థరాత్రి వరకు చేరుకుని అక్కడ దొంగతనానికి పాల్పడాలని గుల్బర్గా నుంచి బయలుదేరిన వీరు పరిగికి చేరుకునే వరకు రాత్రి 2 గంటలైంది. హైదరాబాద్‌కు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటే అక్కడ ఏ దొంగతనం చేయడానికి వీలుకాదని భావించి పరిగి పట్టణంలోకి కారును మళ్లించినట్లు సమాచారం. బ్యాంకే అని కాకుండా ఎక్కడో ఒకచోట దోపిడీ చేసి తిరిగి వెళ్లి పోవాలని పరిగిలోకి మళ్లడంతో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి గతంలో చేసిన దోపీడీలకు సంబంధించి సొత్తు రికవరీకి యత్నిస్తుండడంతో రిమాండ్‌కు తరలించేందుకు ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది.