సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: విలీన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీకి నిధుల మంజూరుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న సిద్దిపేటకు సంబంధించిన నూతన ప్రాజెక్టుపై సమావేశం జరగనుంది. ఇందుకు అనుగుణంగానే మున్సిపల్‌కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ లక్ష్మణ్ సంబంధిత ప్రాజెక్టు వివరాలను కేందానికి వివరించేందుకు శనివారం ఢిల్లీ వెళ్లారు. సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనమైన ఆరు గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కోసం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు నేతృత్వంలో జవహర్‌లాల్‌నెహ్రూ జాతీయ పట్టణాభివృద్ధి పథకానికి గత ఏడాది ప్రతిపాదనలు అందజేశారు.
సుమారు 115 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఎట్టకేలకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఇంజినీరింగ్ అధికారి శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 25న జరిగే సీపీసీ కమిటీ ప్రతినిధులు సిద్దిపేటకు సంబంధించిన ప్రాజెక్టుపై చర్చించి నిధుల మంజూరీపై నిర్ణయం తీసుకొనున్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఈ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఢిల్లీలో డిప్యూటీ ఈఈ లక్ష్మణ్‌తో సుదీర్ఘంగా సమీక్షించినట్లు సమచారం.