తెలుగు సాహిత్య చరిత్రలో పాలమూరుదే అగ్రస్థానం
-
భాషకు వన్నెతెచ్చిన ఘనత జిల్లా సాహితీమూర్తులదే
-
పీయూ ఉపకులపతి బి.రాజరత్నం
-
జడ్చర్లలో జాతీయ సాహిత్య సదస్సు ప్రారంభం
జడ్చర్ల టౌన్: తెలుగు సాహిత్య చరిత్రలో పాలమూరు జిల్లా సాహిత్యం అగ్రస్థానంలో ఉందని అలాంటి సాహిత్యానికి పాలమూరు కేంద్రబిందువు కావటం గర్వకారణమని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.రాజారత్నం అభిప్రాయపడ్డారు. బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో రెండురోజుల పాటు జరుగుతున్న ‘జాతీయ సాహిత్య సదస్సు–పాలమూరు సాహిత్య వికాసం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. భాషాభివృద్ధిలో తెలుగు సాహిత్యాన్ని వివిధ ప్రక్రియల ద్వారా సుసంపన్నం చేయడంలో పాలమూరు జిల్లా పాత్ర ఎనలేనిదన్నారు. తెలుగు భాష వన్నెతెచ్చిన సాహితీమూర్తులు ఎక్కువమంది జిల్లా వారేనని, ఇక్కడి భౌగోళికత, చరిత్రాత్మక నేపథ్యం, వెల్లివిరిసిన ఆధ్యాత్మికత పాలమూరు సాహిత్య వికాసంలో ప్రముఖ పాత్ర వహించాయన్నారు. ఇక్కడి అపార సాహితీ సంపద తెలంగాణ యాస, మాండలికత, జానపద సంస్కృతులను పుణికిపుచ్చుకున్నాయని, జిల్లాను కాటేస్తున్న కరువు, రైతుల వ్యథ, వలస కార్మికుల వెత, గిరిపుత్రుల గోస, యువత ఆక్రందనలకు అద్దం పడుతుందన్నారు. ఉస్మానియావిశ్వవిద్యాలయంలో తెలుగు, ఇతర భాషలకు విశేష సేవలందించిన వారిలో ఎక్కువమంది ఆచార్యులు పాలమూరు జిల్లావారేనని గుర్తించాలన్నారు. ఈ సదస్సు సాహిత్య అధ్యయనానికి పరిపుష్టతకు, ప్రాదేశికత అనే దక్పోణం ప్రముఖ అంశంగా ఒక కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సదస్సుల ద్వారా ప్రేరణ పొందాలి
నేటి సమాజంలో చదివే అలవాటు తగ్గిపోతోందని, అలా కాకుండా ఇలాంటి సదస్సుల ద్వారా ప్రేరణ పొంది సాహిత్యాన్ని చదివే అలవాటు చేసుకోవాలని పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి పేర్కొన్నారు. చాలామంది ఆంగ్లభాషపట్ల ఆసక్తిని పెంచుకుని ఇటు మాతృభాషకు అన్యాయం చేస్తూ ఆంగ్లభాషలో పట్టు సాధించలేకపోవడం విచారకరమన్నారు. పాలమూరు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి, సదస్సు కన్వీనర్ డా.శ్రీనివాస్, సదస్సు సంచాలకుడు సురేష్, ప్రజాకవులు, రచయితలు వెల్దండ సత్యనారాయణ, వల్లభాపురం జనార్దన్, రాఘవేంద్రరావు, పుష్పలత, వెంకటలక్ష్మి పత్రసమర్పణలు చేశారు. సదస్సు రెండో రోజు శనివారం ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీదేవి, ముగింపు కార్యక్రమానికి ప్రజాకవి గోరటి వెంకన్న హాజరవుతున్నట్లు ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి తెలిపారు.