నేత్రపర్వం.. పవిత్రాధివాసం
ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో పవిత్రాధివాసం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో విష్వక్సేనపూజ, పుణ్యహవాచన, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను ఆలయ అర్చకులు, రుత్వికులు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం పవిత్రాలకు పంచగవ్య ప్రోక్షణ, అభిమంత్రణలను జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తుల వద్ద పవిత్రాలను ఉంచి పంచ శయనాదివాసాన్ని వేద మంత్రోచ్ఛరణతో అర్చక స్వాములు నిర్వహించారు. మహాశాంతి హోమాలు జరిపారు. ఆలయంలో చతుర్వేద పారాయణలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆగమ విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.