‘గమేసా’కు ఆమోదం తిరస్కరణ
-
కోరం లేక పంచాయతీ సమావేశం వాయిదా వేసిన డీఎల్‌పీఓ
-
ఇఫ్కో చేసిన మోసానికి ప్రతిఫలమంటున్న సభ్యులు
కొడవలూరు:
ఇఫ్కో కిసాన్ సెజ్‌లో 150 ఎకరాల్లో నిర్మాణమవుతున్న గమేసా పరిశ్రమకు పంచాయతీ ఆమోదం లభించలేదు. ఇఫ్కో సెజ్‌లో ఏర్పాటవుతున్న సంస్థలకు ఆమోదమివ్వడానికి వార్డు సభ్యులెవరూ సుముఖంగా లేరు. అందువల్లే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వార్డు సభ్యులు హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో సమావేశానికి ప్రత్యేకంగా వచ్చిన డీఎల్‌పీఓ శ్రీనివాసరావు సమావేశాన్ని వాయిదా వేశారు.
ఇఫ్కో కిసాన్ సెజ్‌లోని 150 ఎకరాల భూమిలో ‘గమేసా’ అనే సోలార్ విద్యుదుత్పత్తికి వినియోగించే ఫ్యాన్ల తయారీ కంపెని నిర్మిస్తుండడం విదితమే. నిబంధనల ప్రకారమైతే ఎక్కడ పరిశ్రమ నిర్మిస్తున్నా సంబంధిత పంచాయతీ ఆమోదం పొందాలి. ఇఫ్కో కిసాన్ సెజ్ రేగడిచెలిక పంచాయతీ పరిధిలో ఉంది. అందువల్ల సెజ్‌లో ఎలాంటి నిర్మాణం చేపట్టినా రేగడిచెలిక పంచాయతీ ఆమోదం తప్పనిసరి. అయితే ఆ పంచాయతీ ఆమోదం లేకుండానే పరిశ్రమ నిర్మాణం ఆరంభించారు. పంచాయతీ ఆమోదం లేకుండా నిర్మించడం చట్టవిరుద్ధమని అధికారులు సూచించడంతో కొద్దిరోజుల క్రితం స్థానిక పంచాయతీని ఆమోదం కోరారు. అందుకు పంచాయతీ పాలకవర్గం తిరస్కరించింది. దీంతో ఆ కంపెనీ వారు డీపీఓను సంప్రదించి ఆమోదానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన డీఎల్‌పీఓ రేగడిచెలిక పంచాయతీలో గురువారం ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆమోద తీర్మానం ప్రవేశ పెట్టించాలని కావలి డీఎల్‌పీఓ శ్రీనివాసరావును ఆదేశించారు. డీపీఓ సెల్వియా ఆదేశానుసారం డీఎల్‌పీఓ గురువారం రేగడిచెలిక పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇద్దరే వార్డు సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టాలంటే మెజారిటీ వార్డు సభ్యులు విధిగా సమావేశానికి హాజరు కావల్సి ఉంది. కానీ 10 మంది వార్డు సభ్యులుండగా, కేవలం ఇద్దరే హాజరవడంతో కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు డీఎల్‌పీఓ ప్రకటించారు.
డీఎల్‌పీఓకు వార్డు సభ్యుని ఫిర్యాదు
పంచాయతీ సమావేశానికి వచ్చిన డీఎల్‌పీఓకు వార్డు సభ్యుడు నంద్యాల వెంకటేశ్వర్లు ఇఫ్కోపై ఫిర్యాదు చేశారు. సెజ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో పంచాయతీ పరిధిలోని వారికే ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పి యాజమాన్యం మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. రైతులకు ఉపకరించే చెరువును ఆక్రమించేసి గ్రామ రైతులను ఇఫ్కో నిలువునా ముంచిందని చెప్పారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పి కాలుష్య కారకమైన కొకోకోలా కంపెని ఏర్పాటుకు సిద్ధమైందని ఇఫ్కోౖ యాజమాన్య వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని, తదుపరి సమావేశ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని డీఎల్‌పీఓ తెలిపారు.