సర్వేకు సాంకేతిక సంకెళ్లు..!
జిల్లాలో ప్రజాసాధికార(పల్స్) సర్వే ముందుకు సాగడం లేదు. ప్రారంభించి ఎనిమిది రోజులు గడిచింది. కనీసం నాలుగువేల కుటుంబాల వివరాలను నమో దు చేయలేకపోయారు. వందల మంది ఎన్యూమరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నా సాంకేతిక సమస్యలు సర్వేకు ప్రతిబంధకంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆరునెలలైనా సర్వే పూర్తికాదని సిబ్బంది చెబుతున్నారు. అధిక సమయం కేటాయించాల్సి రావడంతో సర్వే అంటేప్రజలు భయపడుతున్నారు. పని సమయంలో దూరంగా ఉంటున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రజాసాధికార సర్వే ఈనెల 8న ప్రారంభమైంది. రెండు విడతలుగా జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించాలి. రోజుకు ఒక ఎన్యూమరేటర్ కనీసం 14 కుటుంబాల వివరాలు నమోదుచేయాలి. జిల్లాలో 7.5 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 29 లక్షల మంది పేర్లు, వారి వివరాలను పొందుపరచాలి. దీనికోసం గ్రామీణ ప్రాంతాలకు 1482 మంది ఎన్యూమరేటర్లు, వారికి సహాయకులను నియమించారు. 40 మంది మండల ఇన్‌చార్జిలు, 39 మంది మాస్టర్ ట్రైనీలు, 178 మంది సూపర్‌వైజర్లను నియమించారు. అర్బన్ ప్రాంతాలకు 224 మంది ఎన్యూమరేటర్లు, ఆర్బన్ ఇన్‌చార్జిలు ఐదుగురు, తొమ్మిది మంది మాస్టర్ ట్రైనీలు, 27 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ట్యాబ్‌లకు సాఫ్ట్‌వేర్‌లు సహకరించకపోవడం, రోజుకో వెర్షన్‌తో ట్యాబ్‌లు నింపి సర్వేలు చేయించడం, నెట్‌వర్క్‌లేని చోట ప్రత్యామ్నాయం లేకపోవడం, తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికమించలేకపోవడం వంటి సమస్యలు సర్వేకు సంకెళ్లు వేస్తున్నాయి.
ఇదీ పరిస్థితి...
గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలకు 669 మంది విధుల్లో చేరారు. ఎనిమిదిరోజుల్లో 3,160 కుటుంబాలకు చెందిన 7,849 మంది వివరాలను మాత్రమే నమోదుచేయగలిగారు. అర్బన్ ప్రాంతాల్లో 141 మంది ఎన్యూమరేటర్లు విధుల్లో చేరగా, వీరు ఇప్పటి వరకు 83 కుటుంబాలు సర్వేలు చేసి, 213 మంది వివరాలను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేశారు. వాస్తవానికి ఎనిమిదిరోజుల్లో అధికారుల అందజేసిన ప్రణాళిక ప్రకారం 1,80,000 కుటుంబాలకు చెందిన సభ్యుల వివరాలను నమోదుచేయాలి. లక్ష్యంలో కనీసం రెండు శాతం కూడా సాధించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సర్వేకు ఆరునెలలు మించి సమయం అవసరమవుతుందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు.
వెర్షన్‌లు మార్చుతున్నా...
సర్వే సిబ్బందికి వెర్షన్ 2.1పై శిక్షణ ఇచ్చారు. ఇది ఈ నెల ఆరోతేదీ నాటికి పనిచేయక పోవడంతో 8వ తేదీ నాటికి 2.2 వెర్షన్‌ను ప్రవేశ పెట్టారు. తరువాత క్షేత్ర స్థాయిలో ఈ వెర్షన్ కూడా సక్సెస్ కాలేదు. దీంతో 2.3 వెర్షన్, తాజాగా 2.4 వెర్షన్‌ను తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సర్వేలకు ట్యాబ్‌లు సమస్యగా మారాయి. పల్లెల్లో 2జీ, 3జీ నెట్‌వర్క్‌లు లేకపోవడంతో ఎన్యూమరేటర్లు అవస్థలు పడుతున్నారు. వివరాలు తెలిపేందుకు ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. పనిగంటలు కోల్పోతున్నారు.
సహకారం అరకొరే...
ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై నమ్మకం కలగడం లేదు. ఈ సర్వే అనంతరం ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెడుతుందోనన్న ఆందోళన నెలకొంది. మోటారు బైక్, టీవీ, పక్కా ఇల్లు, వంట గ్యాస్ ఉన్నవారికి తెలుపు రేషన్ కార్డును తీసివేస్తారన్న భయం ప్రజల్లో ఉంది. ఇటీవల ప్రభుత్వం చె ప్పిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకపోవడంతో సర్వేలపై నమ్మకం సడలింది. సర్వే సిబ్బందికి ప్రజల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉంది. దీనికి తోడుగా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ లాగిన్ చేయడం, చంద్ర న్న బీమా పథకం అనుసంధానం చేయడంతో మరికొంత జాప్యం జరుగుతోంది. సర్వేపై అధికారులు కూడా ప్రజలను నమ్మించలేకపోతున్నారు. ఫలితం... సాంకేతిక సమస్యలతో పాటు ప్రజాస్పందన లేకపోవడం సర్వే నత్తనడకన సాగుతోంది.