Public authoritative survey
-
సంక్షేమ పథకాల్లో కోతా?
= నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించం = వైఎస్సార్సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి ధర్మవరంటౌన్ : ప్రజా సాధికార సర్వేతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని నమ్మబలికి, వివరాలు సేకరించిన తర్వాత సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ వారు ఒక సర్క్యులర్ జారీ చేశారని, అర్హులైన నిరుపేద రేషన్ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయకుండా అనవసర నిబంధనలు ఉంచి, రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నడం దారుణమన్నారు. సర్క్యులర్ ప్రకారం కుటుంబానికి ద్విచక్ర వాహనం ఉన్నా, నాలుగు చక్రాల వాహనం ఏదేని కలిగి ఉన్నా రేషన్ కార్డును రద్దు చేసేలా నిబంధనలు పెట్టారన్నారు. రేషన్ కార్డులను రద్దు చేసేందుకు నియోజకవర్గానికి ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లను నియమించి మరీ జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం సాధికార సర్వేలో అందించిన వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటోందన్నారు. ఏదైన కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం చిన్నపాటి సరుకు రవాణా చేసేందుకు, ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకునేందుకు, మరికొంత మంది జీవనోపాధికోసం వాహనాలను నడుపుతుంటే అటువంటివారిపై ఇలా కక్షసాధించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో రేషన్ షాపుల డీలర్లు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నారన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందించాలంటే వారి వద్ద ప్రైవేట్ వస్తువులు కారంపొడి, ధనియాలపొడి, గోధుమపిండిలతో పాటు పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తేనే బియ్యం వేస్తున్నారని, లేని వారికి రేషన్ అందించడం లేదన్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో ఎమ్మెల్యేకు, అధికారులకు రేషన్ డీలర్లు ఎంతమొత్తంలో ఇస్తున్నారో అర్థం అవుతోందన్నారు. వరుస కరువులతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడిపోతుంటే కనీసం పంట నష్ట పరిహారం గానీ, చేనేతలకు రుణాలను గానీ అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. జిల్లాలో ప్రజలకు తాగడానికి గంజి కూడా లేక అలమటిస్తుంటే ముఖ్యమత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రం అవినీతి సొమ్ముతో విలాసవంతమైన బంగ్లాలు నిర్మించి జల్సా చేస్తున్నారని ఆరోపించారు. సాధికార సర్వేను ప్రామాణికం చేసుకుని సంక్షేమ పథకాలను కోత విధించాలని చూస్తే సహించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ విడుదల చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకొవాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
సర్వేకు సాంకేతిక సంకెళ్లు..!
జిల్లాలో ప్రజాసాధికార(పల్స్) సర్వే ముందుకు సాగడం లేదు. ప్రారంభించి ఎనిమిది రోజులు గడిచింది. కనీసం నాలుగువేల కుటుంబాల వివరాలను నమో దు చేయలేకపోయారు. వందల మంది ఎన్యూమరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నా సాంకేతిక సమస్యలు సర్వేకు ప్రతిబంధకంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆరునెలలైనా సర్వే పూర్తికాదని సిబ్బంది చెబుతున్నారు. అధిక సమయం కేటాయించాల్సి రావడంతో సర్వే అంటేప్రజలు భయపడుతున్నారు. పని సమయంలో దూరంగా ఉంటున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రజాసాధికార సర్వే ఈనెల 8న ప్రారంభమైంది. రెండు విడతలుగా జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించాలి. రోజుకు ఒక ఎన్యూమరేటర్ కనీసం 14 కుటుంబాల వివరాలు నమోదుచేయాలి. జిల్లాలో 7.5 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 29 లక్షల మంది పేర్లు, వారి వివరాలను పొందుపరచాలి. దీనికోసం గ్రామీణ ప్రాంతాలకు 1482 మంది ఎన్యూమరేటర్లు, వారికి సహాయకులను నియమించారు. 40 మంది మండల ఇన్చార్జిలు, 39 మంది మాస్టర్ ట్రైనీలు, 178 మంది సూపర్వైజర్లను నియమించారు. అర్బన్ ప్రాంతాలకు 224 మంది ఎన్యూమరేటర్లు, ఆర్బన్ ఇన్చార్జిలు ఐదుగురు, తొమ్మిది మంది మాస్టర్ ట్రైనీలు, 27 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ట్యాబ్‌లకు సాఫ్ట్వేర్లు సహకరించకపోవడం, రోజుకో వెర్షన్‌తో ట్యాబ్‌లు నింపి సర్వేలు చేయించడం, నెట్‌వర్క్‌లేని చోట ప్రత్యామ్నాయం లేకపోవడం, తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికమించలేకపోవడం వంటి సమస్యలు సర్వేకు సంకెళ్లు వేస్తున్నాయి. ఇదీ పరిస్థితి... గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలకు 669 మంది విధుల్లో చేరారు. ఎనిమిదిరోజుల్లో 3,160 కుటుంబాలకు చెందిన 7,849 మంది వివరాలను మాత్రమే నమోదుచేయగలిగారు. అర్బన్ ప్రాంతాల్లో 141 మంది ఎన్యూమరేటర్లు విధుల్లో చేరగా, వీరు ఇప్పటి వరకు 83 కుటుంబాలు సర్వేలు చేసి, 213 మంది వివరాలను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేశారు. వాస్తవానికి ఎనిమిదిరోజుల్లో అధికారుల అందజేసిన ప్రణాళిక ప్రకారం 1,80,000 కుటుంబాలకు చెందిన సభ్యుల వివరాలను నమోదుచేయాలి. లక్ష్యంలో కనీసం రెండు శాతం కూడా సాధించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సర్వేకు ఆరునెలలు మించి సమయం అవసరమవుతుందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. వెర్షన్లు మార్చుతున్నా... సర్వే సిబ్బందికి వెర్షన్ 2.1పై శిక్షణ ఇచ్చారు. ఇది ఈ నెల ఆరోతేదీ నాటికి పనిచేయక పోవడంతో 8వ తేదీ నాటికి 2.2 వెర్షన్‌ను ప్రవేశ పెట్టారు. తరువాత క్షేత్ర స్థాయిలో ఈ వెర్షన్ కూడా సక్సెస్ కాలేదు. దీంతో 2.3 వెర్షన్, తాజాగా 2.4 వెర్షన్‌ను తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సర్వేలకు ట్యాబ్‌లు సమస్యగా మారాయి. పల్లెల్లో 2జీ, 3జీ నెట్‌వర్క్‌లు లేకపోవడంతో ఎన్యూమరేటర్లు అవస్థలు పడుతున్నారు. వివరాలు తెలిపేందుకు ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. పనిగంటలు కోల్పోతున్నారు. సహకారం అరకొరే... ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై నమ్మకం కలగడం లేదు. ఈ సర్వే అనంతరం ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెడుతుందోనన్న ఆందోళన నెలకొంది. మోటారు బైక్, టీవీ, పక్కా ఇల్లు, వంట గ్యాస్ ఉన్నవారికి తెలుపు రేషన్ కార్డును తీసివేస్తారన్న భయం ప్రజల్లో ఉంది. ఇటీవల ప్రభుత్వం చె ప్పిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకపోవడంతో సర్వేలపై నమ్మకం సడలింది. సర్వే సిబ్బందికి ప్రజల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉంది. దీనికి తోడుగా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ లాగిన్ చేయడం, చంద్ర న్న బీమా పథకం అనుసంధానం చేయడంతో మరికొంత జాప్యం జరుగుతోంది. సర్వేపై అధికారులు కూడా ప్రజలను నమ్మించలేకపోతున్నారు. ఫలితం... సాంకేతిక సమస్యలతో పాటు ప్రజాస్పందన లేకపోవడం సర్వే నత్తనడకన సాగుతోంది. -
పల్స్‌డౌన్
స్మార్ట్ పల్స్ సర్వేలో హార్డ్ ప్రశ్నలు ఏకంగా 80 ప్రశ్నలు సంధిస్తున్న సిబ్బంది వాటిలో పలు వ్యక్తిగత, రహస్యంగా ఉంచాల్సిన అంశాలు అభ్యంతరం చెబుతున్న ప్రజలు డొక్కు ట్యాబ్‌లతో ప్రహసనం సక్రమంగా సాగని ప్రజా సాధికార సర్వే ‘మీకు బ్యాంకు అకౌంట్ ఉందా?.. ఉంటే నెంబరెంత?.. భూమి ఉందా?.. దానికి బీమా ఉందా?.. ఏం చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు, రోల్ నంబరెంత? ఆస్తులెన్ని, అప్పులెన్ని? వచ్చే ఆదాయమెంత? పెట్టే ఖర్చెంత?’.. ఇవన్నీ చదువుతుంటే మీకేదో సినిమా గుర్తుకు రావడం లేదూ!.. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో అచ్చం ఇలాగే ‘మీకు ఇల్లుందా? ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లుందా? అది ఆడదా? మగదా?’ అంటూ అర్థం పర్థం లేని ప్రశ్నలతో ఎదుటివారిని విసిగించే సన్నివేశాలు చూసి పగలబడి నవ్వుకున్నాం. అప్పట్లో కామెడీ పంచిన సన్నివేశాలు.. ఆ తరహా ప్రశ్నలే ఇప్పుడు ఎదురవుతుండటంతో జనం విసుగు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వ సిబ్బంది సంధిస్తున్న సుమారు 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు పలు సమస్యలతో ఈ సర్వే సక్రమంగా సాగడం లేదు. తెలుసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా వివరాలు సేకరిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇతరులకు తెలియడం వల్ల మున్ముందు ఇబ్బందులు తలెత్తవచ్చని, ఆందోళన చెందుతున్నారు. దీన్ని ముందుగా ఊహించుకుని కొంతమంది సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు. ఇంట్లో టీవీలు, ఫ్రిజ్‌లు, గ్యాస్, రేషన్, ఆధార్‌కార్డుల నంబర్లు వంటివి మాత్రమే ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. దీంతో ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. పైగా సర్వేకు ఉపయోగించే ట్యాబ్‌లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. నాలుగైదేళ్ల క్రితం నాటి ట్యాబ్‌లు అదేపనిగా మొరాయిస్తున్నాయి. అంతేకాదు.. వాటిలో వాడే సిమ్‌లకు అనేక చోట్ల సిగ్నల్స్ సరిగా అందక సమాచారం నిక్షిప్తం కావడం లేదు. దీంతో సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి కుస్తీలు పడుతున్నారు. ఇంతలో ట్యాబ్‌ల చార్జింగ్ అయిపోతోంది. మళ్లీ చార్జింగ్ పెట్టాలంటే నాలుగైదు గంటల సమయం పడుతోంది. దీంతో సర్వే చేస్తున్న ఇంట్లోనే చార్జింగ్ పెట్టి గంటల తరబడి ఖాళీగా వేచి చూస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకే సమయంలో ట్యాబ్‌ల్లో సమాచారం ఫీడ్ చేయడం వల్ల ‘నాట్ సపోర్టు సర్వర్’ అనే సమాచారం వస్తోంది. తరచూ సర్వర్ హ్యాంగ్ అయిపోతోంది. అవగాహన కల్పించకుండా సర్వేకు.. మరోవైపు 50 ఏళ్లు పైబడిన వారితోనూ స్మార్ట్ పల్స్ సర్వే చేయిస్తున్నారు. వీరిలో చాలామందికి సెల్ఫోన్ల వినియోగం కూడా పూర్తిగా తెలియని వారున్నారు. ఇలాంటి వారికి ట్యాబ్‌ను ఆపరేట్ చేయడం రావడం లేదు. ట్యాబ్‌ల్లో నమోదు చేయడం, వస్తున్న సమాచారం, నిక్షిప్తమయ్యాక ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. పల్స్ సర్వేకి ముందు మొక్కుబడిగా గంట, రెండు గంటలకు మించి ట్యాబ్‌ల వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ అరకొర అవగాహనతో జనంలోకి వెళ్తున్న ఇలాంటి వారు ఆశించిన స్థాయిలో సర్వే చేయలేకపోతున్నారు. సర్వే ఎప్పటికవుతుంది? రోజుకు ఒక ఊరిలో 14 ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే రోజుకు ఒకట్రెండు ఇళ్ల సర్వే పూర్తి చేయడమే గగనమవుతోంది. తొలిదశలో ఈ నెల 8 నుంచి 31 వరకు, మలి విడతలో వచ్చే నెల 6 నుంచి 14 వరకు ఈ స్మార్ట్ పల్స్ సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న వేగాన్ని బట్టి ఈ సర్వే పూర్తి కావాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు.. సర్వే నుంచి వ్యక్తిగత వివరాల నమోదును తక్షణం నిలిపివేయకపోతే జనం నుంచి వ్యతిరేకత ఖాయమని చెబుతున్నారు. ఎక్కడి పనులక్కడే... అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందంతా స్మార్ట్ పల్స్ సర్వే కోసం ఊళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఆయా ఆఫీసుల్లో ఒకరిద్దరు అధికారులే తప్ప పనిచేసే సిబ్బందే లేకుండా పోతున్నారు. ఫలితంగా వివిధ అవసరాలపై వచ్చే ప్రజలకు పనులు జరగడం లేదు. ఇప్పటికే వారం రోజుల నుంచి ఎక్కడ పనులక్కడే స్తంభించిపోయాయి. ఈ నెలాఖరుదాకా సర్వే కొనసాగనుండడంతో జనానికి ఏ పనీ జరగ ని పరిస్థితి తలెత్తింది. -
ఈ కష్టాలేమి సర్వేశ్వరా!
సాగుతున్న ప్రజా సాధికార సర్వే సాంకేతిక లోపం అందరికీ శాపం ఒక్క పేరు నమోదుకు రోజంతా చాలదు పెనుమంట్ర/భీమవరం టౌన్ : రాష్ర్ట సర్కారు అట్టహాసంగా ప్రారంభించిన సాధికార సర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన సర్వే నత్తతోనూ పోటీ పడలేకపోతోంది. జిల్లాలో ఇప్పటికే 4 లక్షల మంది వివరాలను సేకరించాల్సి ఉండగా.. 15 వేల మంది వివరాలను సైతం నమోదు చేయలేకపోయారు. సర్వే వేగం ఎలా ఉందో దీనిని బట్టే అవగతం అవుతోంది. ఎన్యుమరేటర్లకు ఇచ్చిన ట్యాబ్స్‌లో స్మార్ట సర్వే సాఫ్ట్వేర్ 2.1 వెర్షన్ లోడ్ చేశారు. అది పనిచేయకపోవడంతో 2.2 వెర్షన్, ఆ తరువాత 2.3 వెర్షన్ ఇచ్చారు. అయినా.. ప్రజల వివరాలు నమోదు కాకపోవడంతో 2.3.1 వెర్షన్ డౌన్లోడ్ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో రెండు రోజుల క్రితం 2.4 వెర్షన్ సాఫ్ట్వేర్ ఇచ్చారు. అదికూడా అంతంత మాత్రంగానే స్పందిస్తోంది. ఇళ్లవద్దే పడిగాపులు రాష్ర్ట స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లతో జిల్లా స్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తుంటే.. టెలీ కాన్ఫరెన్సలతో మునిసిపల్ రెవెన్యూ అధికారులు కిందిస్థాయి అధికారులను, సిబ్బ ందిని పరుగులు పెట్టిస్తున్నారు. క్షే త్రస్థాయిలో పరిస్థితులు సహకరించకపోవడంతో సర్వే సిబ్బంది, ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్వే నిమిత్తం గ్రామాలకు వెళ్తున్న అధికారులు, సిబ్బంది రోజుకో ఇంటివద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక కుటుంబం వివరాలు పూర్తి చేయడానికి ఒక రోజు పడుతోంది. ఢిల్లీ నుంచి సాంకేతిక అనుమతి వచ్చేంతవరకు ట్యాబ్‌లు పట్టుకుని సిగ్నల్ కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ప్రజలు సైతం తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సర్వే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు అన్నిరకాల పత్రాలు చూపించాల్సి వస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా ఎన్యుమరేటర్లు రావడంతో అన్ని పత్రాలు కనిపించక ప్రజలు తికమక పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా పనులు మానుకుని పత్రాలను వెతకడం.. ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పడానికి రోజంతా సరిపోవడం లేదు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల వివరాలు చెప్పాల్సి రావడంతో ఇంటి యజమాని గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. పొరుగింట్లో సర్వే జరుగుతుంటే తరువాత తమ ఇళ్లకు వస్తారన్న ఉద్దేశంతో ఇరుగుపొరుగు వారు ఇళ్ల వద్దే వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలావుండగా సర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఆర్డీవోకు చుక్కెదురు పెనుమంట్ర మండలంలో సర్వే తీరును కొవ్వూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెలగలేరు గ్రామానికి వెళ్లిన ఆయన ఓ ఇంటి యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్యాబ్ పట్టుకుని వివరాలు నమోదు చేసేందుకు కుస్తీ పట్టారు. ఎంతకూ సాంకేతిక లోపం సవరణకాకపోవడంతో చివరకు ఆర్డీవో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
27 నుంచి ప్రజా సాధికార సర్వే
ప్రతి ఇంటికీ కొత్త నంబర్లు : ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడి సాక్షి, అమరావతి: ప్రజల నుంచి సమాచారం సేకరించడంతో పాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ కార్యదర్శి పి.ప్రద్యుమ్న తెలిపారు. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ ట్యాబ్ ద్వారా ఫొటో తీసి, దాన్ని జియోట్యాగ్ చేసి కొత్త నంబరును వెంటనే కేటాయిస్తామన్నారు. సర్వేలో పాల్గొనే మాస్టర్ ట్రైనర్స్‌కు గురువారం విజయవాడలో ఒక రోజు శిక్షణ నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన 2,500 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారుల్లో చాలామందికి ఆధార్ లేదని, వీరందరికీ సర్వేలో ఆధార్ నంబర్ ఇస్తామన్నారు. ఆధార్ కార్డులో సమాచార లోపాన్ని సరిదిద్దడం, మొబైల్ నంబరును అనుసంధానించడం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27న ఈ సర్వే ప్రారంభిస్తారని, సుమారు 40 రోజులు కొనసాగుతుందని ప్రద్యుమ్న తెలిపారు. విదేశాలు, పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ర్ట పౌరులందరూ ఈ సర్వేలో పాల్గొనవచ్చన్నారు.