పల్స్‌డౌన్
స్మార్ట్ పల్స్ సర్వేలో హార్డ్ ప్రశ్నలు
ఏకంగా 80 ప్రశ్నలు సంధిస్తున్న సిబ్బంది
వాటిలో పలు వ్యక్తిగత, రహస్యంగా ఉంచాల్సిన అంశాలు
అభ్యంతరం చెబుతున్న ప్రజలు డొక్కు ట్యాబ్‌లతో ప్రహసనం
సక్రమంగా సాగని ప్రజా సాధికార సర్వే
‘మీకు బ్యాంకు అకౌంట్ ఉందా?.. ఉంటే నెంబరెంత?.. భూమి ఉందా?.. దానికి బీమా ఉందా?.. ఏం చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు, రోల్ నంబరెంత? ఆస్తులెన్ని, అప్పులెన్ని? వచ్చే ఆదాయమెంత? పెట్టే ఖర్చెంత?’.. ఇవన్నీ చదువుతుంటే మీకేదో సినిమా గుర్తుకు రావడం లేదూ!.. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో అచ్చం ఇలాగే ‘మీకు ఇల్లుందా? ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లుందా? అది ఆడదా? మగదా?’ అంటూ అర్థం పర్థం లేని ప్రశ్నలతో ఎదుటివారిని విసిగించే సన్నివేశాలు చూసి పగలబడి నవ్వుకున్నాం. అప్పట్లో కామెడీ పంచిన సన్నివేశాలు.. ఆ తరహా ప్రశ్నలే ఇప్పుడు ఎదురవుతుండటంతో జనం విసుగు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వ సిబ్బంది సంధిస్తున్న సుమారు 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు పలు సమస్యలతో ఈ సర్వే సక్రమంగా సాగడం లేదు.
తెలుసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా వివరాలు సేకరిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇతరులకు తెలియడం వల్ల మున్ముందు ఇబ్బందులు తలెత్తవచ్చని, ఆందోళన చెందుతున్నారు. దీన్ని ముందుగా ఊహించుకుని కొంతమంది సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు. ఇంట్లో టీవీలు, ఫ్రిజ్‌లు, గ్యాస్, రేషన్, ఆధార్‌కార్డుల నంబర్లు వంటివి మాత్రమే ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. దీంతో ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. పైగా సర్వేకు ఉపయోగించే ట్యాబ్‌లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. నాలుగైదేళ్ల క్రితం నాటి ట్యాబ్‌లు అదేపనిగా మొరాయిస్తున్నాయి. అంతేకాదు.. వాటిలో వాడే సిమ్‌లకు అనేక చోట్ల సిగ్నల్స్ సరిగా అందక సమాచారం నిక్షిప్తం కావడం లేదు. దీంతో సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి కుస్తీలు పడుతున్నారు. ఇంతలో ట్యాబ్‌ల చార్జింగ్ అయిపోతోంది. మళ్లీ చార్జింగ్ పెట్టాలంటే నాలుగైదు గంటల సమయం పడుతోంది. దీంతో సర్వే చేస్తున్న ఇంట్లోనే చార్జింగ్ పెట్టి గంటల తరబడి ఖాళీగా వేచి చూస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకే సమయంలో ట్యాబ్‌ల్లో సమాచారం ఫీడ్ చేయడం వల్ల ‘నాట్ సపోర్టు సర్వర్’ అనే సమాచారం వస్తోంది. తరచూ సర్వర్ హ్యాంగ్ అయిపోతోంది.
అవగాహన కల్పించకుండా సర్వేకు..
మరోవైపు 50 ఏళ్లు పైబడిన వారితోనూ స్మార్ట్ పల్స్ సర్వే చేయిస్తున్నారు. వీరిలో చాలామందికి సెల్‌ఫోన్ల వినియోగం కూడా పూర్తిగా తెలియని వారున్నారు. ఇలాంటి వారికి ట్యాబ్‌ను ఆపరేట్ చేయడం రావడం లేదు. ట్యాబ్‌ల్లో నమోదు చేయడం, వస్తున్న సమాచారం, నిక్షిప్తమయ్యాక ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. పల్స్ సర్వేకి ముందు మొక్కుబడిగా గంట, రెండు గంటలకు మించి ట్యాబ్‌ల వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ అరకొర అవగాహనతో జనంలోకి వెళ్తున్న ఇలాంటి వారు ఆశించిన స్థాయిలో సర్వే చేయలేకపోతున్నారు.
సర్వే ఎప్పటికవుతుంది?
రోజుకు ఒక ఊరిలో 14 ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే రోజుకు ఒకట్రెండు ఇళ్ల సర్వే పూర్తి చేయడమే గగనమవుతోంది. తొలిదశలో ఈ నెల 8 నుంచి 31 వరకు, మలి విడతలో వచ్చే నెల 6 నుంచి 14 వరకు ఈ స్మార్ట్ పల్స్ సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న వేగాన్ని బట్టి ఈ సర్వే పూర్తి కావాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు.. సర్వే నుంచి వ్యక్తిగత వివరాల నమోదును తక్షణం నిలిపివేయకపోతే జనం నుంచి వ్యతిరేకత ఖాయమని చెబుతున్నారు.
ఎక్కడి పనులక్కడే...
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందంతా స్మార్ట్ పల్స్ సర్వే కోసం ఊళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఆయా ఆఫీసుల్లో ఒకరిద్దరు అధికారులే తప్ప పనిచేసే సిబ్బందే లేకుండా పోతున్నారు. ఫలితంగా వివిధ అవసరాలపై వచ్చే ప్రజలకు పనులు జరగడం లేదు. ఇప్పటికే వారం రోజుల నుంచి ఎక్కడ పనులక్కడే స్తంభించిపోయాయి. ఈ నెలాఖరుదాకా సర్వే కొనసాగనుండడంతో జనానికి ఏ పనీ జరగ ని పరిస్థితి తలెత్తింది.