సంక్షేమ పథకాల్లో కోతా?
= నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించం
= వైఎస్సార్‌సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి
ధర్మవరంటౌన్ : ప్రజా సాధికార సర్వేతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని నమ్మబలికి, వివరాలు సేకరించిన తర్వాత సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల పౌరసరఫరాల శాఖ వారు ఒక సర్క్యులర్ జారీ చేశారని, అర్హులైన నిరుపేద రేషన్ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయకుండా అనవసర నిబంధనలు ఉంచి, రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నడం దారుణమన్నారు. సర్క్యులర్ ప్రకారం కుటుంబానికి ద్విచక్ర వాహనం ఉన్నా, నాలుగు చక్రాల వాహనం ఏదేని కలిగి ఉన్నా రేషన్ కార్డును రద్దు చేసేలా నిబంధనలు పెట్టారన్నారు. రేషన్ కార్డులను రద్దు చేసేందుకు నియోజకవర్గానికి ఫీల్డ్ లెవల్ ఆఫీసర్‌లను నియమించి మరీ జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం సాధికార సర్వేలో అందించిన వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటోందన్నారు.
ఏదైన కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం చిన్నపాటి సరుకు రవాణా చేసేందుకు, ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకునేందుకు, మరికొంత మంది జీవనోపాధికోసం వాహనాలను నడుపుతుంటే అటువంటివారిపై ఇలా కక్షసాధించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో రేషన్ షాపుల డీలర్లు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నారన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందించాలంటే వారి వద్ద ప్రైవేట్ వస్తువులు కారంపొడి, ధనియాలపొడి, గోధుమపిండిలతో పాటు పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తేనే బియ్యం వేస్తున్నారని, లేని వారికి రేషన్ అందించడం లేదన్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో ఎమ్మెల్యేకు, అధికారులకు రేషన్ డీలర్లు ఎంతమొత్తంలో ఇస్తున్నారో అర్థం అవుతోందన్నారు.
వరుస కరువులతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడిపోతుంటే కనీసం పంట నష్ట పరిహారం గానీ, చేనేతలకు రుణాలను గానీ అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. జిల్లాలో ప్రజలకు తాగడానికి గంజి కూడా లేక అలమటిస్తుంటే ముఖ్యమత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రం అవినీతి సొమ్ముతో విలాసవంతమైన బంగ్లాలు నిర్మించి జల్సా చేస్తున్నారని ఆరోపించారు. సాధికార సర్వేను ప్రామాణికం చేసుకుని సంక్షేమ పథకాలను కోత విధించాలని చూస్తే సహించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ విడుదల చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకొవాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.