సాగుతున్న ప్రజా సాధికార సర్వే
సాంకేతిక లోపం అందరికీ శాపం
ఒక్క పేరు నమోదుకు రోజంతా చాలదు
పెనుమంట్ర/భీమవరం టౌన్ : రాష్ర్ట సర్కారు అట్టహాసంగా ప్రారంభించిన సాధికార సర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన సర్వే నత్తతోనూ పోటీ పడలేకపోతోంది. జిల్లాలో ఇప్పటికే 4 లక్షల మంది వివరాలను సేకరించాల్సి ఉండగా.. 15 వేల మంది వివరాలను సైతం నమోదు చేయలేకపోయారు. సర్వే వేగం ఎలా ఉందో దీనిని బట్టే అవగతం అవుతోంది. ఎన్యుమరేటర్లకు ఇచ్చిన ట్యాబ్స్‌లో స్మార్‌ట సర్వే సాఫ్ట్‌వేర్ 2.1 వెర్షన్ లోడ్ చేశారు. అది పనిచేయకపోవడంతో 2.2 వెర్షన్, ఆ తరువాత 2.3 వెర్షన్ ఇచ్చారు. అయినా.. ప్రజల వివరాలు నమోదు కాకపోవడంతో 2.3.1 వెర్షన్ డౌన్‌లోడ్ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో రెండు రోజుల క్రితం 2.4 వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఇచ్చారు. అదికూడా అంతంత మాత్రంగానే స్పందిస్తోంది.
ఇళ్లవద్దే పడిగాపులు
రాష్ర్ట స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లతో జిల్లా స్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తుంటే.. టెలీ కాన్ఫరెన్‌సలతో మునిసిపల్ రెవెన్యూ అధికారులు కిందిస్థాయి అధికారులను, సిబ్బ ందిని పరుగులు పెట్టిస్తున్నారు. క్షే త్రస్థాయిలో పరిస్థితులు సహకరించకపోవడంతో సర్వే సిబ్బంది, ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్వే నిమిత్తం గ్రామాలకు వెళ్తున్న అధికారులు, సిబ్బంది రోజుకో ఇంటివద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక కుటుంబం వివరాలు పూర్తి చేయడానికి ఒక రోజు పడుతోంది.
ఢిల్లీ నుంచి సాంకేతిక అనుమతి వచ్చేంతవరకు ట్యాబ్‌లు పట్టుకుని సిగ్నల్ కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ప్రజలు సైతం తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సర్వే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు అన్నిరకాల పత్రాలు చూపించాల్సి వస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా ఎన్యుమరేటర్లు రావడంతో అన్ని పత్రాలు కనిపించక ప్రజలు తికమక పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా పనులు మానుకుని పత్రాలను వెతకడం..
ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పడానికి రోజంతా సరిపోవడం లేదు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల వివరాలు చెప్పాల్సి రావడంతో ఇంటి యజమాని గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. పొరుగింట్లో సర్వే జరుగుతుంటే తరువాత తమ ఇళ్లకు వస్తారన్న ఉద్దేశంతో ఇరుగుపొరుగు వారు ఇళ్ల వద్దే వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలావుండగా సర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
ఆర్డీవోకు చుక్కెదురు
పెనుమంట్ర మండలంలో సర్వే తీరును కొవ్వూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెలగలేరు గ్రామానికి
వెళ్లిన ఆయన ఓ ఇంటి యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్యాబ్ పట్టుకుని వివరాలు నమోదు చేసేందుకు కుస్తీ పట్టారు. ఎంతకూ సాంకేతిక లోపం సవరణకాకపోవడంతో చివరకు ఆర్డీవో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ కష్టాలేమి సర్వేశ్వరా!
Published Fri, Jul 15 2016 3:51 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement