కడప కల్చరల్:ప్రముఖ సాహితీవేత్త, సీపీ బ్రౌన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి సాహితీపీఠం ఐదవ పురస్కారాన్ని సుప్రసిద్ద సాహితీవేత్త ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి అందజేయనున్నట్లు పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్, ముఖ్య సలహాదారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 23న కడప నగరంలో నిర్వహించనున్న ప్రత్యేక సాహితీ సభలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ సాహితీవేత్తలు, రాష్ఠ్ర స్థాయి ప్రముఖులు హాజరవుతారని కూడా వారు తెలిపారు.