తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
చిలమత్తూరు : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ చిలమత్తూరు పంచాయతీ కాపుచెన్నంపల్లి గ్రామస్తులు మంగళవారం బస్టాండ్ సమీపంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 40 రోజుల్లో గ్రామస్తులు నీటికోసం మూడుసార్లు నిరసన తెలిపడం గమనార్హం. గ్రామంలోని రెండుబోర్లు పని చేయకపోవడంతో పాటు మోటార్లు పాడు కావడంతో తాగునీటి సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యను అధికారులకు వివరించినా ఫలితం శూన్యమన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. అక్కడ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ సుబ్రమణ్యం, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శకుంతలతో వాగ్వాదానికి దిగారు. నూతనంగా బోరు ఏర్పాటు చేసే వరకు ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.