బస్సుల్లో భద్రత డొల్ల | Private travel buses catastrophes | Sakshi
Sakshi News home page

బస్సుల్లో భద్రత డొల్ల

Published Fri, Mar 3 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

బస్సుల్లో భద్రత డొల్ల

బస్సుల్లో భద్రత డొల్ల

ఇష్టారాజ్యంగా తిప్పుతున్న    ప్రైవేటు బస్సులు
ఆదాయమే ముఖ్యం
ప్రయాణం గాలిలో దీపం
 రిజిస్ట్రేషన్‌ ఒక చోట.. తిప్పేది     మరోచోట
 అవసరాలను బట్టి రెట్టింపు     చార్జీల వసూలు
అధికార పార్టీ నాయకుల అండతో నిబంధనలకు తిలోదకాలు
పెద్దల ఒత్తిడితో చోద్యం చూస్తున్న రవాణా శాఖాధికారులు


తిరుపతి క్రైం :   ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దూకుడు తగ్గడం లేదు. ఘోర ప్రమాదాలు జరిగినా కనువిప్పు కలగడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండా చట్టవ్యతిరేకంగా రాకపోకలు సాగి స్తున్నా అ«ధికారులు అడ్డుకట్ట వేయడంలేదు. తాజాగా కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు బస్సుల ప్ర యాణమంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో  తనిఖీలు నామమాత్రమే నంటూ ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ అధికార పార్టీ నేతలవే కావడం వల్ల రవాణా శాఖాధికారులు ఈబస్సులపై కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు.  ఆ బస్సుల్లో ప్రయాణం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో కండీషన్‌ లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సుల యజమానులు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారు. సీజన్‌ను బట్టి ప్రయాణికులు రద్దీగా ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప రక్షణపై కనీస శ్రద్ధ చూపడం లేదు. ఒకరోజు డ్రైవర్‌ లేక బస్సు ఆగితే వేలాది రూపాయలు ఆదాయం పోతుందని   లైసెన్స్‌ లేని డ్రైవర్లను దూర ప్రాంతాలకు పంపుతున్నారు.  అనుమతులు లేకున్నా అంతర్‌ రాష్ట్ర సర్వీస్‌లని భారీగా ప్రచారం చేస్తున్నారు.

కొన్ని ప్రైవేటు రవాణా సంస్థలు ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. నిత్యం తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాలకు వోల్వా బస్సులు, ఇతర ప్రైవేటు బస్సులు కలిపి సుమారు 80కిపైగా నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ బస్సులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ కు చెందినవే ఉన్నాయి.   పన్నుల భారం తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారు.

నాయకులే కొండంత అండ
విజయవాడ, అనంతపురం ప్రాంతాలకు చెందిన అ«ధికార పార్టీ లోక్‌సభ సభ్యులు ట్రావెల్స్‌ వ్యాపారానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు.  వారిద్దరూ రాష్ట్రంలోని ప్రముఖ ట్రావెల్స్‌కు యజమానులుగా ఉన్నారు. వ్యాపారలోకానికి నాయకులు కొండంత అండగా ఉండడంతో తమకు అడ్డు పడేది ఎవరని ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లు మీసాలు మెలివేస్తుండడం గమనార్హం.

దురుసు డ్రైవింగ్‌తో ప్రమాదాలు
డ్రైవర్ల దురుసుతనంతో ప్రమాదాలు జరిగినట్టు పలు పరిశోధనల్లో తేలింది. సర్వేలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. డ్రైవర్లు బాధ్యతతో మెలగాలని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా తీరు మారడంలేదు. డ్రైవర్ల కొరతతో యజమానులు లైసెన్స్‌ ఉంటే చాలు ఎటువంటివారికైనా ఉద్యోగాలు ఇస్తున్నారు.  పనితీరు, గతంలో ప్రమాదాలతో సంబంధాలపై ఆరా తీయడంలేదు. ప్రతి నెల రవాణా అధికారులు డ్రైవర్లకు  అవగాహన కల్పించాలని ఆంక్షలున్నా  అమలు కావడంలేదు.

కలవరపరుస్తున్న వంతెనలు    
జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వంతెనలు, కల్వర్టులు ప్రయాణికులను కలవరపరుస్తున్నాయి. వంతెనలు నిర్మించిన అనంతరం కనీసం పక్కన పిట్టగోడలు కూడా నిర్మించడం లేదు. కొన్నిచోట్ల వాటిని గుర్తించేందుకు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడంలేదు. కనీస నిబంధనలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. అధికస్థాయిలో ప్రమాదాలు ఇలాంటి ప్రాంతాల్లోనే చోటుచేసుకుటుండడం గమనార్హం. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

తిరుపతి నుంచి నడిచే ప్రైవేటు వోల్వో బస్సులు   45
సాధారణ బస్సులు   24
రోజూ ప్రయాణించేవారు    3,800మంది 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement