Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం...
‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు.
అనుభవాలను మర్చిపోవద్దు..
జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది.
2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు.
ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు.
కవరేజీ చాలినంత..
హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి.
రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు.
ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు.
ఎలాంటి కవరేజీ..?
ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం.
ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు.
ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు.
భారం తగ్గాలంటే..?
హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది.