‘సర్వే’జనాగ్రహం | problems in servay | Sakshi
Sakshi News home page

‘సర్వే’జనాగ్రహం

Published Sun, Jul 24 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

రాత్రి వేళల్లో సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్‌

రాత్రి వేళల్లో సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్‌

– ప్రహసనంగా ప్రజాసాధికార సర్వే
– నిలిచిపోతున్న అభివృద్ధి పనులు
– విద్యార్థులకు అందని ధ్రువీకరణ పత్రాలు
– పరిష్కారం కాని ప్రజా సమస్యలు
– అధికారులంతా సర్వేలోనే..!
– వెలవెలబోతున్న ప్రభుత్వ కార్యాలయాలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌) : 
సాధికార సర్వే..ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అధికారులను ఇబ్బంది పెడుతోంది. అభివృద్ధి పనులకు సైతం అడ్డంకిగా మారుతోంది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో 5,060 మంది ప్రభుత్వ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. సర్వే కోసం రెవెన్యూ శాఖతోపాటు అన్ని శాఖల సిబ్బందిని తీసుకున్నారు.  అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 2,380 బ్లాక్‌లుగా విభజించి సర్వే చేస్తున్నారు.  ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్, ఆయనకు అసిస్టెంట్‌ ఉంటారు. 240 మంది సూపర్‌వైజర్లు, 64 మంది చార్జి ఆఫీసర్లు సర్వేలో పాలు పంచుకుంటున్నారు. సాంకేతిక సమస్యలు అడుగడుగునా అడ్డంకిగా మారాయి.  దీంతో సర్వే  సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఉద్యోగులు సర్వేలో ఉండడంతో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. 
ఇక్కట్లు ఇవీ..
వివిధ ధ్రువపత్రాల జారీలో ముందుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంతకాలు అవసరం. మీ సేవ కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్‌ కార్యాలయాల్లో డౌన్‌లోడ్‌ చేసి వెరిఫికేషన్‌ నిమిత్తం వీఆర్వోలకు రెఫర్‌ చేస్తారు. వారు పరిశీలించి ఓకే చేసిన తర్వాతనే ముందుకు పోతుంది. వీఆర్వోలతో పాటు రెవెన్యూ సిబ్బంది సైతం ప్రజాసాధికార సర్వేలో నిమగ్నం కావడంతో విద్యార్థులు,రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్ల కార్యక్రమం జరుగుతోంది. అలాగే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ధ్రువపత్రాలు సకాలంలో లభించక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి ఇన్‌కమ్, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, వారసత్వపు సర్టిఫికెట్లు, 1బీ అడంగల్‌ తదితర వాటికి దరఖాస్తులు దాదాపు 8000 వరకు వచ్చాయి. ప్రజాసాధికార సర్వే వల్ల ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. 
పడకేసిన అభివృద్ధి
ప్రజాసాధికార సర్వేతో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌లు ఆగిపోయాయి. వెబ్‌ల్యాండ్‌లో సవరణలు నిలిచిపోయాయి. నీటి తీరువా వసూళ్లు ఆగిపోయాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంలో పది శాతం వసూలు చేయడాన్ని వన్‌టైమ్‌ కన్వర్షన్‌ అంటారు. ఇదీ నిలిచిపోయింది. వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, సంక్షేమ శాఖలతో పాటు వివిధ శాఖల సిబ్బంది సర్వేలో పాల్గొనడం వల్ల ఆయా శాఖల కార్యక్రమాలు నిలిచిపోయాయి. 
 తొలగని అడ్డంకులు... 
 ఒక ఎన్యుమరేటర్‌ ప్రతిరోజూ విధిగా 14 కుటుంబాలను సర్వే చేయాలని నిబంధన విధించారు. ఈ ప్రకారం రోజుకు 33,320 కుటుంబాలు సర్వే చేయాలి. జిల్లా 2,380 బ్లాక్‌లు ఉండగా రోజుకు సగటున ఒక్కో బ్లాక్‌లో మూడు ఇళ్లు కూడా సర్వే చేయడం కష్టమవుతోంది. ఈనెల 10వ తేదీ సర్వే మొదలు అయినప్పటికీ ఇంతవరకు 60 వేల కుటుంబాలు కూడా పూర్తి కాలేదు. జిల్లాలో దాదాపు పది లక్షల కుటుంబాల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. రోజుకు 300 నుంచి 500 ఎన్యుమరేటర్లు ఆన్‌లైన్‌లో లాగిన్‌ కాలేకపోతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరి అథంటికేషన్‌ తీసుకోవాల్సి ఉంది. ఉదయం లేచింది ఎవ్వరి పనులకు వారు వెళ్తున్నారు. దీంతో అథెంటికేషన్‌ సమస్యలు ఏర్పడ్డాయి. సర్వర్‌ డౌన్‌ కావడం, నెట్‌వర్క్‌ సమస్యలు ఏర్పడటం, ట్యాబ్‌ల చార్జింగ్‌ పడిపోతుండటంతో సమస్యలను అధిగమించడం పెద్ద సమస్యగా మారింది. సర్వేలో చిన్నారులకు ప్రశ్నలు ఉన్నాయి. నిరుద్యోగులా... సంపాదించేవారు అనే ప్రశ్నలు ఉండటం గమనార్హం. 
పేరు ఒకరిది...సర్వే చేసేది మరొకరు 
వివిధ మండలాల్లో ఎన్యూమరేటర్లు ప్రజాసాధికార సర్వేలో బినామీలను పెట్టుకున్నట్లు సమాచారం. ఎన్యూమరేటర్‌ ఇటు సర్వేకు వెల్లకుండా.. ఇటు విధులు నిర్వహించకుండ బినామీలకు అప్పగించి స్వంత పనులు చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో సర్వేలో పారదర్శకత లోపిపంచే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితి వెల్దుర్తి మండలంలో ఎక్కువగా ఉంది.
రాత్రివేళల్లోను సర్వే... 
పలువురు ఎన్యుమరేటర్లు రాత్రిపూట సైతం సర్వే చేపడుతున్నారు. రోజుకు విధిగా 14 కుటుంబాలు సర్వే చేయాలని కలెక్టర్, జేసీ ఆదేశాలు ఇస్తుండటం రాత్రిపూట నెట్‌వర్క్‌ ఉంటుందనే ఉద్దేశంతో సర్వే చేస్తున్నారు. పది శాతం మంది ఎన్యుమరేటర్లు రాత్రిపూట సైతం సర్వే చేస్తున్నారు. రాత్రివేళల్లో సైతం సర్వర్‌ పనిచేయడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. సర్వే వేగవంతం కావడానికి, ప్రజా సమస్యలు సత్వరం పని చేయడానికి ఆఫ్‌లైన్‌ సర్వేనే శరణ్యమని పలువురు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement