రాజంపేట: జిల్లాలో ఉన్న మూడు డివిజన్‌లో ఒకటైన రాజంపేటకు బాస్ ఎప్పుడోస్తారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజంపేట రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కొత్త సారు ఎప్పుడు వస్తారో అని డివిజన్ రెవెన్యూ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ పోస్టును దక్కించుకునేందుకు జాబితాలో పదిమంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహిళా అధికారి ప్రయత్నాలు చేసుకుంటోంది. అయితే ఇంతవరకు ఎవరిని నియమించాలనే అంశంపై నిర్థారణకు ప్రభుత్వం రాలేదనే సమాచారం.
మినీకలెక్టరేట్ చేస్తే...
జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో ఒకటైన రాజంపేటను మినీ కలెక్టరేట్‌గా చేసే యోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే కానీ జరిగితే ఐఏఎస్‌ను సబ్ కలెక్టరుగా ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. పైగా రాజంపేట సబ్‌కలెక్టరు హోదా కలిగిన డివిజన్ కావడంతో దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ సబ్‌కలెక్టరుగా పనిచేసిన వారు ప్రభుత్వ స్థాయిలో రాష్ట్రస్థాయి క్యాడర్‌లో పనిచేశారు. దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఐఏఎస్‌ల పాలన రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో కొనసాగింది. వీరి హయాంలో రెవెన్యూపాలన సక్రమంగానే కొనసాగిందనే వాదన. ఎప్పుడైతే ఆర్డీవోల చేతిలోకి ఇక్కడి పాలన వెళ్లిందో అప్పటి నుంచి ఈ డివిజన్‌లో రెవిన్యూ పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది.
ఇష్టారాజ్యంగా రెవెన్యూ వ్యవహారాలు..
డివిజన్ రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలకు సంబంధించి 17 మండలాలు ఉన్నాయి. మొన్నటి వరకు పనిచేసినా ఆర్డీవో ప్రభాకర్‌పిళ్లై పదవీ విరమణ పొందిన తర్వాత సోమశిల స్పెషల్ డిప్యూటీ కార్యాలయం ఎస్‌డీసీ చెంగల్రావును ఇన్‌చార్జిగా నియమించారు. డివిజన్‌లో రెవెన్యూ వ్యవహారాలు ఇష్టారాజ్యంగా మారిపోయాయి. డివిజన్ పరిధిలోని తహసీల్దార్లపై అజమాయిషీ, పర్యవేక్షణ చేసే డివిజన్ కేంద్రంలో అధికారి లేకపోవడంతో ఎవరి పనివారిదే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. మరోవైపు అడ్డు అదుపు లేకుండా డివిజన్ పరిధిలో భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున తెరదీశారు. ఇన్‌చార్జి ఆర్డీవోగా ఉన్న చెంగల్రావు నామమాత్రమే అన్నట్లుగా కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నరీతిలో రెవెన్యూ పాలన కొనసాగుతోందన్న విమర్శలు వెలువడుతున్నాయి.
అనుకూలమైన వారి కోసం పచ్చనేతలు ప్రయత్నాలు..
రాజంపేట సబ్‌కలెక్టరేట్‌కు వచ్చే బాస్ తమకు అనుకూలమైన వారినే తెచ్చుకోవాలనే తపన పచ్చనేతల్లో కనిపిస్తోంది. సీఎం వద్దకు కొందరిపేర్లు ఇప్పటికే ఉన్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తన సామాజికవర్గానికి చెందిన రెవిన్యూ అధికారి(ఆర్టీవో)ని తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ డివిజన్ పరిధిలో రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలో తమకు పనులు జరగాలంటే తమ మార్కు ఉన్న అధికారి అయితేనే చక్కబెట్టుకోవచ్చునని పచ్చనేతలు భావిస్తున్నారు.
రాజంపేట రెవెన్యూ డివిజన్ కు సారొస్తారా
Published Sun, Oct 23 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement
Advertisement