రాయలు హత్యకేసులో ప్రముఖ హీరో అభిమాని
ఏలూరు: ప్రముఖ న్యాయవాది టీడీ రాయలు హత్యకేసులో విచారణ వేగవంతం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రాయలు హత్య కేసులో కీలక సూత్రధారి ప్రభు అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అతడు ఓ ప్రముఖ నటుడికి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రభుతోపాటు అతని మిత్రబృందం కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, న్యాయవాది రాయలు హత్యకేసులో నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని, రాయలు మృతదేహాన్ని ఎస్పీ భాస్కర్ భూషణ్ సందర్శించారు. హత్యలో నలుగురు నిందితులు పాల్గొన్నట్టు తెలుస్తోందని, వారిలో ఒకరు దొరకగా, మరో ముగ్గురిని పట్టుకోవాల్సిందని ఆయన చెప్పారు. రాయలు హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయలు అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఆయనకు నరికి చంపారు. స్థానికంగా ఉన్న గాంధీ స్కూల్ సమీపంలోని ఏసీ పరికరాలు విక్రయించే షాపులో రాయలు ఉండగా కాపు కాసిన దుండగులు ఒక్కసారిగా షాపులోకి దూసుకువచ్చి వేటకొడవళ్లతో దాడి చేశారు. రాయలు ఏలూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. రాయలు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.