– రుణం కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు లేఖ
– కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక
– నీటితొట్టెల నిర్మాణానికి చర్యలు
అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న అనంతలో ఉపాధి కూలీల వేతనాల సమస్య తీరింది. నెలల తరబడి కూలి అందకపోవడంతో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.25 కోట్లు వేతన బకాయిలు జిల్లాలో ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం వెల్లడించారు. ఆయా బ్యాంకుల్లో ఎవరైనా కూలీలు రుణం తీసుకుని ఉన్నా.. ఇతరత్రా బకాయిలు ఉన్నా ప్రస్తుతం జమ చేసిన మొత్తంలో పట్టుకోకూడదంటూ బ్యాంకర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాశారు.
కాగా, జిల్లాలో రోజూ 1.50 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరికి రెండు నెలల కూలి అందకపోవడంపై ‘కూలి కష్టం’ శీర్షికతో ఈనెల 14న జిల్లా ప్రధాన పేజీలో, ‘ఉపాధి యాతన’ శీర్షికతో ఈ నెల 19న మెయిన్‌లో వరుస కథనాలను సాక్షి ప్రచురించింది. వేతనాల చెల్లింపులను నిలిపివేసిన సర్కార్ తీరును కథనాల్లో సాక్షి ఎండగట్టింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి నిధులు విడుదల చేసింది.
కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక
కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జిల్లాలో కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఇప్పటి వరకు ఫారంపాండ్ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఇక నుంచి అన్ని పనులూ కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ నెలాఖరులోగా పశువులకు 1,518 నీటి తొట్టెలు నిర్మించనున్నట్లు చెప్పారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కరువు నివారణ చర్యలపై చర్చలు జరిపి నివేదికలు పంపాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
వలస వెళ్లిన వారిని స్వగ్రామాలకు రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వారి సెల్ నంబర్లు సేకరించామని, వాటికి ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రికార్డు స్థాయిలో రూ.500 కోట్ల 16 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి రూ.500 కోట్లు దాటడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది రూ.545 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఉపాధి కూలీలకు రూ.25 కోట్లు
Published Fri, Mar 24 2017 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM