nregs labours
-
ఉపాధి సొమ్ము ఏమాయె !
– జిల్లా వ్యాప్తంగా సస్పెండ్‌లో రూ.15.67 కోట్లు – 95 వేల మంది కూలీలకు పడని డబ్బు – బోగస్ అకౌంట్లతో నిధుల స్వాహాకు యత్నమే కారణం – ‘ఆధార్’ అనుసంధానంతో బెడిసికొడుతున్న వైనం 63 : మండలాలు 1003 : గ్రామ పంచాయతీలు 3352 : ఆవాస ప్రాంతాలు 7,82,606 : జారీ చేసిన జాబ్‌కార్డులు 48,592 : శ్రమ శక్తి సంఘాలు 7,77,995 : ఉపాధి కూలీలు రూ.15.67 కోట్లు : రెండున్నరేళ్ల వ్యవధిలో సస్పెండ్ అయిన కూలీల వేతనం రూ.8.65 కోట్లు : ఈ ఏడాది సస్పెండ్ అయిన మొత్తం అనంతపురం టౌన్: వలసల్ని నివారించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. బినామీ ఖాతాలు తెరిచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.15 కోట్లకు పైగా ఉపాధి కూలి సొమ్ము ‘సస్పెండ్’ అయింది. సుమారు 95 వేల మంది కూలీలకు ఈ డబ్బు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అసలు కథ వేరేలా ఉంది. సగానికి పైగా కూలీల సొమ్మును బోగస్ అకౌంట్లలో వేసుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు స్కెచ్ వేశారు. అయితే ‘ఆధార్’ అనుసంధానంతో ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టమవుతోంది. సస్పెండ్‌లో ఉన్న సొమ్మును క్లెయిం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. బోగస్ ఖాతాల మాయాజాలం : ఉపాధి పనులకు వెళ్లే కూలీలతో గతంలో పుస్తకంలో సంతకాలు చేయించుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. అయితే క్షేత్రస్థాయిలో అక్రమార్కులు తమ చేతివాటం చూపేవారు. దీంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ తెచ్చారు. అందులోనూ సమస్యలొచ్చాయి. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పీఎంజేడీవై (ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన), వ్యక్తిగత పొదుపు ఖాతా ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1003 పంచాయతీలుండగా గత ఏడాది జూన్ వరకు కూడా 559 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్ ఖాతాలుండేవి. తక్కిన పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ బోగస్ ఖాతాలు సృష్టించిన సిబ్బంది.. పనులకు రాని కూలీల పేరుతో సైతం మస్టర్లు సృష్టించి వేతన సొమ్మును ఖాతాల్లోకి వేసుకున్నట్లు తెలుస్తోంది. క్లెయిం చేసుకునేందుకు వెనుకంజ : గత ఏడాది డిసెంబర్ నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు నేరుగా వేతనాలను జమ చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు చెల్లించాల్సిన డబ్బు పక్కదారి పట్టకుండా తీసుకొచ్చిన ఈ విధానంతో అక్రమార్కులకు చెక్ పడగా.. నిజంగా పనులు చేసి తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాని కూలీలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. చాలా మంది కూలీలు తమ అవసరాల నిమిత్తం రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఎంసీసీ (మండల కంప్యూటర్ సెంటర్)ల్లో ఉపాధి కూలీకి సంబంధించి జాబ్‌కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలు ‘లింక్’ చేశారు. తద్వారానే పేమెంట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అయితే కూలీల ఖాతాల్లో నగదు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్‌లో ఆధార్ అనుసంధానం కావాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చాలా మందికి వారాల తరబడి వేతనాలు అందడం లేదు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 94,839 మంది కూలీలకు సంబంధించి రూ.1567.57 లక్షల వేతనం సస్పెండ్‌లో ఉంది. ఇందులో 90 రోజులు పైబడి 52,216 మంది కూలీలకు చెందిన రూ.867.45 లక్షలు సస్పెండ్ అయింది. ఈ సొమ్ములో సగానికి పైగా బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే సొమ్మును క్లెయిం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2015–16 : జిల్లా వ్యాప్తంగా 895 పంచాయతీల్లో పనులు చేసిన 12,587 మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.178.49 లక్షలు సస్పెండ్‌లో ఉంది. ఉపాధి హామీ కింద 734 పంచాయతీల్లో పనులు చేసిన 5140 మంది కూలీల వేతన సొమ్ము రూ.78.24 లక్షలు సస్పెండ్ అయింది. వాటర్‌షెడ్ పనులకు సంబంధించి 319 పంచాయతీల్లో 5321 మంది కూలీలకు చెందిన రూ.66.22 లక్షలు సస్పెండ్ కాగా ఒక్క కనగానపల్లి మండలంలోనే రూ.15 లక్షలకు పైగా ఉంది. అదే ఏడాది ఉపాధి నిధులతో అటవీ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించి సుమారు రూ.35 లక్షల వరకు సస్పెండ్ అయింది. ఇదంతా కూలీలకు చెల్లించాల్సిన సొమ్మే. అయితే ఎవరూ కూడా క్లెయిం చేసుకోవడానికి రాలేదు. 2016–17 : జిల్లాలోని 946 పంచాయతీల్లో 17,971 మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.301.59 కోట్లు సస్పెండ్ అయ్యాయి. ఉపాధి పనులకు సంబంధించి రూ.83 లక్షలుండగా.. వాటర్‌షెడ్ కింద చేపట్టిన పనులకు గానూ రూ.1.70 కోట్లు సస్పెండ్ అయ్యాయి. 331 పంచాయతీల్లో చేసిన పనుల్లో చాలా వరకు బినామీలు ఖాతాలతో స్వాహా చేసేందుకు ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది. రొళ్ల మండలంలోని బొమ్మగొండనహట్టి, దొడ్డెరి, గుడ్డుగుర్కి, కాకి, ఎం.రాయాపురం, రత్నగిరి, రొళ్ల పంచాయతీల్లో 2117 మంది కూలీలకు రూ.48 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అవన్నీ బోగస్‌వేనని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. కనగానపల్లి మండలంలో ఏడు పంచాయతీల్లోని 734 మంది కూలీలకు రూ.13 లక్షలు, అగళి మండలంలో 487 మందికి రూ.12 లక్షలు అందాల్సి ఉన్నా అంతా సస్పెండ్‌లో పడ్డాయి. వీటిని క్లెయిం చేసుకునేందుకు సైతం ఎవరూ ముందుకు రాలేదు. అటవీశాఖ, పంచాయతీరాజ్ చేపట్టిన పనుల్లోనూ బినామీ బాగోతం నడిచింది. ఏకంగా రూ.53 లక్షల వరకు సస్పెండ్ అవడం గమనార్హం. ఈ ఏడాది అదే పరిస్థితి : ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోనే నగదు పడేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 993 పంచాయతీల్లో పనులు చేసిన 49,056 మంది కూలీలకు చెందిన రూ.865.9 లక్షలు సస్పెండ్లోకి వెళ్లింది. ఇందులో 30 రోజుల్లోగా 32,204 మంది కూలీలకు సంబంధించి రూ.4.70 కోట్లు, 30 నుంచి 60 రోజుల్లోగా 8096 మంది కూలీలకు చెందిన రూ.157.31 లక్షలు, 60 నుంచి 90 రోజుల్లోపు 4647 మంది కూలీలకు గానూ 121.65 లక్షలు సస్పెండ్ అయింది. 90 రోజులకు పైబడి 4109 మంది కూలీలకు గానూ రూ.116.95 లక్షలు సస్పెండ్ అయ్యాయి. ఇందులో ఉపాధి హామీ కింద చేసిన పనులకు సంబంధించి ఏకంగా రూ.6 కోట్లకు పైగా సస్పెండ్ అయింది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకుల్లో ‘ఆధార్’ అనుసంధానంలో జాప్యం వల్ల పడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆధార్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు అందాయి. ఆల్ మోస్ట్ క్లియర్ చేశాం : నాగభూషణం, డ్వామా పీడీ సస్పెండ్ అయిన సొమ్మంతా ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక ఖాతాలో ఉంటుంది. ఎవరైనా క్లెయిం చేసుకుంటే వాళ్ల ఖాతాల్లో పడుతుంది. చాలా మంది ముందుకు రావడం లేదు. బోగస్ ఖాతాల కారణంగానే ఎక్కువ మొత్తం సస్పెండ్లోకొచ్చింది. ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ క్లియర్ చేశాం. పనులు చేసినా వేతనం అందని వారుంటే తప్పకుండా సాంకేతిక సమస్యలు తీర్చి న్యాయం జరిగేలా చూస్తాం. -
కూలి కష్టం దక్కలే!
- బ్యాంక్ ఖాతాకు అనుసంధానం కాని ఆధార్ – రూ.7.5 కోట్లకు చేరిన వేతన బకాయిలు – జిల్లాలో ఉపాధి హామీ కూలీల అవస్థలు – సమస్య పరిష్కారానికి చొరవ చూపని యంత్రాంగం 7,79,365 : జిల్లాలో జారీ చేసిన జాబ్‌కార్డులు 48,428 శ్రమశక్తి సంఘాలు 3,99,528 ఈ ఏడాది ఇప్పటి వరకు ఉపాధి పనులు చేసిన వారు 1,24,938 ఆధార్ అనుసంధానం కాని కూలీల సంఖ్య రూ.7,42,13,188 ఆధార్ అనుసంధానం కాక తిరస్కరణకు గురైన కూలీల వేతన మొత్తం ఉపాధి కూలీలు పనులు చేశారు.. డ్వామా అధికారులు వేతనాల బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి.. కానీ బ్యాంకులో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతవడంతో నెలల తరబడి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. మండుటెండలో గట్టినేలలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం దక్కకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అనంతపురం టౌన్ : జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసే శ్రమశక్తి సంఘాలు 48,428 ఉన్నాయి. ప్రభుత్వం 7,79,365 జాబ్‌కార్డులు జారీ చేయగా 7,74,657 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,99,528 మందికి ఉపాధి పనులు కల్పించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 6,51,981 మంది కూలీలు పనులకు వెళ్తున్న జాబితాలో ఉన్నారు. గతంలో ఉపాధి కూలీలకు తపాలా శాఖ ద్వారా వేతనాలు చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి నుంచి నేరుగా కూలీల బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో చాలా మంది కూలీలకు ఖాతాలు లేవు. ఇన్‌యాక్టివ్‌లో లక్ష ఖాతాలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,92,325 మంది ఖాతాలు మాత్రమే యాక్టివ్‌లో ఉండగా 1,24,938 మంది ఖాతాలు ఇన్‌యాక్టివ్ జాబితాలో ఉన్నాయి. తాజా నిబంధనల మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సర్వర్‌కు కూలీల బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. అయితే పెద్ద సంఖ్యలో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని నేపథ్యంలో వేలాది మందికి పనులు చేసినా నగదు జమ కావడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకర్లకు చేరినా కూలీలు అందుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఎన్‌పీఐసీ సర్వర్‌కు అనుసంధానం ప్రక్రియ పూర్తయితేనే కూలీలకు సొమ్ము జమ అవుతుందని తెలిసినా, జిల్లా యంత్రాంగం మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు. వివరాలు అందజేసినా... ఉపాధి కూలీలు మండల కంప్యూటర్ సెంటర్ల (ఎంసీసీ)లో తమ వివరాలు అందజేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో ఎన్పీసీఐ సర్వర్‌కు అనుసంధానం కాని కూలీలు పనులకు వెళ్లినా, వారికి సంబంధించి నగదు తిరస్కరణ జాబితాలో చేరుతోంది. ఆదివారం (జూలై 2) నాటికి జిల్లా వ్యాప్తంగా 84,736 లావాదేవీలకు సంబంధించి రూ.7,42,13,188 తిరస్కరణకు గురైంది. ఆధార్ అనుసంధానం విషయంలో ధర్మవరం, ఎన్పీ కుంట, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు మండలాలు మాత్రమే 85 శాతానికి పైగా పురోగతి సాధించాయి. అగళి, అమరాపురం, బొమ్మనహాళ్, సీకే పల్లి, హిందూపురం, కంబదూరు, కుందుర్పి, మడకశిర, రొద్దం, రొళ్ల, శెట్టూరు తదితర మండలాల్లో ఇంకా 30 శాతానికి పైగా కూలీల ఖాతాలు అనుసంధానం కావాల్సి ఉంది. బ్యాంకర్లతో సమస్య వస్తోంది కూలీలకు ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలయ్యాయి. కానీ బ్యాంకర్లతో సమస్య వస్తోంది. కొందరు కూలీలు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా నగదు జమ కాకపోవడానికి కారణం. అలాంటి వారంతా కొత్త అకౌంట్ వివరాలను ఎంసీసీల్లో అందజేయండి. ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాల రీ షెడ్యూల్ జరుగుతుండడంతో వారు కూలీల గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో 610 మంది బ్యాంక్ కరస్పాండెంట్లున్నారు. వారంతా ప్రత్యేక డ్రైవ్ చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉపాధి కూలీల ఖాతాల సమస్య తీర్చేందుకు త్వరలోనే వారికి శిక్షణ ఇస్తాం. వేతన బకాయిలు ఓ వైపు క్లియర్ అవుతుంటే మరోవైపు జమ అవుతున్నాయి. -నాగభూషణం, డ్వామా పీడీ రూ. 20 వేలకుపైగా రావాలి నేను ఉపాధి పనులపైనే ఆధారపడి జీవిస్తున్నా. 25 వారాల కూలి డబ్బు రూ.20 వేలకు పైగా రావాలి. అధికారులను అడిగితే ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్ వాళ్లను అడిగితే అన్నీ సక్రమంగానే ఉందంటున్నారు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. మా ఊళ్లో నాతో పాటు ఇంకా చాలా మందికి 20 వారాలకు పైగా డబ్బులు రావడం లేదు. పనులు చేసి డబ్బులకోసం తిరగాల్సి వస్తోంది. - గోపాల్‌నాయక్, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం బ్యాంకోళ్లు విసుక్కుంటున్నారు నేను, నా భర్త ఇద్దరం ఉపాధి పనులు చేస్తాం. మా ఆయన డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. నాకు మాత్రం 18 వారాలుగా కూలి డబ్బులు రావడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టంచుకోవడం లేదు. ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్‌కు వెళితే ఎన్నిసార్లు తిరుగుతావమ్మా అంటూ విసుక్కుంటున్నారు. సమస్య ఎక్కడుందో తెలీక బేజారొస్తోంది. అసలు మా డబ్బులు వస్తాయో లేదో కూడా తెలియదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు డబ్బులు రాకపోతే వారిని ఎలా పోషించుకోవాలి. -చిట్టెమ్మ, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం -
ఉపాధి కూలీలకు రూ.25 కోట్లు
– రుణం కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు లేఖ – కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక – నీటితొట్టెల నిర్మాణానికి చర్యలు అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న అనంతలో ఉపాధి కూలీల వేతనాల సమస్య తీరింది. నెలల తరబడి కూలి అందకపోవడంతో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.25 కోట్లు వేతన బకాయిలు జిల్లాలో ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం వెల్లడించారు. ఆయా బ్యాంకుల్లో ఎవరైనా కూలీలు రుణం తీసుకుని ఉన్నా.. ఇతరత్రా బకాయిలు ఉన్నా ప్రస్తుతం జమ చేసిన మొత్తంలో పట్టుకోకూడదంటూ బ్యాంకర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాశారు. కాగా, జిల్లాలో రోజూ 1.50 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరికి రెండు నెలల కూలి అందకపోవడంపై ‘కూలి కష్టం’ శీర్షికతో ఈనెల 14న జిల్లా ప్రధాన పేజీలో, ‘ఉపాధి యాతన’ శీర్షికతో ఈ నెల 19న మెయిన్‌లో వరుస కథనాలను సాక్షి ప్రచురించింది. వేతనాల చెల్లింపులను నిలిపివేసిన సర్కార్ తీరును కథనాల్లో సాక్షి ఎండగట్టింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి నిధులు విడుదల చేసింది. కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జిల్లాలో కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఇప్పటి వరకు ఫారంపాండ్ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఇక నుంచి అన్ని పనులూ కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ నెలాఖరులోగా పశువులకు 1,518 నీటి తొట్టెలు నిర్మించనున్నట్లు చెప్పారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కరువు నివారణ చర్యలపై చర్చలు జరిపి నివేదికలు పంపాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. వలస వెళ్లిన వారిని స్వగ్రామాలకు రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వారి సెల్ నంబర్లు సేకరించామని, వాటికి ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రికార్డు స్థాయిలో రూ.500 కోట్ల 16 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి రూ.500 కోట్లు దాటడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది రూ.545 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. -
‘ఖాతా’ కష్టాలు
– ఉపాధి కూలీలకు డిసెంబర్ నుంచి నగదు బదిలీ – 40 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేని వైనం జిల్లాలో ఉపాధి కూలీలు : 7,02,833 బ్యాంక్ ఖాతాలన్న వారు : 4,17,616 అకౌంట్లు లేని వారు : 2,85,217 గ్రామ పంచాయతీలు : 1003 బ్యాంక్ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 559 పోస్టాఫీస్ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 444 అనంతపురం టౌన్ : పెద్ద నోట్ల ప్రభావం ఉపాధి కూలీలపైనా పడుతోంది. ఇప్పటికే పోస్టాఫీసులకు చేరిన రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అందరికీ బ్యాంక్ ఖాతాలు తప్పనిసరి చేయడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 40 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు లేకపోవడంతో యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. కేంద్రం ఏడాది నుంచీ ఖాతాలు తప్పనిసరని చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉపాధి కూలీలకు నగదు బదిలీ చేయాలని భావించారు. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయన్న కారణంతో ఆగస్టుకు గడువు పొడిగించారు. అదీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో వచ్చే జనవరి నాటికి పూర్తి స్థాయిలో కూలీలందరికీ జన్‌ధన్ ఖాతాలు తెరిపించాలని ఇటీవల కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు తీయించాల్సిన పరిస్థితి వచ్చింది. బయోమెట్రిక్ ఉన్నా.. గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ను అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు సరిపోకపోవడం, మరికొందరి ఆధార్ సంఖ్య సరిపోకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చి వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంక్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. కాగా జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద 7,02,833 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,17,616 మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఇంకా 2,85,217 మందికి ఖాతాలు తెరిపించాల్సి ఉంది. ఖాతాలున్న వారిలో కూడా 43,039 మందివి వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. పంపిణీకి నోచుకోని రూ.2 కోట్లు జిల్లాలోని 63 మండలాల పరిధిలో 1,003 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 559 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన 444 పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి తపాలా అధికారులు కూలి పంపిణీకి పుల్‌స్టాప్ పెట్టారు. ఈ క్రమంలో రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలందరికీ 'రూపే' కార్డులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించి 'రూపే' కార్డులు అందిస్తాం. జన్‌ధన్ ఖాతాల కోసం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోస్టాఫీసుల్లో పంపిణీకి నోచుకోని నగదుపై అధికారులతో మాట్లాడుతా. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేస్తాం. – నాగభూషణం, డ్వామా పీడీ