ఉపాధి సొమ్ము ఏమాయె ! | nregs labours watiting for bills | Sakshi
Sakshi News home page

ఉపాధి సొమ్ము ఏమాయె !

Published Sat, Aug 19 2017 9:43 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఉపాధి సొమ్ము ఏమాయె ! - Sakshi

ఉపాధి సొమ్ము ఏమాయె !

– జిల్లా వ్యాప్తంగా సస్పెండ్‌లో రూ.15.67 కోట్లు
– 95 వేల మంది కూలీలకు పడని డబ్బు
– బోగస్‌ అకౌంట్లతో నిధుల స్వాహాకు యత్నమే కారణం
– ‘ఆధార్‌’ అనుసంధానంతో బెడిసికొడుతున్న వైనం


63 : మండలాలు
1003 : గ్రామ పంచాయతీలు
3352 : ఆవాస ప్రాంతాలు
7,82,606 : జారీ చేసిన జాబ్‌కార్డులు
48,592 : శ్రమ శక్తి సంఘాలు
7,77,995 : ఉపాధి కూలీలు
రూ.15.67 కోట్లు : రెండున్నరేళ్ల వ్యవధిలో సస్పెండ్‌ అయిన కూలీల వేతనం
రూ.8.65 కోట్లు : ఈ ఏడాది సస్పెండ్‌ అయిన మొత్తం  


అనంతపురం టౌన్‌: వలసల్ని నివారించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. బినామీ ఖాతాలు తెరిచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.15 కోట్లకు పైగా ఉపాధి కూలి సొమ్ము ‘సస్పెండ్‌’ అయింది. సుమారు 95 వేల మంది కూలీలకు ఈ డబ్బు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అసలు కథ వేరేలా ఉంది. సగానికి పైగా కూలీల సొమ్మును బోగస్‌ అకౌంట్లలో వేసుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు స్కెచ్‌ వేశారు. అయితే ‘ఆధార్‌’ అనుసంధానంతో ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టమవుతోంది. సస్పెండ్‌లో ఉన్న సొమ్మును క్లెయిం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది.  

బోగస్‌ ఖాతాల మాయాజాలం : ఉపాధి పనులకు వెళ్లే కూలీలతో గతంలో పుస్తకంలో సంతకాలు చేయించుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. అయితే క్షేత్రస్థాయిలో అక్రమార్కులు తమ చేతివాటం చూపేవారు. దీంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ తెచ్చారు. అందులోనూ సమస్యలొచ్చాయి. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పీఎంజేడీవై (ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన), వ్యక్తిగత పొదుపు ఖాతా ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1003 పంచాయతీలుండగా గత ఏడాది జూన్‌ వరకు కూడా 559 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్‌ ఖాతాలుండేవి. తక్కిన పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ బోగస్‌ ఖాతాలు సృష్టించిన సిబ్బంది.. పనులకు రాని కూలీల పేరుతో సైతం మస్టర్లు సృష్టించి వేతన సొమ్మును ఖాతాల్లోకి వేసుకున్నట్లు తెలుస్తోంది.  
 
క్లెయిం చేసుకునేందుకు వెనుకంజ : గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఆధార్‌ అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా వేతనాలను జమ చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు చెల్లించాల్సిన డబ్బు పక్కదారి పట్టకుండా తీసుకొచ్చిన ఈ విధానంతో అక్రమార్కులకు చెక్‌ పడగా.. నిజంగా పనులు చేసి తమ బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కాని కూలీలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. చాలా మంది కూలీలు తమ అవసరాల నిమిత్తం రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఎంసీసీ (మండల కంప్యూటర్‌ సెంటర్‌)ల్లో ఉపాధి కూలీకి సంబంధించి జాబ్‌కార్డు, ఆధార్, బ్యాంక్‌ ఖాతాలు ‘లింక్‌’ చేశారు.  తద్వారానే పేమెంట్స్‌ జనరేట్‌ చేసే అవకాశం ఉంది. అయితే కూలీల ఖాతాల్లో నగదు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్‌లో ఆధార్‌ అనుసంధానం కావాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చాలా మందికి వారాల తరబడి వేతనాలు అందడం లేదు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 94,839 మంది కూలీలకు సంబంధించి రూ.1567.57 లక్షల వేతనం సస్పెండ్‌లో ఉంది. ఇందులో 90 రోజులు పైబడి 52,216 మంది కూలీలకు చెందిన రూ.867.45 లక్షలు సస్పెండ్‌ అయింది. ఈ సొమ్ములో సగానికి పైగా బోగస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే సొమ్మును క్లెయిం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.  

2015–16 : జిల్లా వ్యాప్తంగా 895 పంచాయతీల్లో పనులు చేసిన 12,587 మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.178.49 లక్షలు సస్పెండ్‌లో ఉంది. ఉపాధి హామీ కింద 734 పంచాయతీల్లో పనులు చేసిన 5140 మంది కూలీల వేతన సొమ్ము రూ.78.24 లక్షలు సస్పెండ్‌ అయింది. వాటర్‌షెడ్‌ పనులకు సంబంధించి 319 పంచాయతీల్లో 5321 మంది కూలీలకు చెందిన రూ.66.22 లక్షలు సస్పెండ్‌ కాగా ఒక్క కనగానపల్లి మండలంలోనే రూ.15 లక్షలకు పైగా ఉంది. అదే ఏడాది ఉపాధి నిధులతో అటవీ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించి సుమారు రూ.35 లక్షల వరకు సస్పెండ్‌ అయింది. ఇదంతా కూలీలకు చెల్లించాల్సిన సొమ్మే. అయితే ఎవరూ కూడా క్లెయిం చేసుకోవడానికి రాలేదు.  
 
2016–17  :  జిల్లాలోని 946 పంచాయతీల్లో 17,971 మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.301.59 కోట్లు సస్పెండ్‌ అయ్యాయి. ఉపాధి పనులకు సంబంధించి రూ.83 లక్షలుండగా.. వాటర్‌షెడ్‌ కింద చేపట్టిన పనులకు గానూ రూ.1.70 కోట్లు సస్పెండ్‌ అయ్యాయి. 331 పంచాయతీల్లో చేసిన పనుల్లో చాలా వరకు బినామీలు ఖాతాలతో స్వాహా చేసేందుకు ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది. రొళ్ల మండలంలోని బొమ్మగొండనహట్టి, దొడ్డెరి, గుడ్డుగుర్కి, కాకి, ఎం.రాయాపురం, రత్నగిరి, రొళ్ల పంచాయతీల్లో 2117 మంది కూలీలకు రూ.48 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అవన్నీ బోగస్‌వేనని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. కనగానపల్లి మండలంలో ఏడు పంచాయతీల్లోని 734 మంది కూలీలకు రూ.13 లక్షలు, అగళి మండలంలో 487 మందికి రూ.12 లక్షలు అందాల్సి ఉన్నా అంతా సస్పెండ్‌లో పడ్డాయి. వీటిని క్లెయిం చేసుకునేందుకు సైతం ఎవరూ ముందుకు రాలేదు. అటవీశాఖ, పంచాయతీరాజ్‌ చేపట్టిన పనుల్లోనూ బినామీ బాగోతం నడిచింది. ఏకంగా రూ.53 లక్షల వరకు సస్పెండ్‌ అవడం గమనార్హం.

ఈ ఏడాది అదే పరిస్థితి : ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆధార్‌ అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాల్లోనే నగదు పడేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 993 పంచాయతీల్లో పనులు చేసిన 49,056 మంది కూలీలకు చెందిన రూ.865.9 లక్షలు సస్పెండ్‌లోకి వెళ్లింది. ఇందులో 30 రోజుల్లోగా 32,204 మంది కూలీలకు సంబంధించి రూ.4.70 కోట్లు, 30 నుంచి 60 రోజుల్లోగా 8096 మంది కూలీలకు చెందిన రూ.157.31 లక్షలు, 60 నుంచి 90 రోజుల్లోపు 4647 మంది కూలీలకు గానూ 121.65 లక్షలు సస్పెండ్‌ అయింది. 90 రోజులకు పైబడి 4109 మంది కూలీలకు గానూ రూ.116.95 లక్షలు సస్పెండ్‌ అయ్యాయి. ఇందులో ఉపాధి హామీ కింద చేసిన పనులకు సంబంధించి ఏకంగా రూ.6 కోట్లకు పైగా సస్పెండ్‌ అయింది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకుల్లో ‘ఆధార్‌’ అనుసంధానంలో జాప్యం వల్ల పడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నుంచి ఆధార్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు అందాయి.  
 
ఆల్‌ మోస్ట్‌ క్లియర్‌ చేశాం : నాగభూషణం, డ్వామా పీడీ
సస్పెండ్‌ అయిన సొమ్మంతా ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక ఖాతాలో ఉంటుంది. ఎవరైనా క్లెయిం చేసుకుంటే వాళ్ల ఖాతాల్లో పడుతుంది. చాలా మంది ముందుకు రావడం లేదు. బోగస్‌ ఖాతాల కారణంగానే ఎక్కువ మొత్తం సస్పెండ్‌లోకొచ్చింది. ఇప్పటి వరకు ఆల్‌ మోస్ట్‌ క్లియర్‌ చేశాం. పనులు చేసినా వేతనం అందని వారుంటే తప్పకుండా సాంకేతిక సమస్యలు తీర్చి న్యాయం జరిగేలా చూస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement