‘ఖాతా’ కష్టాలు | december to cash transfer of nregs labours | Sakshi
Sakshi News home page

‘ఖాతా’ కష్టాలు

Published Sat, Nov 26 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

‘ఖాతా’ కష్టాలు

‘ఖాతా’ కష్టాలు

– ఉపాధి కూలీలకు డిసెంబర్‌ నుంచి నగదు బదిలీ
–  40 శాతం మందికి బ్యాంక్‌ ఖాతాలు లేని వైనం


జిల్లాలో ఉపాధి కూలీలు : 7,02,833
బ్యాంక్‌ ఖాతాలన్న వారు : 4,17,616
అకౌంట్లు లేని వారు : 2,85,217
గ్రామ పంచాయతీలు : 1003
బ్యాంక్‌ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 559
పోస్టాఫీస్‌ ద్వారా నగదు అందిస్తున్న పంచాయతీలు : 444

 
అనంతపురం టౌన్‌ : పెద్ద నోట్ల ప్రభావం ఉపాధి కూలీలపైనా పడుతోంది. ఇప్పటికే పోస్టాఫీసులకు చేరిన రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అందరికీ బ్యాంక్‌ ఖాతాలు తప్పనిసరి చేయడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 40 శాతం మందికి బ్యాంక్‌ అకౌంట్లు లేకపోవడంతో యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. కేంద్రం ఏడాది నుంచీ ఖాతాలు తప్పనిసరని చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఉపాధి కూలీలకు నగదు బదిలీ చేయాలని భావించారు. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయన్న కారణంతో ఆగస్టుకు గడువు పొడిగించారు. అదీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో వచ్చే జనవరి నాటికి పూర్తి స్థాయిలో కూలీలందరికీ జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించాలని ఇటీవల కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంక్‌ ఖాతాలు తీయించాల్సిన పరిస్థితి వచ్చింది.   

బయోమెట్రిక్‌ ఉన్నా..
గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ను అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు సరిపోకపోవడం, మరికొందరి ఆధార్‌ సంఖ్య సరిపోకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చి వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్‌ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంక్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. కాగా  జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద 7,02,833 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,17,616 మందికి మాత్రమే బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. ఇంకా 2,85,217 మందికి ఖాతాలు తెరిపించాల్సి ఉంది. ఖాతాలున్న వారిలో కూడా 43,039 మందివి వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది.  

పంపిణీకి నోచుకోని రూ.2 కోట్లు
జిల్లాలోని 63 మండలాల పరిధిలో 1,003 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 559 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన 444 పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి తపాలా అధికారులు కూలి పంపిణీకి పుల్‌స్టాప్‌ పెట్టారు. ఈ క్రమంలో రూ.2 కోట్లు పంపిణీకి నోచుకోక కూలీలు ఇబ్బంది పడుతున్నారు.   

కూలీలందరికీ 'రూపే' కార్డులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలందరికీ బ్యాంక్‌ ఖాతాలు తెరిపించి 'రూపే' కార్డులు అందిస్తాం. జన్‌ధన్‌ ఖాతాల కోసం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.  పోస్టాఫీసుల్లో పంపిణీకి నోచుకోని నగదుపై అధికారులతో మాట్లాడుతా. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేస్తాం. – నాగభూషణం, డ్వామా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement