Huzurabad By Election Is The Costliest Election In History - Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ!

Published Wed, Oct 27 2021 8:24 AM | Last Updated on Wed, Oct 27 2021 10:23 AM

Huzurabad By Election Is The Costliest Election In History - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు పాడుబడిన జీపు అటూ ఇటూ ఊగుతూ పల్లెల్లోకి వచ్చేది. అభిమానులు దయతలచి రిపేరు చేయిస్తేనే రయ్‌మంటూ తిరిగేది. టాప్‌పైన తనకు ఓటేయాలంటూ నాయకుడు కనిపించేవాడు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చంటే కేవలం భోజనాల కోసమే వెచ్చించేవారు. తలా కొంత పోగేసుకుని భాగస్వాములయ్యేవారు. ఇక ఎన్నికల డిపాజిట్‌ రూ.250 నుంచి రూ.500 ఉండేది. మొత్తం వ్యయం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు అయ్యేది. ఇది నాలుగు దశాబ్దాల కిందటి మాట. 
చదవండి: హుజురాబాద్‌ ఉప పోరు: పెరిగిన పోలింగ్‌ సమయం.. ఎప్పటివరకంటే!

కానీ నేడు వాహనాల రణగొణ ధ్వని చెవుల్లో మార్మోగుతోంది. ఒక వాహనం వెంట పదుల సంఖ్యలో వాహనాలు అనుసరిస్తున్నాయి. డీజే శబ్దంతో ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఖర్చంటే మందు, విందు, నగదు, చీరలు, వాహనాలు, పెట్రోల్, డీజిల్‌ తదితరాలన్నీ కలసి అభ్యర్థి ఖాతా ఖాళీ అవుతోంది. సరాసరి అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంటోంది. 1980 నుంచి పెరుగుతూ వస్తున్న ఎన్నికల వ్యయం తాలుకు చరిత్ర ఇది.
చదవండి: ‘టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామంటున్నారు’ 

నేటి రాజకీయవిుదీ..
ప్రత్యర్థిని ఆలోచనలో పడేయడమెలా?.. ఎన్నికల సభలకు భారీ జనాన్ని తరలించి ఇతరులను హడలెత్తించడమెలా? ఇదీ మారిన ఎన్నికల ప్రచార సరళి తీరును స్పష్టం చేస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో జరిగిన పలు సమావేశాలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

సభలకు భారీ వ్యయం
ఓ సభ నిర్వహించాలంటే వేదిక ఏర్పాటుకే కనీసం రూ.10 లక్షల మంచి రూ.20 లక్షల వ్యయమవుతోంది. వేదిక తీర్చిదిద్దడం నుంచి కుర్చీలు, షామియానాలు, లైట్లు, మైకులు, ఇతరత్రా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ప్రాంగణంలో వేలల్లో కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తుండటం అభ్యర్థులకు భారమవుతోంది. ఇక పార్టీలు కూడా ఖర్చు చేసే శక్తి ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తుండటం పరిపాటి. పార్టీ ఎంత ఇస్తుంది.? తానెంతæ భరించేది లెక్కలు కట్టి మరీ అధిష్టానం వద్ద చెప్పుకోవడం ఏటా ఎన్నికల్లో జరుగుతున్న తంతు.

మందు, విందు
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా ఉండగా యువత మాత్రం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్నారు. యువకులకు భలే సమయమొచ్చింది. ఖాళీగా ఉంటున్నవారిని పార్టీలు పట్టేశాయి. యువకులు జై కొట్టాలంటే వారికి రూ.500 నుంచి రూ.800 ఇస్తున్నారు. బీరు, బిర్యానీ అదనంగా వ్యయమవుతోంది. ద్విచక్ర వాహనాలు సమకూర్చుకోవడం, బ్యానర్లు, జెండాలు మోయడం, భారీ ర్యాలీలకు అండగా నిలవడం యువకులకు పనిగా మారింది. 

డబ్బు పంపకం.. వాహనాలే వాహనాలు
సభకు, ర్యాలీలు, ప్రచారానికి వచ్చే మహిళలకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. వచ్చిన వారి హాజరు కూడా తీసుకుంటుండటంతో ఎన్నికల కోసం ఎలా çవ్యయం చేస్తున్నదీ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. యువకులు హాజరైతే మందు, విందు రోజువారీ వెళ్లేటపుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగానికి అధికంగా ఖర్చు చేస్తున్నారు. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు ప్రచారంలో భాగమవుతున్నాయి. ఇలా ఒక్కో గ్రామంలో రూ.20 నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారు. 

ప్రలోభాలు శిక్షార్హమే
ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టరాదు. తమకే ఓటు వేయాలంటూ ప్రలోభపెట్టినా, ప్రలోభాలకు లొంగినా భారత శిక్షాస్మృతిలోని 171(3) సెక్షన్‌ ప్రకారం ఏడాది పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంది. అయితే ప్రలోభాల పరంపర ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూనే ఉంది.

నిరాడంబరుడు చొక్కారావు 
నిరాడంబరుడు అంటే గుర్తుకొచ్చే తొలితరం రాజకీయ నాయకుల్లో జువ్వాడి చొక్కారావు ఒకరు. ఆయన 1957 నుంచి 1996 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తొలి ఎన్నికల్లో ఆయన ఖర్చు రూ.10వేలలోపేనని పలు సందర్భాల్లో చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు బస్సులో వెళ్లేవారు. మాజీగా మిగిలాక కూడా బస్సులోనే ప్రయాణించారు. చివరగా బస్సులో ప్రయాణిస్తూనే గుండెపోటుకు గురయ్యారు.

కాకా ఖర్చు అంతంతే 
‘నేను 1957 ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు నా ఎన్నికల ఖర్చు కేవలం రూ.2వేలు మాత్రమే. చెన్నూరు నుంచి పోటీ చేసినపుడు కేవలం ప్రచారంతోనే గెలిచాను. ఓటర్లు ఇప్పటికీ మారలేదు. రాజకీయ నాయకులు, రాజకీయాల్లో మాత్రమే మార్చు వచ్చింది. ఎన్నికల వ్యయం తడిసిమోపెడవుతుంది’ అని 2014 ఎన్నికల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న మాటలివి. నాడు వేలల్లో ఉన్న ఖర్చు నేడు రూ.కోట్లు దాటిందంటూ ఆవేదన చెందారు.

నడకతోనే ప్రచారం,  పర్యటనలు 
కరీంనగర్‌ తొలి పార్లమెంటు సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి. నీతి, నిజాయతీ, నిరాడంబరతకు నిలువుటద్దంలా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రనేత అయిన ఎల్లారెడ్డి 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల బరిలో కరీంనగర్‌ నుంచి నిలిచారు. ఆయన ఎన్నికల కోసం కాలినడకనే ప్రచారం నిర్వహించేవారు. ఎవరైనా వాహనం తెస్తే అందులో ప్రచారం చేసేవారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఆయన ఎన్నికల వ్యయం రూ.10వేల లోపే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement