హుజూరాబాద్‌ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్‌ | Bandi Sanjay Played Key Role in Huzurabad Byelection Victory | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: హుజూరాబాద్‌ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్‌

Published Thu, Nov 4 2021 7:25 AM | Last Updated on Thu, Nov 4 2021 7:25 AM

Bandi Sanjay Played Key Role in Huzurabad Byelection Victory - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఒక నిశ్శబ్ద తీర్పు. నియోజకవర్గఓటర్లు మనసులో మాటను ఎక్కడా బయట పెట్టకుండా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. మూడు ప్రధానపార్టీలు పోటీ పడ్డా.. స్థానిక, పాతనేతకే పట్టంకట్టారు. నాలుగున్నర నెలలుగా నువ్వా– నేనా అన్నట్లుగా సాగిన ప్రచారంలో ఎవరూ ఎక్కడా తగ్గలేదు. వ్యక్తిగతంగా, రాజకీయంగా పరస్పర ఆరోపణలతో హుజూరాబాద్‌ రాజకీ యం ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి.

దళితబంధు పథకంతోపాటు, పెండింగ్‌ పనులన్నీ చకచకా పూర్తిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీని విధానపరంగా దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నింది. తమకు అభివృద్ధి నినాదమని, చేసిన పనులకే ఓట్లు అడుగుతున్నామని ప్రజలకు వివరించింది. అదే సమయంలో కేవలం ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకెళ్లిన రాజేందర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, అది ఎక్కడా బయటపడకపోవడం గమనార్హం. పోలింగ్‌ రోజు వరకు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మాత్రం అలాగే కొనసాగిన ఈ రాజకీయ చదరంగం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది. 

చదవండి:  (నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల)

కలిసి వచ్చిన పోలింగ్‌ సమయం..
అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ వరకు ఓటరు ఎక్కడా బయటపడలేదు. పోలింగ్‌ సమయం ఈసారి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటల వరకే ఉండేది. దీంతో దూర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు తరలివచ్చారు. నియోజకవర్గంలో ఈసారి 2.36 లక్షల ఓట్లు ఉంటే.. అందులో మొత్తం 2,05,236 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ 1,06,780 ఓట్లు ఒక్క రాజేందర్‌ ఖాతాలోనే వేసుకోవడం గమనార్హం. దీనికితోడు మంత్రి పదవి నుంచి ఆయన్ను బర్తరఫ్‌ చేసిన తీరుపై ప్రజల్లో సానుభూతి వచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, తనను తిరిగి గెలిపించాలంటూ రాజేందర్‌ చేసిన విజ్ఞప్తిని మెజారిటీ ప్రజలు మన్నించారు. దీనికితోడు ప్రచార ముగింపులో ఆయన తనను ‘సాదుకుంటారో.. ? సంపుకుంటారో..?’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను తనవైపు తిప్పుకునేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: (గిట్లెట్లాయే: జితేందర్‌ వర్సెస్‌ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే)

ఆఖరువారంలో చక్రం తిప్పిన ‘బండి’ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాన ఆయుధం దూకుడు. ఉత్సాహపరిచే ప్రసంగాలతో ఓటర్లలోకి చొచ్చుకెళ్లడమే ఆయనకున్న ప్రత్యేకత. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియాలోనూ ఆయన ఇదే తరహాలో పార్టీకి విజయాలను అందించారు. ప్రజాసంగ్రామ యాత్ర కారణంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఆరంభంలో ఆయన ఎక్కు వ కాలం రాజేందర్‌కు ప్రచారం చేయలేకపోయారు. కానీ, ఆయన ప్రజా సంగ్రామయాత్ర ముగింపు తరువాత మాత్రం పూర్తి సమయాన్ని రాజేందర్‌ కోసం కేటాయించారు. ఇక్కడే బండి తన చతురత ప్రదర్శించారు.

ఒకవైపు రాజేందర్‌ను ప్రచారం చేయిస్తూనే.. మరోవైపు తానూ ఒంటరిగా పలు గ్రామాలను చుట్టేశారు. కేంద్ర పథకాలు అందుతున్న తీరును వివరించారు. ఈసారి తన సహజత్వానికి విరుద్ధంగా పిట్టకథలు, ఛలోక్తులు, పంచ్‌డైలాగులతో సభలో నవ్వులు కురిపిస్తూ ముందుకుసాగారు. ఐదు మండలాల్లో వీలైనన్ని గ్రామాలను బండి సంజయ్‌ తన రోడ్‌షోల ద్వారా చుట్టేయగలిగారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న ఆదరణతో పూర్తిస్థాయిలో వారిని తనవైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement