- బ్యాంక్ ఖాతాకు అనుసంధానం కాని ఆధార్
– రూ.7.5 కోట్లకు చేరిన వేతన బకాయిలు
– జిల్లాలో ఉపాధి హామీ కూలీల అవస్థలు
– సమస్య పరిష్కారానికి చొరవ చూపని యంత్రాంగం
7,79,365 :
జిల్లాలో జారీ చేసిన జాబ్‌కార్డులు
48,428
శ్రమశక్తి సంఘాలు
3,99,528
ఈ ఏడాది ఇప్పటి వరకు ఉపాధి పనులు చేసిన వారు
1,24,938
ఆధార్ అనుసంధానం కాని కూలీల సంఖ్య
రూ.7,42,13,188
ఆధార్ అనుసంధానం కాక తిరస్కరణకు గురైన కూలీల వేతన మొత్తం
ఉపాధి కూలీలు పనులు చేశారు.. డ్వామా అధికారులు వేతనాల బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి.. కానీ బ్యాంకులో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతవడంతో నెలల తరబడి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. మండుటెండలో గట్టినేలలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం దక్కకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
అనంతపురం టౌన్ : జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసే శ్రమశక్తి సంఘాలు 48,428 ఉన్నాయి. ప్రభుత్వం 7,79,365 జాబ్‌కార్డులు జారీ చేయగా 7,74,657 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,99,528 మందికి ఉపాధి పనులు కల్పించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 6,51,981 మంది కూలీలు పనులకు వెళ్తున్న జాబితాలో ఉన్నారు. గతంలో ఉపాధి కూలీలకు తపాలా శాఖ ద్వారా వేతనాలు చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి నుంచి నేరుగా కూలీల బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో చాలా మంది కూలీలకు ఖాతాలు లేవు.
ఇన్‌యాక్టివ్‌లో లక్ష ఖాతాలు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,92,325 మంది ఖాతాలు మాత్రమే యాక్టివ్‌లో ఉండగా 1,24,938 మంది ఖాతాలు ఇన్‌యాక్టివ్ జాబితాలో ఉన్నాయి. తాజా నిబంధనల మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సర్వర్‌కు కూలీల బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. అయితే పెద్ద సంఖ్యలో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని నేపథ్యంలో వేలాది మందికి పనులు చేసినా నగదు జమ కావడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకర్లకు చేరినా కూలీలు అందుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఎన్‌పీఐసీ సర్వర్‌కు అనుసంధానం ప్రక్రియ పూర్తయితేనే కూలీలకు సొమ్ము జమ అవుతుందని తెలిసినా, జిల్లా యంత్రాంగం మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు.
వివరాలు అందజేసినా...
ఉపాధి కూలీలు మండల కంప్యూటర్ సెంటర్ల (ఎంసీసీ)లో తమ వివరాలు అందజేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం కాని కూలీలు పనులకు వెళ్లినా, వారికి సంబంధించి నగదు తిరస్కరణ జాబితాలో చేరుతోంది. ఆదివారం (జూలై 2) నాటికి జిల్లా వ్యాప్తంగా 84,736 లావాదేవీలకు సంబంధించి రూ.7,42,13,188 తిరస్కరణకు గురైంది. ఆధార్ అనుసంధానం విషయంలో ధర్మవరం, ఎన్‌పీ కుంట, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు మండలాలు మాత్రమే 85 శాతానికి పైగా పురోగతి సాధించాయి. అగళి, అమరాపురం, బొమ్మనహాళ్, సీకే పల్లి, హిందూపురం, కంబదూరు, కుందుర్పి, మడకశిర, రొద్దం, రొళ్ల, శెట్టూరు తదితర మండలాల్లో ఇంకా 30 శాతానికి పైగా కూలీల ఖాతాలు అనుసంధానం కావాల్సి ఉంది.
బ్యాంకర్లతో సమస్య వస్తోంది
కూలీలకు ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలయ్యాయి. కానీ బ్యాంకర్లతో సమస్య వస్తోంది. కొందరు కూలీలు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా నగదు జమ కాకపోవడానికి కారణం. అలాంటి వారంతా కొత్త అకౌంట్ వివరాలను ఎంసీసీల్లో అందజేయండి. ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాల రీ షెడ్యూల్ జరుగుతుండడంతో వారు కూలీల గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో 610 మంది బ్యాంక్ కరస్పాండెంట్లున్నారు. వారంతా ప్రత్యేక డ్రైవ్ చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉపాధి కూలీల ఖాతాల సమస్య తీర్చేందుకు త్వరలోనే వారికి శిక్షణ ఇస్తాం. వేతన బకాయిలు ఓ వైపు క్లియర్ అవుతుంటే మరోవైపు జమ అవుతున్నాయి.
-నాగభూషణం, డ్వామా పీడీ
రూ. 20 వేలకుపైగా రావాలి
నేను ఉపాధి పనులపైనే ఆధారపడి జీవిస్తున్నా. 25 వారాల కూలి డబ్బు రూ.20 వేలకు పైగా రావాలి. అధికారులను అడిగితే ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్ వాళ్లను అడిగితే అన్నీ సక్రమంగానే ఉందంటున్నారు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. మా ఊళ్లో నాతో పాటు ఇంకా చాలా మందికి 20 వారాలకు పైగా డబ్బులు రావడం లేదు. పనులు చేసి డబ్బులకోసం తిరగాల్సి వస్తోంది.
- గోపాల్‌నాయక్, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం
బ్యాంకోళ్లు విసుక్కుంటున్నారు
నేను, నా భర్త ఇద్దరం ఉపాధి పనులు చేస్తాం. మా ఆయన డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. నాకు మాత్రం 18 వారాలుగా కూలి డబ్బులు రావడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టంచుకోవడం లేదు. ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్‌కు వెళితే ఎన్నిసార్లు తిరుగుతావమ్మా అంటూ విసుక్కుంటున్నారు. సమస్య ఎక్కడుందో తెలీక బేజారొస్తోంది. అసలు మా డబ్బులు వస్తాయో లేదో కూడా తెలియదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు డబ్బులు రాకపోతే వారిని ఎలా పోషించుకోవాలి.
-చిట్టెమ్మ, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం
కూలి కష్టం దక్కలే!
Published Sun, Jul 2 2017 11:01 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement