బ్లాకుకు వైట్ రైట్ రైట్
-
అధికార దుర్వినియోగం
-
సాక్షాత్తు బస్టాండ్‌లోనే కండక్టర్ల నుంచి నగదు మార్పిడి
-
పెద్ద నోట్లు మార్చినట్టు ఒప్పుకున్న ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం నాగేశ్వరరావు
రావులపాలెం :
పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం కొన్ని సేవల విషయంలో కల్పించిన వెసులుబాటును ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నల్ల ధనాన్ని తెలుపుగా మార్చుకుంటున్నారు. సాక్షాత్తు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారి తన సొంత సొమ్ము రూ.500, రూ.1000 నోట్లను ఆదివారం దర్జాగా కండక్టర్ల నుంచి మార్చుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులను గుర్తిం చిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఈ నెల 14 వరకూ పాత నోట్లను తీసుకోవాలని ఆదేశించింది. దీన్ని కొం దరు అధికారులు, సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రయాణికుల నుంచి టికెట్ల రూపంలో వసూలైన చిల్లర నోట్లను వారు తీసుకుని తమ సొంత సొమ్ము (పెద్ద నోట్లును) సంస్థకు జమ చేస్తున్నారు.
ఆర్టీసీ రాజమండ్రి డిప్యూటీ సీటీఎం ఆర్.వి.ఎస్.నాగేశ్వరరావు ప్రభుత్వ వాహనంలో రావులపాలెం బస్టాండ్‌కు ఆదివారం వచ్చారు. ఇన్ గేటు వద్ద వాహనాన్ని నిలిపి స్థానిక ఆర్టీసీ సిబ్బంది సాయంతో పలు బస్సులను ఆపించి సదరు కండక్టర్ల వద్ద నుంచి టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన వంద, ఇతర చిల్లర నోట్లను తీసుకుని దానికి సరిపడా రూ.500, వెయ్యి నోట్లు ఇవ్వ డం ప్రారంభించారు. అడిగేది తమ ఉన్నతాధికారి కావడంతో కండక్టర్లు ఆయన చెప్పినట్టు చిల్లర నోట్లు ఇచ్చి అందుకు సరిపడా పెద్ద నోట్లు తీసుకున్నారు. మొదట్లో ఈయన విధి నిర్వహణలో భాగంగా వచ్చి ఉంటారని అంతా భావించారు. అయితే తనతోపాటు తెచ్చుకున్న సూట్‌కేసు నుంచి నగదు తీసి, మార్చడం చూసి స్థానికులకు విషయం అర్థమయింది. దీంతో వెంటనే కొందరు ‘సాక్షి’కి సమాచారం అందించారు.
అక్కడి చేరుకుని ఈ వ్యవహారాన్ని కెమెరాలో బంధించడంతో సదరు అధికారి కంగుతిన్నారు. దీనిపై ఆయన్ను ‘సాక్షి’ వివరణ కోరగా నీళ్లు నమిలారు. రెండు రోజులుగా నగదు మార్పిడి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించగా ఈ రోజు మాత్రమే తాను నగదు మార్పిడి చేసినట్టు ఒప్పుకున్నారు. రూ.20 వేల వరకూ పాత నోట్లను కండక్టర్ల నుంచి మార్చానన్నారు. పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉండగా ఇలా ఎందుకు మార్పిడి చేస్తున్నారని ప్రశ్నించగా తన అవసరాల కోసం అంటూ నీళ్లు నమిలారు. అనంతరం అక్కడ నుంచి జారుకున్నారు. గతంలో ఈ అధికారి ఇక్కడ డీఎంగా పని చేయడంతో ఇక్కడ నగదు లావాదేవీలపై ఒక అవగాహన ఉండటం వల్లే ఇక్కడ నగదు మార్పిడికి తెరలేపారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదే విధంగా ఆర్టీసీలో రెండు మూడు రోజులుగా ఇతర అధికారులు కూడా భారీ ఎత్తున పెద్ద నోట్లు మార్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.