సమైక్య సెగ ఢిల్లీని తాకాలి
Published Thu, Aug 8 2013 3:53 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
కురబలకోట, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, సమైక్యంగా ఉండడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన కురబలకోట మండలం అంగళ్లుకు వచ్చారు. అక్కడి సమైక్య ఉద్యమ సారథి గోల్డన్‌వ్యాలీ రమణారెడ్డి, జేఏసీ కన్వీనర్ వై.సతీష్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు.
అంగళ్లులో జరిగిన బహిరంగ సభలో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీని తాకాలని పిలుపునిచ్చారు. కొడుకు కోసం సోనియా రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. మన రాష్ట్రం వారు కాకుండా బయటి రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అధి నాయకులు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తరాలుగా కలసి ఉన్న తెలుగువారి విభజన దేశానికే ముప్పన్నారు. సమైక్యవాదాన్ని వినిపించడానికే తాను బస్సు యాత్ర ప్రారంభించానని వెల్లడించారు.
రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో తిరగనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన లేదని కేంద్రం హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు విశాలాంధ్ర సభ నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదవీ కాంక్షతో రగులుతున్న కేసీఆర్, అతని పరివారం మాత్రమే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులను నిలదీయడం ద్వారా సమైక్యాంధ్ర సాధన సులభమవుతుందన్నారు.
Advertisement