విధిలేక..విక్రయం | sheeps sale to telangana | Sakshi
Sakshi News home page

విధిలేక..విక్రయం

Published Sun, Aug 6 2017 10:50 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

విధిలేక..విక్రయం

విధిలేక..విక్రయం

- తెలంగాణకు తరలుతున్న జీవాలు
- మేతలేక..సాయం అందక గొర్రెలను అమ్ముకుంటున్న కాపరులు
- పట్టించుకోని పశుశాఖ, ప్రభుత్వం


పేరుకు వర్షాకాలం...ఎక్కడా పచ్చగడ్డి లేదు. పంటలన్నీ ఎండిపోయాయి...ప్రత్యామ్నాయంగా ఉన్న గొర్రెల పెంపకం చేపట్టినా మేతకు కరువు... ఆదుకోవాల్సిన సర్కార్‌...అసలేమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కాపరులు జీవాలను తెగనమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి రైతులకు గొర్రెల పెంపకానికి భారీ ఎత్తున సాయం చేస్తుండడంతో అక్కడి రైతులంతా అనంతను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా అనంత జీవాలు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్‌:

అమ్మేసి కూలీ పనిచేసుకుంటా
వర్షాలు లేక పచ్చిమేత కరువైంది. కొందామన్నా ఇతర రైతుల దగ్గర మేత లేదు. జీవాలు ఎలా పోషించుకోవాలో తెలియడం లేదు. తెలంగాణ వాళ్లు కొంటున్నారంటే 40 గొర్రెలను సంత తీసుకువచ్చా. అడిగి వెళ్లారు. రేటు దగ్గర కొంచెం తేడా ఉంది. గొర్రెలు విక్రయించాక రైల్వేకోడూరుకు వెళ్లి అక్కడ ఇసుక లారీలకు కూలీకి వెళతా.
- నరసింహనాయక్, నాగులగుడ్డంతండా, శింగనమల

అడిగారు... అమ్మలేదు
మేత లేకపోవడం 100 గొర్రెలను నార్పల మండలం కేసేపల్లి దగ్గర మేపుకు తీసుకెళ్లా. ఆ ప్రాంతానికి చాలా మంది కాపర్లు గొర్రెలను తీసుకువచ్చారు. అక్కడికే తెలంగాణ డాక్టర్లు, దళారులు, కొందరు రైతులు కూడా వచ్చారు. జత రూ.11 వేల ప్రకారం అడిగినా ఇవ్వలేదు. వయస్సు, బరువు, ఆరోగ్యాన్ని బట్టి జత రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అడుగుతున్నారు. కేసేపల్లి దగ్గర చాలా మంది బేరం కుదుర్చుకుని అమ్ముకుంటున్నారు. మన ప్రభుత్వం, అధికారుల నుంచి ఏదీ అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది.
-నరకుల నారాయణ, తలుపూరు, ఆత్మకూరు
 
ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు
చంద్రబాబు ప్రభుత్వం నుంచి గొర్రెల కాపర్లకు ఎలాంటి సాయమూ లేదు.  తెలంగాణలో గొర్రెలు పెంచేందుకు భారీ ఎత్తున సాయం చేస్తుండటంతో చాలా మంది ఇక్కడికి వచ్చి కొంటున్నారు. రేటు కూడా బాగానే ఉండటంతో కొందరు అమ్ముకుంటున్నారు. ఇక్కడ కనీసం మేపుకు కూడా ఇబ్బందిగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది.  
- ముత్యాలప్ప, రామచంద్రాపురం, కూడేరు

వేయికి పైగా కొన్నాం
మేము (నలుగురు)  ఇప్పటివరకు అనంతపురం జిల్లాలోని వేయి గొర్రెలకు పైగా కొన్నాం. తెలంగాణలో గొర్రెల పథకం ఉండటంతో అక్కడ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. నాతో పాటు చాలా మంది రైతులు, కొందరు దళారులు రాయలసీమ జిల్లాల్లో కొంటున్నారు. వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి కొంటున్నాం.  
- రవి, రైతు, మల్లేపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ
   
ఉమ్మడి రాష్ట్రంలో టాప్‌
గొర్రెలు, మేకల సంపదలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌ అటు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 38.79 లక్షల సంఖ్యలో గొర్రెలు, 7.85 లక్షల వరకు మేకలు ఉన్నాయి. దాదాపు 50 వేల కుటుంబాలు జీవాల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వరుస కరువులు రైతులను కష్టాల్లోకి నెట్టేసినా గొర్రెలు, మేకల పెంపకం కొంత వరకు ఆదుకుంటున్నాయి. అయితే ఇపుడు ‘అనంత’ జీవాలు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటిపోతుండంతో ఆందోళన నెలకొంది. రాయితీతో పెద్ద ఎత్తున గొర్రెల పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు పథకాన్ని అమలు చేయడానికి  ‘అనంత’ జీవాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. లక్షలకు లక్షలు గొర్రెలు తెలంగాణకు అవసరం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించారు. అందులోనూ మేలుజాతి సంపద కలిగిన జిల్లాను ఎన్నుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణకు చెందిన అధికారులు, రైతులు, దళారులు చాలా మంది జిల్లాలో మకాం వేసి జల్లెడ పడుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగే గొర్రెల సంతలో హల్‌చల్‌ చేస్తుండగా, ఎక్కువ మందలు కలిగిన మండలాలు, గ్రామాల్లో కూడా పర్యటిస్తూ కాపర్లను కలుస్తున్నారు.  ఒక జత గొర్రెలకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు చెల్లిస్తూ నాణ్యమైన గొర్రెలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. అందులోనూ ఎర్ర రంగు గొర్రెలకు గిరాకీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వరుస కరువులతో ఆర్థికంగా దిగజారిపోయిన కొందరు కాపర్లు డబ్బు అవసరంతో జీవాలను అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో తెలంగా౾ణ వాసుల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రెండు లక్షలు
ఇప్పటికే రెండు లక్షలకు పైగా గొర్రెలు కొనుగోలు చేసి సరిహద్దులు దాటించినట్లు తెలుస్తోంది. ఇంకా వ్యాపారం కొనసాగిస్తుండటంతో మరింత తగ్గిపోయే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. 38 లక్షల గొర్రెల్లో రెండు మూడు లక్షల గొర్రెలు అమ్మినా ఇబ్బంది లేదని భావిస్తున్నా... అమ్మినవన్నీ సంతానోత్పత్తికి పనికివచ్చే నాణ్యమైనవి కావడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ (రెండంకెల వృద్ధిరేటు) కూడా తగ్గే పరిస్థితి ఉందంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కాపర్లు, వాటిపై ఆధారపడిన పేద వర్గాల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే పరిస్థితి ఉందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఇంకెన్ని తగ్గిపోతాయో, ఎంత మంది జీవానాధారం కోల్పోతారనేది అంతుచిక్కడం లేదు. పరిస్థితి ఇలాగుంటే కాపర్లలో అవగాహన కల్పించి ప్రోత్సహించడంతో పశుసంవర్ధకశాఖ అధికారులు విఫలమవుతున్నారు.

జిల్లాలో ఉన్న గొర్రెల సంఖ్య        : 38.79 లక్షలు
మేకల సంపద                : 07.85 లక్షలు
గొర్రెల, మేకల పెంపకందారులు    : 48 వేల కుటుంబాలు
గొర్రెల సొసైటీలు            : 295
అందులో సభ్యులు            : 12 వేల మంది
తెలంగాణకు విక్రయించిన  గొర్రెలు        : 2 లక్షలకు పైబడి అంచనా
కర్ణాటకకు వెళ్తున్న గొర్రెలు        : 50 వేలకు పైబడి అంచనా
విక్రయించేందుకు సిద్ధంచేసిన గొర్రెల సంఖ్య        : 3 లక్షలకు పైబడి అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement