రైతుల్లో గూడ్స్ గుబులు
రైతుల్లో గూడ్స్ గుబులు
Published Wed, Sep 14 2016 7:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
గొల్లపూడి (విజయవాడ రూరల్) : విజయవాడ రైల్వే జంక్షన్‌లో ప్రయాణికుల రద్దీ రాను రాను పెరుగుతోంది. ఈనేపధ్యంలో గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్‌కు రాకుండా ప్రత్యేక రైల్వే మార్గం నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్, అహ్మాదాబాద్, ముంబాయి ఆ పై ప్రాంతాల నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌కు రాకుండా కొండపల్లి నుంచి గన్నవరం వెళ్లే విధంగా ప్రత్యేక మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ ఇప్పటికే 306 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిసింది. అయితే ప్రత్యేక రైల్వే లైను వేసేందుకు అవసరమైన భూములను తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు భూముల యజమానుల వివరాలను సేకరించింది. గొల్లపూడి,రాయనపాడు, గ్రామాల్లోని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుతో తమ భూములు కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. రాయనపాడు, గొల్లపూడి ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో ఈ మార్గం నిర్మించనున్నట్లు తెలిసింది. గొల్లపూడిలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారి ఎలైన్‌మెంటుకు ఉత్తరంగా వంద అడుగుల దూరంలో ఈ రైల్వే మార్గం ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం భూసేకరణ చేసి భూములను తీసుకొంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రిజిస్ట్రేషన్ ధరకు మూడు రేట్లు వస్తోందని, అయినా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువతో పోల్చుకుంటే తక్కువేనని సంబంధిత భూ యజమానులు అంటున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 25 లక్షల రూపాయలుండగా మూడు రేట్లు వస్తే 75 లక్షలేనని, మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైగా ఉందని చెబుతున్నారు. రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఉన్న గొల్లపూడిలో భూములధరలు పై పైకి వెళతాయని ఆశపడిన వ్యాపారులు గూడ్సు రైల్వే మార్గంతో నష్టపోతామని తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో రియల్ ఎస్టేటు వ్యాపారులు ఎలైన్‌మెంట్‌ను మార్పుచేయించేందుకు రాజకీయనాయకుల ద్వారా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మూడు ఎక్స్‌ప్రెస్ రైలు లైన్లు గొల్లపూడి గ్రామాన్ని తాకుతూ వెళ్తున్నాయని, ఆరు విద్యుత్‌టవర్లు నిర్మించడంతోlఎంతో నష్టపోయామని గ్రామస్తులు అంటున్నారు.
Advertisement