
హౌస్ ఫర్ ఆల్‌లో పైసా వసూల్
► ఇళ్లు ఇప్పిస్తామని టీడీపీ నాయకుల వసూళ్ల పర్వం
► భూమి సమీకరణ పూర్తికాకముందే ఆర్భాటంగా శంకుస్థాపన
► అర్హుల నిర్ధారణకు బృందాల విచారణను అడ్డుకుంటున్న వైనం
► ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు
► 6,630 ఇళ్లకు గాను తొలి విడతలో 3 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణం
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో ఇళ్లు లేని నిరుపేదలందరికీ బహుళ అంతస్థుల సముదాయంలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. పథకానికి ఈ ఏడాది జూన్ 19వ తేదీన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు హడావుడిగా శంకుస్థాపన చేశారు. 54 ఎకరాల్లో 6,630 గృహాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం టిడ్‌కో సంస్థకు 54 ఎకరాల భూమి అప్పగించి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, కొంత భూమి కోర్ట వివాదంలో ఉండటంతో కేవలం 24 ఎకరాల భూమి మాత్రమే అప్పగించింది.
శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటుతున్నా భూమిని అప్పగించకపోవడంతో ఇప్పటివరకూ పనులు ప్రారంభించనే లేదు. ప్రస్తుతం పనులు దక్కించుకున్న టిడ్‌కో సంస్థ అప్పగించిన 24 ఎకరాలనే చదును చేసి 3 వేల గృహాలు నిర్మించనుంది. వివాదం ఎప్పుడు తేలుతుందో? మిగతా భూమి ఎప్పుడు అప్పగిస్తారో తెలియని పరిస్థితి. మిగతా 3,630 గృహాల నిర్మాణం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.
మరో 3,370 నిర్మాణాలు?
రెండో విడతలో మరో 3,370 గృహాలు నిర్మిస్తామంటూ అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భూసమీకరణ మాత్రం ఇప్పటికీ సమస్యగానే ఉంది. వీరికి అడవి తక్కెళ్లపాడులో స్థలం లేకపోవడంతో చౌడవరం, మరో విలీన గ్రామంలో స్థలం సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ప్రభుత్వానికి చెల్లింపులు ఇలా..
ఈ పథకానికి సింగిల్ బెడ్‌రూమ్ అయితే లబ్ధిదారుడు రూ. 50 వేలు, డబుల్ బెడ్‌రూం అయితే రూ. లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల రాయితీ లభిస్తుంది. మిగతా నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటిని లబ్ధిదారుడు నెలనెలా చెల్లించాల్సి ఉంటుంది.
అక్రమాలు బయటపడతాయని విచారణ అడ్డగింపు..
పదివేల మందితో కూడిన లబ్ధిదారుల జాబితాపై విచారణ జరిపేందుకు గాను నగరపాలక సంస్థ పరిధిలో 16 బృందాలు ఏర్పడ్డాయి. విచారణ జరిపితే తమకు అనుకూలంగా అనర్హులకు ఎక్కడ ఇళ్లు రాకుండా పోతాయోనన్న భయంతో టీడీపీ డివిజన్‌స్థాయి నాయకులు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఆపుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకూ బొక్కేసిన టీడీపీ నాయకులు జాబితా ప్రకటించక ముందే వారి నుంచి డీడీలుసైతం సేకరించారని తెలుస్తోంది. డీడీలు ఇవ్వకపోతే ఇల్లు రాదేమోననే భయంతో లబ్ధిదారులు డీడీలు తీసి మరీ అధికార పార్టీ నేతలకు అప్పగించడం మమనార్హం. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అసలు ఇల్లు ఎక్కడ ఇస్తారు? అనే సమాచారంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది.
24 ఎకరాల్లో 3 వేల ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు..
హౌస్ ఫర్ ఆల్ ద్వారా మొదటి విడతలో 54 ఎకరాల్లో 6,630 గృహాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. ప్రతిపాదిత భూమిలో కొంత కోర్టు వివాదాల్లో ఉండటంతో కేవలం 24 ఎకరాల్లో ప్రస్తుతం 3 వేల ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నాం. ఈలోపు మిగతా భూమి కూడా అప్పగిస్తే రెండో విడత ప్రారంభిస్తాం. మరో 3,370 గృహాలు నిర్మిస్తాం. అధికారులు ఇప్పటికే అన్వేషణలో ఉన్నారు. భూమి సమీకరించగానే టెండర్లు పిలుస్తాం. – టిడ్‌కో ఎస్‌ఈ కోటేశ్వరరావు