ఎన్నాళ్లీ.. నరకయాతన!
స్ట్రాం వాటర్ డ్రెయిన్ టెండర్లకు మోక్షమెప్పుడో?
ఏడాదిన్నర క్రితమే కేంద్ర నిధుల మంజూరు
ఇంకా టెండర్ల దశ దాటని వైనం
మున్సిపల్ మంత్రే అడ్డుపడుతున్నారని ఆరోపణలు
వరదనీటి సమస్యతో నగరవాసుల ఇక్కట్లు
విజయవాడ సెంట్రల్ : నగరంలో స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం ఓ ప్రహసనంలా మారింది. కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ నుంచి స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.461.04 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. గతేడాది మేలో తొలి విడతగా సుమారు రూ.140 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తాన్ని రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వులో పెట్టింది. నగర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, విజయవాడ రాజధానిలో అంతర్భాగమే కాబట్టి నిధుల్ని మంజూరు చేయాలని ఎంపీ కేశినేని నాని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌కు లేఖ రాశారు. అయితే స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిధులు పక్కదారి పట్టిస్తే కుదరదని చంద్రబాబుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెగేసి చెప్పారు. దీంతో నిధుల విడుదలకు సీఎం అంగీకరించారు.
మంత్రి, మేయర్ కీచులాట!
ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపొందించారు. వంద కిలోమీటర్ల మేర పెద్ద డ్రెయిన్లు, 38 కిలోమీటర్ల మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. ఇంతా చేశాక పనులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించటం విశేషం. మున్సిపల్ మంత్రి పి.నారాయణ అందులో అత్యుత్సాహం చూపారనే వాదనలు ఉన్నాయి. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ టెండర్లు పిలుస్తోందని, నగరపాలక సంస్థ పర్యవేక్షణలో పనులు చేసుకోవచ్చని సీఎం చంద్ర బాబు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇది జరిగి ఐదు నెలలు గడిచినా టెండర్ల ప్రస్తావనే లేకుండా పోయింది. తనమాట చెల్లుబాటు కానీయలేదన్న ఉద్దేశంతో మున్సిపల్ మంత్రే టెండర్ల ప్రక్రియకు అడ్డుపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మూడేళ్లలోపు పూర్తవటం కల్లే..
కేంద్రం నిధులతో చేపట్టే స్ట్రాం వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. లేదంటే నిధులు మురిగిపోతాయి. నిధుల వినియోగానికి సంబంధించి ఆరు నెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుపట్టే అవకాశం ఉంది. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణంపై శీతకన్ను వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో మూడు నెలల తరువాత పనులు ప్రారంభమైనా షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదు.
వానొస్తే వరదే...
వానొచ్చిందంటే నగరంలో కొన్ని ప్రాంతాలకు వరదొస్తోంది. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన నగర మేయర్ కోనేరు శ్రీధర్ వర్షపు నీటిలో చిక్కుకున్నారు. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటిదాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. డ్రెయిన్ల గుండానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. వన్‌టౌన్, సర్కిల్ 3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.